ప్రేరణ కలిగించిన పసివాడు

భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ప్రవచనం చెప్పి కారులో ఇంటికి తిరిగెళ్తున్నారు. ఆ రాత్రివేళ దూరం నుంచి రామకథా గానం మధురంగా వినిపిస్తోంది.

Published : 13 Jul 2023 01:54 IST

భద్రాచలంలో శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ప్రవచనం చెప్పి కారులో ఇంటికి తిరిగెళ్తున్నారు. ఆ రాత్రివేళ దూరం నుంచి రామకథా గానం మధురంగా వినిపిస్తోంది. కారును అటు మళ్లించి గుడి వద్ద ఆపమన్నారు. తీరా గానం చేస్తున్నది పదేళ్లయినా నిండని బాలుడు. ఆ మధుర గానాన్ని అందరూ తన్మయంగా వింటున్నారు.

గానం పూర్తయింది. ఆయన కాసేపటి క్రితం తనకు కప్పిన శాలువా తీసుకెళ్లి మండపంలో బాలుడికి కప్పారు. బాలుడు కృతజ్ఞతగా కాళ్లకు నమస్కరించాడు. పెద్దాయన వంద నోటు తీసి ఇవ్వబోతే ససేమిరా తీసుకోక ‘ఈ మండపంలో మీ అందరి ఎదుటా రామకథను గానంచేయడం నా పుణ్యఫలం. ఇది చాలు.. ఇంతకంటే ఇంకేం కావాలి స్వామీ?!’ అన్నాడు వినయంగా.

ఆ మహనీయుడు బాలుడి భక్తికి ఆనందించారు. మనసులో మాత్రం అంతర్మథనం మొదలైంది. ‘నేను ఆనంద పారవశ్యంతో రాసిన రామాయణ కల్ప వృక్షానికి జ్ఞానపీఠంతో బాటు పెద్ద మొత్తం బహుమతిగా లభించింది. అవార్డు స్వీకరించి పైకం తీసుకోకుంటే బాగుండేది’ అని దిగులు చెందారు. ఆ తర్వాత కూడా బాలుడు గుర్తొస్తే ఆ స్వచ్ఛమైన భక్తికి సంతోషించేవారు. ఆ మహనీయుడే విశ్వనాథ సత్యనారాయణ. నిజమైన భక్తులు ఎంతటి వారికైనా ప్రేరేపించగలరు అనడానికి ఇదొక నిదర్శనం.

బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని