అగ్నివీరులకు.. నౌకాదళం ఆహ్వానం..

ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో 1365 పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అగ్నివీర్‌ (ఎంఆర్‌) వంద పోస్టులకు మరో ప్రకటన వెలువడింది.

Updated : 15 Feb 2024 16:47 IST

ఇండియన్‌ నేవీ అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకటన విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో 1365 పోస్టులకు పోటీ పడవచ్చు. అలాగే అగ్నివీర్‌ (ఎంఆర్‌) వంద పోస్టులకు మరో ప్రకటన వెలువడింది. పదో తరగతి ఉత్తీర్ణులు వీటికి అర్హులు. ఈ రెండు పోస్టులకూ మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలు, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇలా అవకాశం వచ్చినవారు శిక్షణతో కలిపి నాలుగేళ్లు సేవలు అందించవచ్చు. అనంతరం వీరిలో 25 శాతం మందిని శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. మిగిలినవారు ఆర్థిక ప్రోత్సాహకాలతో వైదొలగాలి. ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు... 

గ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌/ప్లస్‌2లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్స్‌ల్లో ఏదైనా ఒక సబ్జెక్టు చదివినవారు ఈ పోస్టులకు అర్హులు. వీరు నవంబరు 1, 2002 - ఏప్రిల్‌ 30, 2006 మధ్య జన్మించి ఉండాలి. పురుషులకు 157, మహిళలకు 152 సెం.మీ. ఎత్తు తప్పనిసరి. అవివాహితులే అర్హులు. 1365 పోస్టుల్లో మహిళలకు 273 దక్కుతాయి.

ప్రయోజనాలివీ...

ఎస్‌ఎస్‌ఆర్‌, ఎంఆర్‌.. వీటిలో ఏ పోస్టుకు ఎంపికైనప్పటికీ నాలుగేళ్ల సేవలకు గానూ సేవానిధి ప్యాకేజీ అందిస్తారు. వార్షిక సెలవులు 30 ఉంటాయి. ఆరోగ్య సమస్యను బట్టి సిక్‌ లీవ్‌ కేటాయిస్తారు. నాలుగేళ్ల సర్వీస్‌లో ఉన్నప్పుడు రిస్క్‌ అండ్‌ హార్డ్‌షిప్‌, రేషన్‌, డ్రెస్‌, ట్రావెల్‌ ఆలవెన్సులు మాత్రం ఇస్తారు. నాలుగేళ్లపాటు రూ.48 లక్షలకు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ వర్తిస్తుంది. నాలుగేళ్ల సేవలకు గానూ అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ అందుతుంది.

ఇదీ ప్యాకేజీ..

మొదటి సంవత్సరం: రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో ఏడాది రూ.40,000

సేవానిధి..

ప్రతి నెల అందుకునే మొత్తంలో 30 శాతం కార్పస్‌ ఫండ్‌కి జమ చేస్తారు. అంటే మొదటి ఏడాది ప్రతి నెల పొందే 30,000 నుంచి రూ.9000 మినహాయిస్తారు. అగ్నివీరుని చేతికి రూ.21,000 అందుతుంది. రెండో ఏడాది రూ.23,100 వేతనం అందుతుంది. రూ.9900 నిధిలో జమ అవుతుంది. మూడో ఏడాది రూ.25,500 చేతికి వస్తుంది. రూ.10,950 నిధికి వెళ్తుంది. ఇలా నాలుగో ఏడాదికి వచ్చే సరికి వీరునికి రూ.28,000, నిధికి రూ.12,000 వెళ్తాయి. మొత్తం నాలుగేళ్ల వ్యవధికి గానూ సేవానిధిలో రూ.5.02 లక్షలు అగ్నివీరుని నుంచి పోగవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వమూ జమ చేస్తుంది. అంటే రూ.10.04 లక్షలన్నమాట. దీనికి వడ్డీని కలిపి అగ్నివీరునికి అందిస్తారు. సుమారు రూ.11.71 లక్షలు అందుతాయి. దీనిపై పన్ను ఉండదు. అగ్నివీర్‌ స్కిల్‌ సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తారు. సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌/ఆంతర్‌ ప్రెన్యూర్‌షిప్‌ నిమిత్తం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరయ్యేలా చూస్తారు.

మధ్యలో మానేస్తే...

అగ్నివీరులు నాలుగేళ్లలోపే కావాలంటే వైదొలగొచ్చు. అలాంటి సందర్భంలో అగ్నివీరుని వేతనం నుంచి జమ అయిన మొత్తాన్నే చేతికి అందిస్తారు. వీరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రోత్సాహం దక్కదు.

వర్తించనివి...

పింఛను, గ్రాట్యుటీ, కరవు భత్యం, మిలటరీ సర్వీస్‌ పే (ఎంఎస్‌పీ), ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) వర్తించవు. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌గా పరిగణించరు.

శాశ్వత విధుల్లోకి...

నాలుగేళ్ల వ్యవధి పూర్తిచేసుకున్న అగ్నివీరుల ఒక్కో బ్యాచ్‌ నుంచి గరిష్ఠంగా 25 శాతం మందిని నేవీలో సెయిలర్‌ హోదాతో శాశ్వత ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇందుకోసం ఆ వ్యవధిలో ప్రతిభ, పనితీరును ప్రామాణికంగా తీసుకుంటారు. ఇలా ఎంపికైనవారు పదవీ విరమణ వయసు వరకు కొనసాగవచ్చు. ప్రోత్సాహకాలన్నీ వర్తిస్తాయి. వైదొలిగిన తర్వాత  పింఛనూ అందుతుంది.

ఎస్‌ఎస్‌ఆర్‌ స్టేజ్‌-1 పరీక్ష ఇలా..

ఆన్‌లైన్‌లో వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలన్నీ ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. మొత్తం నాలుగు సెక్షన్ల నుంచి వీటిని అడుగుతారు. అవి... ఇంగ్లిష్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌. ప్రశ్నలన్నీ ఇంటర్మీడియట్‌ స్థాయిలోనే ఉంటాయి. నమూనా ప్రశ్నపత్రాలు నేవీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి సెక్షన్‌లోనూ నిర్ణీత మార్కులు పొందడం తప్పనిసరి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు.

స్టేజ్‌-2..(ఎస్‌ఎస్‌ఆర్‌, ఎంఆర్‌)

స్టేజ్‌-1లో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 రాత పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన సిలబస్‌ వివరాలు నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ఈ పరీక్షకు హాజరుకావడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరి. వీరికి ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులూ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. 1.6 కి.మీ. దూరాన్ని పురుషులు ఆరున్నర, మహిళలు 8 నిమిషాల్లో పూర్తిచేయాలి. పురుషులు 20, మహిళలు 15 గుంజీలు తీయగలగాలి. వీటితోపాటు పురుషులు 12 పుష్‌ అప్స్‌, మహిళలు 10 బెంట్‌ నీ సిట్‌ అప్స్‌ తీస్తే అర్హత సాధిస్తారు. వీటన్నింటీలోనూ విజయవంతమైనవారికి మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ దశనూ దాటితే స్టేజ్‌-2 పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం రాష్ట్రాలవారీ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వీరికి ఐఎన్‌ఎస్‌, చిలక సరస్సులో నవంబరు నుంచి శిక్షణ మొదలవుతుంది. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 15 వరకు స్వీకరిస్తారు.
పరీక్ష ఫీజు: జీఎస్‌టీతో కలిపి రూ.649.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in.

అగ్నివీర్‌ (ఎంఆర్‌)

ఈ విభాగంలో వంద ఖాళీల్లో మహిళలకు గరిష్ఠంగా 20 దక్కుతాయి. పదోతరగతి ఉత్తీర్ణులు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. నవంబరు 1, 2002 - ఏప్రిల్‌ 30, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టులతో నియామకాలు చేపడతారు.

పరీక్ష ఇలా

పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. యాభై ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. పరీక్ష వ్యవధి అరగంట. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాల్లో వీటిని అడుగుతారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు వస్తాయి. సిలబస్‌, మాదిరి ప్రశ్నపత్రాలను ఇండియన్‌ నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు తగ్గిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్ష సిలబస్‌ వివరాలు నేవీ వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చు.

వీరికి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టులు, మెడికల్‌ పరీక్షలు, శిక్షణ, వేతనాలు, నిబంధనలు.. అన్నీ అగ్నివీర్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) మాదిరిగానే ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని