విదేశాల్లో పీజీ..

బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేయాలనుంది. విదేశాల్లో పీజీ చేయాలంటే పాటించాల్సిన విధానాలేమిటి?

Published : 26 Jun 2023 00:07 IST

బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చేయాలనుంది. విదేశాల్లో పీజీ చేయాలంటే పాటించాల్సిన విధానాలేమిటి?

కె.నవీన్‌కుమార్‌

విదేశాల్లో పీజీ చేయాలంటే ముందుగా ఏ దేశంలో, ఏ సబ్జెక్ట్‌లో, ఏ యూనివర్సిటీలో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత, ఆయా యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి, అక్కడ పీజీ చదవడానికి అవసరమైన ప్రవేశ పరీక్షలు, కావాల్సిన స్కోర్లు లాంటి వాటిని తెలుసుకోవడం శ్రేయస్కరం. ఈ క్రమంలో, విదేశాల్లో చదువుతున్న మీ సీనియర్‌ల సలహాలు, సూచనలు సరైన నిర్ణయం తీసుకోవడానికి దోహదపడతాయి. విదేశాల్లో పీజీ చేయడం ఖర్చుతో కూడుకొన్న విషయం కాబట్టి ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం చాలా ముఖ్యం. మీ కుటుంబానికి అంత స్థోమత లేకపోతే బ్యాంకు రుణం కోసం ప్రయత్నించండి. భారత ప్రభుత్వ విదేశీ విద్యా సహకార స్కాలర్‌షిప్‌ల గురించి, విదేశీ యూనివర్శిటీల్లో చదువుతూ, సంపాదించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలను అంచనా వేయండి.

యూఎస్‌లో పీజీ చేయాలంటే ఇంగ్లిష్‌ భాషా ప్రావీణ్యం తెలుసుకొనే ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ లాంటి పరీక్షల్లో మంచి స్కోరు పొందాలి. కొన్ని యూనివర్సిటీలు ఈ పరీక్షలతో పాటు జీఆర్‌ఈ లాంటి పరీక్షల్లో వచ్చిన స్కోరును బట్టి ప్రవేశాలు/ఫెలోషిప్‌లు ఇస్తున్నాయి. వివిధ విదేశీ యూనివర్సిటీలు రకరకాల నిబంధనలను ఆధారంగా చేసుకొని పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తాయి. విదేశీ యూనివర్శిటిల్లో ప్రవేశానికి, పైన పేర్కొన్న అంశాలతో పాటు, మీ కళాశాల అధ్యాపకులు రాసే రిఫరెన్స్‌ లెటర్స్‌, మీరు రాసే స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో పీజీ చేయాలంటే కూడా పైన పేర్కొన్న చాలా అంశాలు మీకు వర్తిస్తాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని