ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ నేర్చుకుంటే?

బీబీఏ రెగ్యులర్‌గా, ఎంబీఏ డిస్టెన్స్‌లో చేశాను. బీసీఏ డిస్‌కంటిన్యూ చేశాను. యూపీఎస్సీ పరీక్షలకు నాలుగేళ్లు ప్రయత్నించి వదిలేశాను. రెండేళ్లుగా ఏమీ చేయడం లేదు.

Published : 02 Aug 2023 00:35 IST

బీబీఏ రెగ్యులర్‌గా, ఎంబీఏ డిస్టెన్స్‌లో చేశాను. బీసీఏ డిస్‌కంటిన్యూ చేశాను. యూపీఎస్సీ పరీక్షలకు నాలుగేళ్లు ప్రయత్నించి వదిలేశాను. రెండేళ్లుగా ఏమీ చేయడం లేదు. ఇప్పుడు ఎస్‌ఏపీ ఎఫ్‌ఐసీఓ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ కోర్సుతో ఉద్యోగావకాశాలు బాగుంటాయా? 

రోహిత్‌

దాదాపుగా ఆరేళ్ల విరామం తరువాత ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ నేర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంటే మీ వయసు దాదాపు ముప్పై సంవత్సరాలు ఉండవచ్చు. బీబీఏ/ ఎంబీఏలో మీరు ఏ స్పెషలైజేషన్‌ చదివారో, ఉద్యోగానుభవం ఉందో, లేదో చెప్పలేదు. సాధారణంగా ఎస్‌ఏపీ ఫైనాన్స్‌ అండ్‌ కంట్రోలింగ్‌ని ఫైనాన్స్‌ రంగంలో కొంత అనుభవం పొందాక చేయడం శ్రేయస్కరం. ఈ రంగంలో ఉద్యోగం పొందాలంటే ఫైనాన్స్‌ నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా అవసరం. ఈ కోర్సు చేసినవారికి కన్సల్టెంట్లుగా ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో తక్కువ ఉద్యోగాలు అందుబాటులో ఉండటం వల్ల పోటీ ఎక్కువే. మీరు ఎస్‌ఏపీ ఎఫ్‌ఐసీఓ నేర్చుకొనేముందు ఫైనాన్స్‌ రంగంలో కనీసం రెండు సంవత్సరాలు పనిచేసి, ఆ విభాగానికి సంబంధించిన విషయాలపై పట్టు సాధించండి. ఈ కోర్సును మంచి శిక్షణ సంస్థ నుంచి నేర్చుకుంటే మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఇందులో రాణించాలంటే అనలిటికల్‌, ప్రాబ్లం సాల్వింగ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌ పర్సనల్‌ నైపుణ్యాలు చాలా అవసరం.


వీటిలో ఏ డిగ్రీ మేలు?

ఇంటర్‌ సీఈసీ చదివాను. బీకాం/బీబీఏ/బీసీఏ.. వీటిల్లో ఏ డిగ్రీ  చదివితే ఉద్యోగావకాశాలు మెరుగ్గా ఉంటాయి?

లహరి

చాలా యూనివర్సిటీల్లో బీసీఏ చదవాలంటే ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఉండాలన్న నిబంధన ఉంది. కొన్ని ప్రైవేటు యూనివర్సిటీల్లో ఈ నిబంధన లేనప్పటికీ బీసీఏ మొదటి సంవత్సరంలో మ్యాథ్స్‌ని బ్రిడ్జి కోర్సుగా చేయాల్సి ఉంటుంది. సాధారణంగా బీసీఏ లాంటి కోర్సుల్లో రాణించాలంటే మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులపై పట్టు అవసరం. ఇక బీబీఏ, బీకాం  రెండు కోర్సులకూ మంచి భవిష్యత్తు ఉంది. బీబీఏని పేరున్న బిజినెస్‌ స్కూల్‌లో చదివితే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ అవకాశం ఉంది. బీబీఏ చదివినవారికి బీకాం పూర్తిచేసిన వారి కంటే కొంత ఎక్కువ వేతనం లభించవచ్చు. అదే సమయంలో బీబీఏ చదివిన వారినుంచి వ్యాపార సంస్థలు చాలా ఎక్కువ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి. బీకాంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదో ఒక ఉపాధి దొరికే అవకాశం ఉంది. బీకాం, బీబీఏల్లో దాదాపు సగం సిలబస్‌ ఒకేలా ఉంటుంది. కానీ వాటిని రెండు కోర్సుల్లో ఒక్కో రకంగా బోధిస్తారు. బీకాంలో వ్యాపారానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను ఎక్కువగా బోధిస్తారు. బీబీఏలో వ్యాపారానికి సంబంధించిన అప్లికేషన్‌లతో పాటు, కమ్యూనికేషన్‌, ప్రజెంటేషన్‌, ప్రాబ్లం సాల్వింగ్‌, కంప్యూటర్‌ నైపుణ్యాలపై ఎక్కువ శ్రద్ధ పెడతారు. బీకాంలో అకౌంట్స్‌, ఫైనాన్స్‌, ట్యాక్స్‌, బిజినెస్‌ చట్టాలు, బ్యాంకింగ్‌ లాంటి అంశాలపై బోధన ఎక్కువ. డిగ్రీతో పాటు చార్టర్డ్‌ అకౌంటెంట్‌ లాంటి కోర్సులు చేయాలంటే బీకాం చదవడం ఉపయోగకరం. భవిష్యత్తులో ఎంబీఏ చదవాలంటే బీబీఏతో పాటు, బీకాం పూర్తిచేసుకున్నవారూ అర్హులే. మీ దీర్ఘకాలిక, స్వల్పకాలిక ఆశయాలనూ, ఆసక్తినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌,  కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు