చేదునూ ఆస్వాదించాలి!

ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి మిత్రుడి తోటకు వెళ్లాడు. వాళ్లు తోటంతా తిరిగి ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. ఇంతలో యజమాని- తోటమాలిని పిలిచి.. కొన్ని పండ్లను కోసుకు రమ్మన్నాడు. అతడు వెళ్లి చాలా రకాల పండ్లను తీసుకొచ్చాడు. వాటిల్లో నిగనిగలాడుతున్న దోసపండు కూడా ఉండటంతో యజమాని దాన్ని కోసి.. ఒక ముక్క నోట్లో వేసుకుంటే చేదుగా ఉంది.

Published : 23 Nov 2023 00:07 IST
ఇస్లాం సందేశం
వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి మిత్రుడి తోటకు వెళ్లాడు. వాళ్లు తోటంతా తిరిగి ఒక చెట్టు కింద సేద తీరుతున్నారు. ఇంతలో యజమాని- తోటమాలిని పిలిచి.. కొన్ని పండ్లను కోసుకు రమ్మన్నాడు. అతడు వెళ్లి చాలా రకాల పండ్లను తీసుకొచ్చాడు. వాటిల్లో నిగనిగలాడుతున్న దోసపండు కూడా ఉండటంతో యజమాని దాన్ని కోసి.. ఒక ముక్క నోట్లో వేసుకుంటే చేదుగా ఉంది. తోటమాలికి ఆ సంగతి తెలియాలని ఒక ముక్క అందించాడు. అతడు మౌనంగా తిన్నాడు. అలా ఒక్కో ముక్క ఇస్తుంటే.. బాగుంది- అంటూ పండంతా తిన్నాడు. ‘ఏమయ్యా, ఇంత చేదుగా ఉంటే ఎలా తినగలిగావు?’ అనడిగాడు యజమాని. ‘తమరి దగ్గర ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాను. తియ్యటి పండ్లెన్నో తిన్నాను. ఒక్క చేదు ఫలం తినలేనా? ఆమాత్రానికే బాగాలేదని వంకపెట్టాలా?! ‘అల్లాహ్‌ దాసులు కష్టసుఖాలు, లాభనష్టాలు- ఏది ఎదురైనా అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తారు’ అనే ఖురాన్‌ వాక్యాన్ని అనుసరించాలి కదా’ అంటూ బదులిచ్చాడు. ఆ సంభాషణ విన్న మిత్రుడు ‘ఈ తోటమాలిని నాకు అమ్ముతావా?!’ అనడిగాడు. ‘ఎంతకు కొంటావో నువ్వే చెప్పు’ అన్నాడు యజమాని. ‘లక్ష దీనార్లు’ అంటే.. ‘లేదు లేదు’ అన్నాడు యజమాని. ‘పోనీ రెండు లక్షల దీనార్లు’ అన్నాడు స్నేహితుడు. దానికి యజమాని ‘నన్ను క్షమించు మిత్రమా! ఈ తోటమాలిని అమ్మేశాను’ అన్నాడు. ‘ఇంతలోనే ఎలా? ఎవరికి అమ్మావు?’ అని ఆశ్చర్యపోతుంటే.. ‘అల్లాహ్‌కే అమ్మేశాను’ అన్నాడు. ఆ తర్వాత యజమాని తోటమాలికి ఎన్నో కానుకలిచ్చి, సత్కరించి స్వేచ్ఛను ప్రసాదించాడు. ‘మౌలానా జలాలుద్దీన్‌ రూమీ’ గ్రంథంలోని ఈ గాథ  సుఖసంతోషాల్లో అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టాల్లో సహనం వహించాలని బోధిస్తుంది.
రున్నీసాబేగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని