నిగూఢసత్యం

పేదరికం అంటే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ధనహీనత కాదు. ఆత్మ విషయమై దీనులైనవారు అసలైన పేదలు.

Published : 18 Jan 2024 00:07 IST

పేదరికం అంటే ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ధనహీనత కాదు. ఆత్మ విషయమై దీనులైనవారు అసలైన పేదలు. ఇది ఏసుప్రభువు చెప్పిన మాట. ధర్మాచరణతో ముందుకు సాగుతూ, దీవెనలు అందుకునేవారే ధనికులు. వాళ్లు ఉన్నతాశయంతో దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తారు. శాంతి పొందుతారు. దైవ రాజ్యం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. అదెంతో ఉత్కృష్టమైంది. అక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయి. అందులో స్థానం సంపాదించుకుంటే.. నిశ్చయంగా గొప్పవారని చెప్పక తప్పదు. ఎందుకంటే.. పర లోక రాజ్యంలో స్థానం లేనట్లయితే శాశ్వతంగా అగ్నిగుండంలోనే నివసించాల్సి వస్తుంది. అది దుర్భరం. ఇక్కడ ఆనందించడానికి సమయం లేదు కనుక మారు మనసు పొంది దేవుడి రాజ్యం కోసం సిద్ధపడమని హితవు పలికాడు ప్రభువు. ఇక్కడ ఓ ఉదంతాన్ని గుర్తు చేసుకోవాలి.. లాజరు అనే ఒక నిరుపేద హీన స్థితిలో జీవించే వాడు. అతడికి సమీపంలో ఓ ధనికుడు ఉండే వాడు. వాళ్లిద్దరూ ఆత్మీయంగా మెలిగే వారు. ఇద్దరూ చనిపోయారు. మరణానంతరం వారి వారి పుణ్య, పాప ఫలాలను అనుసరించి.. లాజరు పరలోక రాజ్యంలో, ధనికుడు నిత్యాగ్నిగుండంలో ప్రవేశించారు. ధనికుడు- తాను తీరని దాహంతో ఉన్నానని, కొన్ని నీళ్లు కావాలని అర్థించాడు. తమ మధ్య అగాధం ఉన్నందున దాహం తీర్చలేనంటూ పేదవ్యక్తి తన అశక్తతతను తెలియజేశాడు. ధనం కూడబెట్టడంలో చేసే పాపాల కంటే పేదరికాన్ని అనుభవించడం మేలంటూ ఏసు చెప్పిన నిగూఢసత్యమది.

ఎమ్‌.ఉషారాణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని