కోర్సులో కొనసాగాలా?

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఈ కోర్సు అంటే నాకు ఆసక్తి లేదు. సోషల్‌ వెల్ఫేర్‌ కోర్సు చదివి సమాజం కోసం ఏమైనా చేయాలనుంది.

Published : 10 Jul 2023 00:13 IST

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నా. ఈ కోర్సు అంటే నాకు ఆసక్తి లేదు. సోషల్‌ వెల్ఫేర్‌ కోర్సు చదివి సమాజం కోసం ఏమైనా చేయాలనుంది. ఇప్పుడు కోర్సును కొనసాగించాలా, మధ్యలోనే మానేసి నాకిష్టమైనది చదవాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.

రోహిత్‌

ప్రస్తుతం మీ సమస్య చాలామంది విద్యార్థులు ఎదుర్కొంటున్నదే. మనదేశంలో సరైన కెరియర్‌ నిర్ణయాలను తీసుకోవడంలో విద్యార్థులూ, వారి తల్లిదండ్రులూ చాలాసార్లు విఫలమవుతున్నారు. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తల్లిదండ్రులు సామాజిక హోదా కోసం వారిని బలవంతంగా ఇంజినీరింగ్‌/ ఇతర కోర్సులు చదివిస్తున్నారు.

ఇంజినీరింగ్‌లో చాలా బ్రాంచ్‌లు ఉన్నప్పటికీ త్వరగా ఉద్యోగం వస్తుందన్న ఆశతో కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, ఐటీ, ఏఐ లాంటి బ్రాంచీల్లో మూకుమ్మడిగా చేర్పిస్తున్నారు. నాలుగు, ఐదు సంవత్సరాల తరువాత ఒకవేళ పరిస్థితులు మారితే మనదేశంలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన నిరుద్యోగులు చాలామంది ఉండొచ్చు. ఈ మొత్తం ప్రక్రియలో విద్యార్థులు చాలా సందర్భాల్లో వారికి నచ్చని కోర్సులు చదవలేక, వదిలి రాలేక సతమతమవుతున్నారు.

మీ విషయానికొస్తే ఆసక్తి లేని కోర్సును చదవడం అనవసరం. ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలో వదిలివేయడం కంటే మీరు ఏ కోర్సు, ఎక్కడ చదవాలని అనుకుంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అనే కోర్సు ప్రత్యేకంగా ఉండదు. రూరల్‌ డెవలప్‌మెంట్‌, సోషియాలజీ, సోషల్‌ వర్క్‌ లాంటి సోషల్‌ సైన్స్‌ కోర్సుల్లో నచ్చిన కోర్సును ఎంచుకోండి. సామాజిక సేవ, సంక్షేమం, అభివృద్ధి లాంటి రంగాల్లో పనిచేసేవారికి ఆత్మసంతృప్తి ఉంటుంది. అయితే సాప్ట్‌వేర్‌ రంగంలో ఉన్నంత పెద్ద వేతనాలు దక్కవు.  

ప్రస్తుతం మీరు అనుకొంటున్న కెరియర్‌తో జీవితకాలం ప్రయాణించగలరా లేదా అనేది ఆలోచించండి. అసలు ‘సోషల్‌ వెల్ఫేర్‌’ అంటే మీ ఉద్దేశం ఎంటి? స్వచ్ఛంద సంస్థల ద్వారా సమాజాభివృద్ధి చేయడమా, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా చేయడమా? దీనిపై స్పష్టత పొందండి.

ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా సమాజాభివృద్ధి చేయాలనుకుంటే మీముందు మూడు అవకాశాలున్నాయి. 1) ఇంజినీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి సివిల్‌ సర్వీసెస్‌/ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకోసం ప్రయత్నించడం. 2) ఇంజినీరింగ్‌ కోర్సును మధ్యలోనే వదిలేసి, సోషల్‌ సైన్స్‌ సబ్జెక్టులతో డిగ్రీ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధం అవడం. 3) డిగ్రీ పూర్తయ్యాక, విదేశాల్లో సోషల్‌ సైన్స్‌ సంబంధిత కోర్సులు చదివి, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో ఉద్యోగం చేస్తూ మీ ఆశయాన్ని నెరవేర్చుకోవడం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దాని పర్యవసానాలు మీరే అనుభవించాలి కాబట్టి, అన్ని కోణాల్లో ఆలోచించుకోండి. మీ మనసుకూ, జీవితానికీ సరిపడే సరైన నిర్ణయాన్ని తీసుకోండి!

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు