గోవు వెంట లేగదూడలా..

శ్రీమహావిష్ణువు ఆంతరంగిక భక్తుడు అంబరీషుడు. ఆ రాజర్షిపై ఒకానొక సమయంలో దుర్వాస మహర్షి కినుక వహించాడు. తాను తాపసిని అన్న అహంకారంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తపోశక్తితో అంబరీషుడిపైకి ‘కృత్య’ అనే ఓ రాక్షసశక్తిని ప్రయోగించాడు.

Published : 04 Jan 2024 00:12 IST

శ్రీమహావిష్ణువు ఆంతరంగిక భక్తుడు అంబరీషుడు. ఆ రాజర్షిపై ఒకానొక సమయంలో దుర్వాస మహర్షి కినుక వహించాడు. తాను తాపసిని అన్న అహంకారంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తపోశక్తితో అంబరీషుడిపైకి ‘కృత్య’ అనే ఓ రాక్షసశక్తిని ప్రయోగించాడు. ఆ కృత్య ప్రళయాగ్నితో సమానమైన శూలాన్ని ధరించి ఆ మహారాజు పైకి విజృంభించింది. దుర్వాసముని చేసిన ఈ నిర్వాకాన్ని పాలకడలి నుంచి విష్ణుమూర్తి గమనించాడు. తన పరమభక్తుణ్ణి ఆ ఆపద నుంచి కాపాడటానికి సుదర్శన చక్రాన్ని పురమాయించాడు. ఆ అనంతాత్ముడి ఆజ్ఞను శిరసావహించి చక్రాయుధం ప్రళయ జ్వాలలతో దుర్వాసమునిని వెంబడించింది. అతడు భూమిలోకి దూరితే అది కూడా దూరింది. ముని సముద్రంలో మునిగితే తానూ మునిగింది. ఏ లోకానికి వెళ్లినా తరుముకొస్తున్న శ్రీహరి చక్రాయుధ మంటలను చల్లార్చేవారు లేకపోవటంతో దుర్వాసుడు చతుర్ముఖ బ్రహ్మను, అనంతరం పరమశివుణ్ణి ఆశ్రయించాడు.

వాళ్లు ముక్తకంఠంతో ‘మునీంద్రా! ఆ విశ్వేశ్వరునిలో బ్రహ్మాండాలు పుడుతుంటాయి, గిడుతుంటాయి. సమస్త లోకాలకూ అధినేత ఆయనే. చివరికి మేమందరం కూడా ఆ లోకనాయకుడి అధీనంలోనే ఉన్నాం. జగన్నాథుడి సుదర్శనచక్రాన్ని నిలువరించే శక్తి మాకు లేదు. నువ్వు ఆయన్నే శరణు వేడు!’ అని హితవు పలికారు.  బ్రహ్మ, మహేశ్వరుల సూచన మేరకు దుర్వాసుడు వైకుంఠానికి పరుగుతీశాడు. శేషతల్పంపై లక్ష్మీదేవితో సరసోక్తులాడుతున్న శ్రీహరిని చూసి ‘స్వామీ! భక్త రక్షణ పరాయణా! నీ సుదర్శన చక్రపు మంటలను అంతరింపచేయి నాయనా! నా అజ్ఞానాన్ని, అహంకారాన్ని మన్నించు ప్రభూ!’ అంటూ స్వామి పాదాలను ఆశ్రయించాడు. అప్పుడు ఆ కరుణాంతరంగుడు మందహాసంతో ‘ఓ మహర్షీ! దయాసాగరులు, సాధుపుంగవులు నా హృదయాన్ని కొల్లగొట్టుకొని పోతుంటారు. పవిత్రమైన భక్తి అనే తీగెలతో నేర్పుగా నన్ను కట్టిపడేస్తారు.  ఆ బంధాలకు చిక్కిన నేను వాళ్ల మీది ప్రేమతో వారిని వదలి వెళ్లలేను. నా భక్తుడైనవాడు నా క్షేమాన్నే కోరుకుంటాడు. భక్తులకు నేనే దిక్కు. గోవు వెంట వెళ్లే లేగదూడలా.. భక్తుడు ఎటు వెళ్తే నేనటు వెళ్తాను’ అన్నాడు. నిజమైన భక్తులు భగవంతుణ్ణి తమ భక్తితో కట్టిపడేస్తారనటానికీ, తనను ఆశ్రయించేవారిపై పరమాత్మకు అంత శ్రద్ధ, ప్రేమ ఉంటాయనడానికీ ఈ ఉదంతం ఒక నిదర్శనం.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని