కాళ్లు లేకున్నా...సారథి అయ్యాడు!

అఖిల జగాలకూ వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఆయన ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తుంటాడని చెబుతారు. ఆ రథాన్ని నడిపించేది అనూరుడు. కాళ్లు, తొడలు లేకుండా జన్మించిన ఈయన ఇంత మహత్కార్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు?

Published : 28 Jan 2021 00:20 IST

అఖిల జగాలకూ వెలుగునిచ్చేవాడు సూర్యుడు. ఆయన ఏడు గుర్రాలున్న రథంపై నిరంతరం సంచరిస్తుంటాడని చెబుతారు. ఆ రథాన్ని నడిపించేది అనూరుడు. కాళ్లు, తొడలు లేకుండా జన్మించిన ఈయన ఇంత మహత్కార్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నాడు?
అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. కాళ్ళు, తొడలు లేకుండా పుట్టడం వల్ల అతనికి ఈ పేరు వచ్చింది. ఇతనికి అరుణుడు అనే మరో పేరుంది... అంటే ఎర్రని వాడు అని అర్ధం. ఈయన తండ్రి కశ్యప ప్రజాపతి, తల్లి వినత. కశ్యప ప్రజాపతి మరోభార్య కద్రువ. వినత, కద్రువ నెలలు నిండాక గుడ్లను ప్రసవించారు. వినతకు రెండు గుడ్లు పుట్టాయి. కద్రువ కన్న గుడ్ల నుంచి సకాలంలో  పిల్లలు బయటకు వచ్చారు. వాళ్ళే నాగులు. ఇక ఎంతకాలం గడిచినా వినత కన్న గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాలేదు. లోపల అసలు పిల్లలున్నారో లేదో కూడా తెలియక వినత తల్లడిల్లిపోయింది. ఆగలేక ఒక గుడ్డును పగులకొట్టి చూసింది. ఆ గుడ్డు లోపల కాళ్ళు, తొడలు ఇంకా ఏర్పడని కుమారుడున్నాడు. అతడే అనూరుడు. అతడు తనకు అలాంటి దుస్థితి కలగడానికి తల్లి తొందరపాటు కారణం కాబట్టి ప్రతిఫలంగా తల్లిని కద్రువకు దాసిగా ఉండమని శపించాడు అనూరుడు. రెండో  గుడ్డులో మహాబలాఢ్యుడైన గరుత్మంతుడు ఉన్నాడని, ఆ గుడ్డును అనవసరంగా తొందరపడి  పగలగొట్టవద్దని చెప్పాడు. ఇంతలో అక్కడికి సూర్యుడు వచ్చి అనూరుణ్ణి తన సారథిగా  ఎంచుకున్నాడు. ఎప్పటికీ ఆ రథం దిగి నడవాల్సిన అవసరం రాదని చెప్పి తీసుకువెళ్లాడు. తర్వాత కొంతకాలానికి రెండో గుడ్డునుంచి వచ్చిన గరుత్మంతుణ్ణి విష్ణువు తన వాహనంగా చేసుకున్నాడు. అనూరుడి భార్య శ్యేని. సంపాతి, జటాయువులు వీరి కుమారులు. 

 - యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని