అల్లాహ్‌ నెల.. రజబ్‌

రజబ్‌ నెలవంక జనవరి 13న తొంగి చూసింది. రంజాన్‌ నెలకు రెండు నెలల ముందు వచ్చే ఈ నెలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది.

Published : 18 Jan 2024 00:06 IST

జబ్‌ నెలవంక జనవరి 13న తొంగి చూసింది. రంజాన్‌ నెలకు రెండు నెలల ముందు వచ్చే ఈ నెలకు ఎంతో ప్రాశస్త్యం ఉంది. రజబ్‌ చంద్రవంక కనిపించగానే ముహమ్మద్‌ ప్రవక్త (స) ‘ఓ అల్లాహ్‌! రజబ్‌, షాబాన్‌ నెలల్లో మాపై శుభాల వర్షం కురిపించు. రంజాన్‌ నెల భాగ్యాన్ని కల్పించు’ అంటూ అల్లాహ్‌ను వేడుకుని రంజాన్‌ సన్నాహాలు ఆరంభించేవారు. ‘రజబ్‌ విత్తనాలు చల్లే నెల. తర్వాత వచ్చే షాబాన్‌ నీళ్లు ప్రవహింపచేసే నెల. ఇక రంజాన్‌.. పంటలు కోసే నెల’ అన్నారు ప్రవక్త. రజబ్‌ను అల్లాహ్‌ నెలగా పేర్కొంటూ ‘స్వర్గంలో ఓ దర్బారుంది. దాని పేరు రజబ్‌. అక్కడ నీళ్లు.. పాల కంటే తెల్లగా, తేనె కంటే తియ్యగా ఉంటాయి. ఈ నెలలో ఉపవాసం పాటించేవారితో ఆ నీటిని తాగిస్తారు’ అంటూ వివరించారు ప్రవక్త. రజబ్‌ నెల ఉపవాస దీక్ష పాటించేవారిని స్వర్గంలో ఒక ప్రత్యేక భవంతిలో ఉంచుతారు. మరెవరూ అక్కడ అడుగుపెట్టలేరని ఒక ప్రవచనంలో ఉంది. ‘రజబ్‌ నెలలో గురు, శుక్ర, శని వారాలు పాటించిన ఉపవాస దీక్ష తొమ్మిదేళ్ల పాటు చేసిన ఆరాధనకు సమానం. రజబ్‌ మన తప్పుల పట్ల పశ్చాత్తాపం చెందే నెల. షాబాన్‌ ప్రేమైక నెల. రంజాన్‌ దైవసాన్నిహిత్యం పొందే నెల. రజబ్‌ నెలలో ఉపవాసాలు పాటించి, కష్టార్జితం నుంచి దానం చేస్తే.. వారి ఖాతాలో అనేక పుణ్యాలు లిఖితమవుతాయి. ఈ నెలలో తోటి వ్యక్తుల కష్టాన్ని తొలగించేవారి కోసం అల్లాహ్‌ స్వర్గంలో అద్భుతమైన మహలును నిర్మిస్తాడు’ అన్నారు ప్రవక్త.

రజబ్‌ నెలలో పవిత్రంగా గడిపితే.. వెయ్యింతల గౌరవమర్యాదలు అల్లాహ్‌  కల్పిస్తాడు. ఎన్నెన్నో ప్రత్యేకతలున్న రజబ్‌ నెలను జారవిడుచుకోకుండా దైవారాధనలో, ఉపవాసాల్లో గడిపితే.. తెలియక చేసిన పాపాలు హరించి, స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.   

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని