రంగుల గొడుగు

ఓ గ్రామంలో ఎందరో రైతులున్నారు. వాళ్లంతా ఏసుక్రీస్తును నమ్ముకున్నారు. ఆ ప్రాంతంలో వర్షాలు లేక పొలాలు బీడుభూములయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది.

Updated : 24 Aug 2023 05:42 IST

గ్రామంలో ఎందరో రైతులున్నారు. వాళ్లంతా ఏసుక్రీస్తును నమ్ముకున్నారు. ఆ ప్రాంతంలో వర్షాలు లేక పొలాలు బీడుభూములయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. చర్చి పాస్టరు- ‘వర్షం కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం’ అన్నారు. ఆ సమావేశానికి ఊరంతా తరలివచ్చింది. ప్రసంగించేందుకు పాస్టరు వేదిక వద్దకు చేరుకున్నారు. ఎవరికి వారే బంధుమిత్రులతో కులాసాగా మాట్లాడుతున్నారు. ఆహూతులను నెమ్మదిగా ఉండమని హెచ్చరించి, పాస్టరు వచ్చిన వారిని పరిశీలించారు. మొదటి వరుసలో కూర్చున్న ఒక చిన్నారిని చూడగానే ఆయన కళ్లు ఆనందంతో మెరిశాయి. ఆమె ఒక రంగుల గొడుగు పట్టుకుని ప్రార్థన చేసుకుంటోంది. అంతా వర్షం కోసం ప్రార్థించడానికి వచ్చినవారే కానీ ఎవరి చేతిలోనూ గొడుగు లేదు. ఆమె మాత్రమే తెచ్చింది. అంటే వారి ప్రార్థనలో వారికే నమ్మకం లేదన్నమాట. పాస్టరు అదే విషయాన్ని గుర్తుచేస్తూ.. ‘ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్న వాటినన్నిటినీ మనసులో ఎలాంటి సందేహం లేకుండా పొందినట్లుగా నమ్మండి. అప్పుడవి మీకు తప్పకుండా ప్రాప్తిస్తాయి.. (మార్కు 11:24) అన్నాడు ఏసుప్రభువు. అందువల్ల మనం ప్రార్థించి, అది నెరవేరుతుందనే విశ్వాసంతో ఉంటే.. నిశ్చయంగా అనుగ్రహిస్తాడన్నది బైబిల్‌ వాక్యం’ అంటూ చెప్పారు.

మర్రి ఎ.బాబ్జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని