త్యాగానికి సంకేతం బక్రీద్‌

అల్లాహ్‌ ఆరాధనకోసం నిర్మించిన కాబా గృహం ఇప్పుడు మహా కేంద్రంగా మారింది. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో చివరిదైన జిల్‌ హజ్‌ నెలలో ప్రపంచ నలుమూలల నుంచి హజ్‌ యాత్రకోసం మక్కా చేరుకుంటారు.

Updated : 29 Jun 2023 02:56 IST

‘అందరికి ఉపయోగపడే కేంద్రంగా, శాంతినిలయంగా ఈ కాబా గృహాన్ని తీర్చిదిద్దాను. ఇబ్రాహీం ఆరాధన కోసం ఉన్న ప్రదేశాన్ని నమాజు స్థలంగా చేసుకోవలసిందని ప్రజలను ఆదేశించాను. ప్రదక్షిణ చేసేవారు, ఏతెకాఫ్‌ పాటించేవారు, రుకూ, సజ్‌దాలు చేసేవారి కోసం ఈ గృహాన్ని పరిశుద్ధంగా ఉంచమని హజ్రత్‌ ఇబ్రాహీం(అలై), ఇస్మాయిల్‌(అలై)లను నిర్దేశించాను’ ఇది పవిత్ర ఖురాన్‌ వాక్యం.

అల్లాహ్‌ ఆరాధనకోసం నిర్మించిన కాబా గృహం ఇప్పుడు మహా కేంద్రంగా మారింది. ఇస్లామిక్‌ క్యాలెండర్‌లో చివరిదైన జిల్‌ హజ్‌ నెలలో ప్రపంచ నలుమూలల నుంచి హజ్‌ యాత్రకోసం మక్కా చేరుకుంటారు. కాబా గృహ ప్రదక్షిణలు చేసి అల్లాహ్‌ పట్ల భయ భక్తులను చాటుకుంటారు. ఐదు రోజుల హజ్‌ క్రతువులో భాగంగా మక్కా పుణ్య క్షేత్రంలో గడుపుతారు. హజ్‌ సందర్భం గా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. ముహమ్మద్‌ ప్రవక్త(స) ఒక్కసారి మాత్రమే హజ్‌ యాత్ర చేశారు.

ఖుర్బానీ అంటే జంతుబలి కాదు

స్తోమత ఉన్న ప్రతి ముస్లిమ్‌ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్‌యాత్ర చేయాలి. వివిధ జాతుల హజ్‌ యాత్రికులు ఒకచోట కలవడం వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహరణగా ఉంటుంది. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలామ్‌, ఆయన పరివారం చేసిన త్యాగాలను స్మరించుకుంటూ చేసుకునేదే ఈదుల్‌ అజ్హా (బక్రీద్‌). ఈ పండుగ రోజున ఖుర్బానీ ఇస్తారు. ఖుర్బానీ అంటే జంతుబలి అనుకుంటారు చాలామంది. నిజానికి త్యాగమని అర్థం. ఖురాన్‌లో అల్లాహ్‌ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. హజ్రత్‌ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమంతా పరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. కొడుకుగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా, విశ్వాసపాత్రుడైన దైవదాసుడుగా ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు.

అల్లాహ్‌ ఆజ్ఞ

త్యాగం, సహనం, నమ్మకాలను పెంపొందించే ఐదువేల సంవత్సరాల నాటి ఇబ్రాహీం ప్రవక్త గాథను బక్రీద్‌ రోజున స్మరించుకుంటారు. వయసు మీదపడిన ప్రవక్త లేకలేక కలిగిన కొడుకును ప్రాణానికి ప్రాణంగా పెంచుకోసాగారు. పుత్రుడి ముద్దు మాటలకు మురిసి పోయేవారు. అలాంటి సమయంలో దేవుడు పెద్ద పరీక్షే పెట్టాడు. ఒకరోజు తన బిడ్డను బలిచ్చినట్లు కలొచ్చింది. ఆ కలను దైవాజ్ఞగా భావించి బిడ్డకు వివరించి ‘కుమారా! ఈ విషయంలో నీ అభిప్రాయమేంటో చెప్పు’ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడైన బాలుడు ‘తండ్రీ! ఆ ఆజ్ఞను నెరవేర్చండి. నన్ను జిబహ్‌(బలి) ఇవ్వండి. అల్లాహ్‌ సంకల్పిస్తే నన్ను సహనశీలునిగా చూస్తారు’ అన్నాడు. అలా ఉభయులూ దైవాజ్ఞను శిరసావహించారు. పుత్రుడి మెడపై కత్తి పెట్టగానే బాలుడి స్థానంలో పొట్టేలు ప్రత్యక్షమైంది. అల్లాహ్‌ పెట్టిన పరీక్షలో ఇబ్రాహీం నెగ్గారు. దీని గురించి ‘ఇబ్రాహీమ్‌ తన పుత్రుణ్ణి బోర్లా పడుకోబెట్టి కత్తివేటు వేయబోయాడు. అప్పుడతనితో ‘ఇబ్రాహీమ్‌! నువ్వు కలను నిజం చేసి చూపించావు. సత్కార్యం  చేసేవారికి ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాం. నిశ్చయంగా ఇదో పరీక్ష. అతని కీర్తి ప్రతిష్ఠలు తర్వాతి తరాలవారికి శాశ్వతంగా నిలిచిపోయేలా చేశాం. ఇబ్రాహీమ్‌కు శాంతి కలుగుగాక! పొట్టేలును పరిహారంగా ఇచ్చి ఇస్మాయిల్‌ను విడిపించాడు అల్లాహ్‌’ అంటోంది దివ్య ఖురాన్‌. ఈ సంప్రదాయంతోనే ఖుర్బానీ ఇస్తారు.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని