అదే దివ్యౌషధం

వందేమాతర గీతం అనగానే బంకించంద్ర ఛటర్జీ స్ఫురిస్తారు. ఆ ప్రఖ్యాత రచయిత ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసను దర్శించుకోగా, ‘నీ జీవన లక్ష్యం ఏమిటి?’ అనడిగారాయన. ‘కుటుంబ పోషణ’

Published : 09 Dec 2021 00:38 IST

వందేమాతర గీతం అనగానే బంకించంద్ర ఛటర్జీ స్ఫురిస్తారు. ఆ ప్రఖ్యాత రచయిత ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసను దర్శించుకోగా, ‘నీ జీవన లక్ష్యం ఏమిటి?’ అనడిగారాయన. ‘కుటుంబ పోషణ’ అన్నారు బంకించంద్ర. పరమహంస తీవ్రంగా స్పందిస్తూ ‘ముల్లంగి తింటే ఆ త్రేన్పులే వస్తాయి. సంసారమే సర్వమని భావిస్తే ఆలోచనలు ఇలాగే ఉంటాయి’ అని, ఆధ్యాత్మిక జీవన ప్రాముఖ్యం గురించి చెప్పారు. పరమహంస సాంగత్యంతో బంకించంద్రుని ఆలోచనా ధోరణే మారిపోయింది. మనసు ప్రాపంచిక విషయాల నుంచి ఆధ్యాత్మికత వైపు మరలి, క్రమంగా వేదాంతిగా మారిపోయారు. లౌకిక కథనాలతో కూడిన సాహిత్యాన్ని వదిలేశారు. దైవచింతన పెంచుకుని ఆధ్యాత్మిక రచనలు చేస్తున్న రోజుల్లో ఒకసారి బంకించంద్ర తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. అయినా శరీర అస్వస్థతను పట్టించుకోకుండా ఆధ్యాత్మిక గ్రంథ పఠనంలో లీనమయ్యారు. అప్పుడో ప్రముఖ వైద్యుడు వారి ఇంటికి వచ్చి ‘ఔషధం తీసుకోకపోతే ఎలా? ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకుంటారా?!’ అంటూ హెచ్చరించారు. దానికి స్పందిస్తూ బంకించంద్ర ‘మందులు తీసుకోకపోవటమేంటి! రోజూ ఒక ఔషధాన్ని వాడుతున్నానే!’ అన్నారు. వైద్యుడు ఆశ్చర్యంగా ‘ఏదీ చూపండి’ అనడిగారు. ‘ఇదిగో’ అంటూ చెంతనే ఉన్న భగవద్గీత చూపి, ‘పారమార్థిక అన్వేషణకే కాదు, ప్రాపంచిక రుగ్మతలకూ ఇంతకంటే దివ్య ఔషధం లేదు’ అన్నారు.

- ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు