అల్లాహ్‌ సాన్నిహిత్యం కోసం..

ఇస్లామిక్‌ కేలండరు ప్రకారం జిల్‌ హజ్‌ పన్నెండో నెల. ఈ నెలలో పదో రోజున ఈదుల్‌ బక్రీదు (అజ్హా) పండుగ. దీనికి ఒకరోజు ముందు ప్రపంచం నలుమూలల నుంచి హజ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులంతా అరఫాత్‌ మైదానంలో విడిది చేస్తారు

Published : 22 Jun 2023 00:29 IST

ఇస్లామిక్‌ కేలండరు ప్రకారం జిల్‌ హజ్‌ పన్నెండో నెల. ఈ నెలలో పదో రోజున ఈదుల్‌ బక్రీదు (అజ్హా) పండుగ. దీనికి ఒకరోజు ముందు ప్రపంచం నలుమూలల నుంచి హజ్‌ యాత్రకు వెళ్లిన యాత్రికులంతా అరఫాత్‌ మైదానంలో విడిది చేస్తారు. అరఫాదినంగా ప్రసిద్ధమైన ఆ రోజున ఉపవాసం పాటించడం ప్రవక్త (స) సంప్రదాయం. ఈ ఒక్కరోజు ఉపవాసం ఏడాది పాటించిన ఉపవాసాలకు సమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, రెండేళ్ల పాపాలు తుడుచుకుపోతాయన్నది ముస్లిముల విశ్వాసం. రంజాన్‌ ఉపవాసం పాటించినట్లుగానే ఈ ఉపవాసాన్ని పాటించాలి. తెల్లవారు ఝామున సహెరీ భుజించి ఉపవాసాన్ని ప్రారంభించాలి. సూర్యుడు అస్తమించాక ఖర్జూరంతో ఇఫ్తార్‌ చేసి ఉపవాసాన్ని విరమించాలి. జిల్‌ హజ్‌ నెల తొలి పది రోజులూ మరింత పవిత్రమైనవని ఖురాన్‌ పేర్కొంది. ఈ కాలంలో చేసిన పుణ్యకార్యాలు అల్లాహ్‌కు అన్నిటి కన్నా ప్రియమైనవని ప్రవక్త చెప్పారు. అందుకే ఈ పది రోజులూ ఉపవాసాలు పాటించడం పుణ్యప్రదం అంటారు ఉలమాలు. రంజాన్‌లో తప్పిపోయిన ఉపవాసాలను ఈ పదిరోజుల్లో పూర్తిచేసుకోవడం ఉత్తమమని భావిస్తారు. హజ్‌ యాత్ర చేసేంత స్తోమత లేనివారు ఈ పది రోజులూ అత్యంత ధర్మబద్ధంగా గడపాలని, రాత్రులు వీలైనన్ని ఎక్కువ నమాజులు, దానధర్మాలు చేయాలని ప్రబోధిస్తారు. ‘లాయిలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీకలహు లహుల్‌ ముల్క్‌ వలహుల్‌ హందు వహువ అలా కుల్లి షైయిన్‌ ఖదీర్‌’ వాక్యాలను పఠించి అల్లాహ్‌ను వేడుకోవాలి.
ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని