పెద్దలకు ఎందుకు నమస్కరించాలంటే..

కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతోంది. ఒకరోజు యుద్ధం ముగిశాక దుర్యోధనుడు ‘పితామహా! మీరు పక్షపాతంగా వ్యవహరించక పోతే మీ ధాటికి పాండవులు నిలవగలరా?’ అనడిగాడు.

Updated : 27 Apr 2023 04:00 IST

కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా జరుగుతోంది. ఒకరోజు యుద్ధం ముగిశాక దుర్యోధనుడు ‘పితామహా! మీరు పక్షపాతంగా వ్యవహరించక పోతే మీ ధాటికి పాండవులు నిలవగలరా?’ అనడిగాడు. దానికి భీష్ముడు బాధపడి ‘రేపటి పోరులో పాండవులను చంపి తీరుతాను’ అన్నాడు. దుష్టచతుష్టయం ఆనందించింది. కానీ భీష్ముడి సామర్థ్యం తెలిసిన పాండవులు ఈ ప్రకటన విని కలవరపడ్డారు. శ్రీకృష్ణుడు వారిని శాంతపరచి ద్రౌపదిని వెంటబెట్టుకుని భీష్ముడి శిబిరానికి వెళ్లాడు. వెళ్లగానే భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేయమని ముందే సూచించాడు. ఆమె అలానే చేసింది. భీష్ముడు ‘అఖండ సౌభాగ్యవతీ భవ!’ అని ఆశీర్వదించి, చిరునవ్వుతో ‘అమ్మా! కృష్ణుడు వచ్చాడు కదా?’ అన్నాడు. ద్రౌపది ‘అవును తాతయ్యా, శిబిరం బయట ఉన్నాడు’ అనడంతో భీష్ముడు బయటకు వచ్చి.. ‘నీ శక్తియుక్తులు నాకు తెలుసు కృష్ణా! ప్రతిజ్ఞ కన్నా దీవెనకు ఉన్న శక్తి చాలా ఎక్కువ! సరే.. నేను పాండవుల జోలికి రాకుండా ఉండేందుకు ఇలా చేయండి’ అంటూ ఒక మార్గాన్ని సూచించాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదిని వెంటబెట్టుకుని బయల్దేరాడు. ‘చూశావా! భీష్ముడికి నమస్కరించడం ద్వారా నీ భర్తలు జీవితాన్ని పొందారు. నువ్విలాగే ప్రతిరోజూ భీష్మ, ధృతరాష్ట్ర, ద్రోణాచార్యులు తదితర పెద్దలకు సదా నమస్కరిస్తుండు’ అన్నాడు. ద్రౌపది అలాగేనంటూ కృష్ణుడికి నమస్కరించింది.

ద్రౌపదిలా దుర్యోధన, దుశ్శాసనుల భార్యలు కూడా పెద్దలకు నమస్కరించి ఉంటే బహుశా కురుక్షేత్ర సంగ్రామం ఆగిపోయి ఉండేది. నమస్కారానికి, పెద్దల ఆశీర్వచనానికి అంతటి మహత్తు ఉంది. అహంకారం వల్లే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. పిల్లలు నిత్యం ఇంటి పెద్దలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ తలెత్తవు. ఆ ఆశీర్వాదం కవచంలా రక్షిస్తుంది. అంతే కాదు, నమస్కారం ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, సంస్కారాలను నేర్పు తుంది. కోపాన్ని తొలగిస్తుంది, కన్నీళ్లను కడిగేస్తుంది. బంధుమిత్రులను దగ్గర చేస్తుంది.

డా.టేకుమళ్ల వెంకటప్పయ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని