చేతుల్లో దాగిన సందేశం

కర్ణుడు ఒకసారి రత్నాలు పొదిగిన స్వర్ణపాత్రలోంచి సున్నిపిండి తీసుకుంటున్నాడు. అప్పుడే వచ్చిన కృష్ణుణ్ణి ఆ పాత్ర ఆకర్షించగా అది తనకిమ్మన్నాడు. కర్ణుడు అసలే మహాదాత. ఇక శ్రీహరి అడిగితే కాదంటాడా?!

Updated : 31 Aug 2023 01:04 IST

కర్ణుడు ఒకసారి రత్నాలు పొదిగిన స్వర్ణపాత్రలోంచి సున్నిపిండి తీసుకుంటున్నాడు. అప్పుడే వచ్చిన కృష్ణుణ్ణి ఆ పాత్ర ఆకర్షించగా అది తనకిమ్మన్నాడు. కర్ణుడు అసలే మహాదాత. ఇక శ్రీహరి అడిగితే కాదంటాడా?! కుడిచేతికి నూనె ఉన్నందున రెండోచేత్తో అందివ్వబోయాడు. ‘ఎడమచేత్తో ఇచ్చే దానం గ్రహించరని నీకు తెలియదా కర్ణా?’ అన్నాడు కృష్ణుడు ఆట పట్టిస్తూ. దానికి కర్ణుడు ‘కృష్ణా! నూనెచేతిని కడుక్కునేంతలో నా దానగుణం మారుతుందనే భయంతో ఎడమచేత్తో ఇచ్చాను. దుష్ట త్రయంలో లోభం ఒకటి. ఆ లోభ గుణం నీకు దానం ఇవ్వకుండా ఆపుతుందనే భయం తప్ప ఎడమచేతిని వాడకూడదని తెలియక కాదు. దానం ఇవ్వడంలో చేసే జాప్యం విషతుల్యమౌతుంది. అది జన్మ చక్రంలో దారిద్య్రాన్ని ఇస్తుంది. అడిగిన వెంటనే చేసే దానం అమృత సమానం. ‘అదాన దోషేణ భవే దరిద్రః’ అన్నది ఆర్యోక్తి. అంటే దానం చేయకపోతే ధనహీనులుగా పుడతారు. అందుకే ఉన్నంతలో ఇవ్వడం నేర్చుకోవాలి. నువ్వీ చేతులు ఇచ్చిందే దానం చేయడానికి కదా!’ అంటూ చెప్పాడు. ఆ మాట లకు కర్ణుణ్ణి మెచ్చుకోలుగా చూస్తూ ‘చేతుల నుంచి నువ్వేం గ్రహించావో చెబితే వినాలనుంది’ అన్నాడు కృష్ణుడు. ‘వచ్చి నప్పుడు, పోయేటప్పుడు రిక్తహస్తాలే. ఈ చేతులు దేన్నీ తీసుకురావు, తీసుకెళ్లవు. లోకంలో ఉన్నంతవరకూ ఏది దానం చేస్తామో అది పదింతలై తిరిగి మనల్ని చేరుతుంది. ఇదే నువ్విచ్చిన చేతుల్లో దాగిన సందేశం’ అన్నాడు కర్ణుడు. దాన గుణం గొప్పదంటూ పుట్టపర్తి సాయిబాబా చెప్పిన కథ ఇది.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని