ఒక్క రాత్రిలో ఏడు ఆకాశాలు

ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం రజబ్‌ నెలలో 27వ రోజు రాత్రి ముహమ్మద్‌ ప్రవక్త గగనయాత్ర చేశారు. ఒక్క రాత్రిలో సప్త ఆకాశాలను చుట్టి వచ్చారు. ఆ ఆకాశాల ఆవల అనూహ్య వింతలు, విశేషాలెన్నో తిలకించారు.

Published : 01 Feb 2024 00:14 IST

ఫిబ్రవరి 7 షబ్‌-ఎ-మేరాజ్‌

స్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం రజబ్‌ నెలలో 27వ రోజు రాత్రి ముహమ్మద్‌ ప్రవక్త గగనయాత్ర చేశారు. ఒక్క రాత్రిలో సప్త ఆకాశాలను చుట్టి వచ్చారు. ఆ ఆకాశాల ఆవల అనూహ్య వింతలు, విశేషాలెన్నో తిలకించారు. స్వర్గంలోని భోగభాగ్యాలు, మనోహర దృశ్యాల్ని వీక్షించారు. నరక యాతనలు చూసి చలించారు. మరణానంతరం ప్రజలు ఏయే పరిస్థితులకు గురవుతారో ఆ దృశ్యాలన్నీ చూసి, తెల్లారేసరికి ఇంటికి చేరుకున్నారు. ఈ యాత్రను ఖురాన్‌ ‘ఇస్రా’, ‘మేరాజ్‌’గా పేర్కొంటోంది. ఈ పర్యటనలో సప్తాకాశాల పైన ఉన్న అల్లాహ్‌ను కలిసి మాట్లాడారు. ముస్లిములు ఐదు పూటలా ఆచరించే నమాజ్‌ ఆరాధన కూడా మేరాజ్‌ కానుకగా లభించిందే. ‘ఒకరోజు రాత్రి ముహమ్మద్‌ ప్రవక్త నిద్రిస్తుండగా ‘జిబ్రీల్‌’ దైవదూత వచ్చి మేల్కొలిపి, కాబా గృహానికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన గుండెను చీల్చి, జమ్‌ జమ్‌ జలంతో శుభ్రపరిచి, విశ్వాసం, వివేకం, విజ్ఞతలతో నింపి మూసేశారు. మెరుపు వేగంతో పయనించే వాహనాన్ని ఇచ్చారు. ప్రవక్త దాన్ని ఎక్కగానే క్షణాల్లో జెరూసలేంలోని బైతుల్‌ మఖ్దస్‌ చేరుకున్నారు. మస్జిద్‌ అక్సాలో ప్రవేశించి నమాజ్‌ చేశారు. తర్వాత అంతరిక్షయానం మొదలైంది. తొలి ఆకాశాన్ని చేరుకున్నప్పుడు అక్కడి దూతను ద్వారం తెరవమన్నారు జిబ్రాయీల్‌ దూత. అతను వెంట ఉన్నదెవరని అడగ్గా, ‘ముహమ్మద్‌ (స)’ అని బదులిచ్చారు. ‘అయితే సుస్వాగతం, శుభం, శుభం’ అంటూ ద్వారం తెరిచారు. జిబ్రీల్‌ (అలైహి), ముహమ్మద్‌ (స) లోనికి ప్రవేశించారు. అక్కడ వారి కోసమే అన్నట్లు ఎందరో దైవదూతలు బారులుతీరి ఉన్నారు. వారు పట్టరాని సంతోషంతో ‘శుభం శుభం’ అంటూ స్వాగతం పలికారు. ఏడు ఆకాశాలు దాటుకుంటూ.. సిదరతుల్‌ మున్‌తహా అనే రేగుచెట్టు దగ్గరకు జిబ్రీల్‌ దూత తీసుకెళ్లారు. ఇక్కడ మహాప్రవక్త ఎన్నో అగోచర యదార్థాలను వీక్షించారు. ‘అస్సలాం అలైకుం ముహమ్మద్‌! నేనే అల్లాహ్‌ను’ అంటూ గంభీరమైన వాణి వినిపించింది. దైవప్రవక్త (స) మనసు పరమానందంతో పరవశించింది. అనిర్వచనీయమైన అనుభూతితో ఆయన అప్రయత్నంగా సాష్టాంగప్రణామం (సజ్దా) చేశారు. అదే స్థితిలో అల్లాహ్‌ను స్తుతించారు. ఈ సందర్భంగా ఐదు పూటల నమాజును కానుకగా అందించాడు అల్లాహ్‌.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని