శ్రీరాముడి మార్గంలో..

మనం చాలాసార్లు ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువల గురించి కంటే ఐహిక సుఖాల గురించే ఆలోచిస్తాం. ఆశించిన విషయంలో విజయం లభిస్తే..

Published : 29 Feb 2024 00:12 IST

నం చాలాసార్లు ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువల గురించి కంటే ఐహిక సుఖాల గురించే ఆలోచిస్తాం. ఆశించిన విషయంలో విజయం లభిస్తే.. ఆనందం, లేదంటే ఆందోళన. అనుకున్నవి నెరవేరనప్పుడు ఆ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండం. నిజానికి భౌతిక సంపదల కంటే ఆధ్యాత్మిక చింతన గొప్పదని, లేకుంటే జీవితానికి అర్థం, పరమార్థం లేదని చెబుతున్నాయి పురాణేతిహాసాలు.

మనలో నైతికవిలువలు నెలకొల్పాలని అంతరాత్మ తపన పడుతుంటుంది. మనసు అక్రమ మార్గాల దిశగా మళ్లకుండా అది పదేపదే హెచ్చరికలు చేస్తుంటుంది. దీన్నే ‘ఆత్మలో సందడి’ అంటారు యోగులు. మనసును కట్టడి చేసేవారే స్థితప్రజ్ఞులు. ఈ విలువైన వ్యక్తులే సమాజ హితానికి దోహదపడతారు. విలువలను నమ్ముకున్నవారికి విజయం తప్పనిసరిగా లభిస్తుంది. అయితే ఆ విజయం తక్షణం సమకూరితేనే అదృష్టవంతులని, అది ఆలస్యమైతే దురదృష్టంతులని భావిస్తారు కొందరు. అది వాస్తవం కాదు.

పాండవులు ఏళ్ల తరబడి కష్టాలు అనుభవించినా.. చివరికి న్యాయమే గెలిచింది. ఆలస్యంగానైనా రాజ్యాన్ని తిరిగి దక్కించుకోగలిగారు. కౌరవులు అన్యాయంగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్న మాట నిజమే. దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో అడ్డదారులు తొక్కారు. కానీ చివరికి ఏం ఒనగూరింది? వంశమే నశించింది కదా!

జరగాల్సిన పట్టాభిషేకం తప్పిపోయినా, అర్ధాంగి సీతమ్మను రావణాసురుడు అపహరించుకుపోయినా రాముడు చెక్కుచెదరలేదు. అడ్డదారులు తొక్కలేదు. రావణాసురుని సంహరించాక స్వర్ణలంకను చూసి లక్ష్మణుడు ఇష్టపడి లంకలోనే ఉండిపోదామమన్నాడు. కానీ శ్రీరాముడు అంగీకరించలేదు. కన్నతల్లి, మాతృభూమి కన్నా స్వర్గం కూడా గొప్పది కాదని సోదరుడికి హితవు చెప్పాడు. అంతటి నిజాయితీ కలిగినవాడు కనుకనే శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు, ఆరాధ్యనీయుడు అయ్యాడు.

నూతి శివానందం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని