ramadan eid: రంజాన్‌ విశిష్టత ఇదే!

ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు ఇక రంజాన్‌ పర్వదినాన అత్యుత్సాహంగా వేడుక చేసుకుంటారు.

Published : 02 May 2022 20:40 IST

(మే 3 రంజాన్‌)

ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపిన ముస్లింలు ఇక రంజాన్‌ పర్వదినాన అత్యుత్సాహంగా వేడుక చేసుకుంటారు. ఈమాన్‌, నమాజ్‌, రోజా, జకాత్‌, హజ్‌ అనేవి ఇస్లాం మతానికి మూలస్తంభాలు. ఈ ఐదు సూత్రాలను రంజాన్‌ మాసంలో పాటించడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తారు ముస్లింలు.

ప్రతి మతంలో కొన్ని ఆచారవ్యవహారాలు ఉంటాయి. వాటి అమలుకు సంబంధించి మత గ్రంథం మూలాధారం అవుతుంది. అలాగే ప్రపంచంలోని ముస్లింలందరికీ పవిత్ర ఖురాన్‌ మార్గదర్శకమైంది. తమ జీవనాన్ని నిర్దేశించే ఈ ఖురాన్‌ ఆవిష్కృతమైన సందర్భమే రంజాన్‌. ఈ రోజును ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

రంజాన్‌మాసంలో సూర్యోదయానికి ముందు తిని రోజంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తర్వాత ఉపవాసం విరమిస్తారు. మంచిపనులతో అల్లాను మెప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఎలాంటి చెడు తలపులూ మనసులోకి కూడా రానివ్వకూడదని నమ్ముతారు. కల్మా తయ్యిబా చదవటం, పాపాల గురించి పశ్చాత్తాపం, స్వర్గప్రాప్తి కావాలనే కోరిక, నరకాగ్ని నుంచి కాపాడమనే విన్నపం చేస్తూ అల్లాను వేడుకుంటారు.

పవిత్ర ఖురాన్‌ పఠనం ఏడాది పొడుగునా చేసేదే అయినా రంజాన్‌ మాసంలో మరింత భక్తిశ్రద్ధలతో పఠిస్తారు. అలాగే ఈమాన్‌ (విశ్వాసం), నమాజ్‌, రోజా (ఉపవాసం), జకాత్‌, హజ్‌ యాత్ర ఈ నెలలో తప్పనిసరిగా పాటిస్తారు. 

ఈమాన్‌

‘లాయిలాహ ఇల్లల్లాహ్‌, ముహమ్మద్‌ రసూల్‌ అల్లాహ్‌’ (అల్లాహ్‌ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్‌ స.అ.స. ఆయన ప్రవక్త) అని విశ్వసించడమే ఈమాన్‌. సృష్టిలోని సకల చరాచర జీవులు, నిర్జీవులు, లోకంలోని అన్నింటికీ అధిపతి అల్లాహ్‌ ఒకడే, ఆయన పంపిన ప్రవక్త ముహమ్మద్‌ (స.అ.స) అని ముస్లింలంతా నమ్ముతారు.

నమాజ్‌

ముస్లింలంతా ఆడ-మగ, పెద్ద-చిన్న అనే భేదాలు లేకుండా ప్రతిరోజూ ఐదు పూటలా నమాజ్‌ చేయాలనేది ఇస్లాం ఆదేశం. ఇక రంజాన్‌మాసంలో ఉపవాసదీక్ష పాటించేవారు విధిగా ఐదుపూటలా నమాజ్‌ చదువుతారు. దీనితో పాటు ప్రత్యేకంగా రాత్రిపూట తరావీ నమాజ్‌లకూ హాజరవుతారు. మూడు రోజుల నుంచి ముప్పై రోజుల పాటు కొనసాగే తరావీ నమాజ్‌లలో ఖురాన్‌లోని మొత్తం 30 పర్వాలనూ మసీదుల ఇమాంలు చదివిస్తారు.

ఉపవాసం

రంజాన్‌ మాసంలో ఆరోగ్యంగా ఉన్న ముస్లింలంతా కఠోర ఉపవాసం ఉండాలని ఇస్లాం బోధిస్తుంది. ఈ నియమాన్ని అనుసరించి తెల్లవారుజామున సహర్‌ చేసి సూర్యాస్తమయం వరకు సుమారు 14 గంటలపాటు పచ్చి మంచి నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం పాటిస్తారు. సూర్యాస్తమయం వేళ ఇఫ్తార్‌ సమయంలో ఉపవాసం విరమిస్తారు. సూర్యుడి గమనాన్ని బట్టి వివిధ దేశాల్లో ఉపవాస సమయాలు మారతాయి.

జకాత్‌

ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని పేదలకోసం ఖర్చుచేయడాన్ని జకాత్‌ అంటారు. రంజాన్‌మాసంలో ముస్లింలు తమ ఆదాయంలో రెండున్నర శాతం ధనాన్ని తప్పనిసరిగా పేదలకోసం ఖర్చుపెట్టాలని చెబుతుంది ఖురాన్‌. అలా సమకూరిన ధనంతో ఆయా సంస్థలు పేదలకు ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం అందిస్తాయి. నిరుపేదలు సైతం రంజాన్‌ పండుగను జరుపుకునేందుకు జకాత్‌ ఉపయోగపడుతుంది.

హజ్‌

ఇక మక్కా యాత్రను ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా భావిస్తారు. సౌదీ అరేబియాలోని మక్కాను దర్శించుకోవాలని ఇస్లాం బోధిస్తుంది. ఈ మాసంలో చాలామంది మక్కాను సందర్శించి ఉమ్రా చేస్తారు. రంజాన్‌ నెలలో మక్కాయాత్ర చేస్తున్నవారు కూడా నమాజ్‌, ఖురాన్‌ పఠనం, అవకాశం ఉన్నంత మేరకు దానధర్మాలు చేస్తారు.

- ఎం.డి.ఖాజా మొయినుద్దీన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని