ఏది ఎంచుకోను?

మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య మీది మాత్రమే కాదు. మీలాంటి చాలామంది విద్యార్థులు ఇలానే సతమతమవుతున్నారు.

Published : 03 Aug 2023 00:06 IST

ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. నాకు ఎన్‌ఐటీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదవాలనుంది. స్నేహితులు కంప్యూటర్‌ సైన్స్‌దే భవిష్యత్తు అంటున్నారు. ఏది మెరుగు?

స్వప్న

మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య మీది మాత్రమే కాదు. మీలాంటి చాలామంది విద్యార్థులు ఇలానే సతమతమవుతున్నారు. విద్యార్థుల ఆసక్తి ఒకవైపు, మార్కెట్‌/ తల్లిదండ్రుల/ స్నేహితుల సలహాలు ఒకవైపు. ఈ రెండిటి మధ్య సరైన నిర్ణయం తీసుకోలేక చాలా ఒత్తిడికి కూడా గురవుతున్నారు. ఇప్పుడు మీరు చదవబోయే డిగ్రీ/ కాలేజీ  జీవితకాలం మీతో ఉంటాయి. ఏదైనా కోర్సు ఎంచుకొనే ముందు, మీ ఆసక్తి, మీ దీర్ఘకాలిక ఆశయాలు గమనించుకోవాలి. ఇప్పటినుంచి మరో 20/ 30 సంవత్సరాల తరువాత మిమ్మల్ని మీరెలా చూసుకోవాలనుకొంటున్నారు, మీ  తరువాతి తరం మిమ్మల్ని ఏవిధంగా గుర్తు పెట్టుకోవాలనుకొంటున్నారు అనేవి పరిగణించండి. సమాజం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల కోర్సులూ అవసరమే. ఒక్కో విద్యార్థికి ఒక్కోరకమైన విషయంలో ఆసక్తి ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విద్యార్థి ఏ కోర్సు చదవాలనేదాన్ని ఎక్కువగా మార్కెట్‌ నిర్ణయిస్తోంది. అవసరానికి మించిన సమాచారం అందుబాటులో ఉండటం వల్ల కూడా తల్లిదండ్రులు, విద్యార్థులు సరైన కెరియర్‌ నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారు. కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని కానీ, మెకానికల్‌ లాంటి ఇతర బ్రాంచీలు తీసుకున్నవారికి మంచి భవిష్యత్తు ఉండదని కానీ ఎవరూ చెప్పలేరు. కానీ, పేరున్న విద్యాసంస్థలో ఏ కోర్సు చదివినా, మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. ఐఐటీ/ఎన్‌ఐటీ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదివితే, అక్కడ ఉండే విద్యా నాణ్యత, అధ్యాపకుల బోధన విధానం, విభిన్న ప్రాంతాలనుంచి వచ్చిన విద్యార్థుల విభిన్న సంస్కృతులు, అక్కడ జరిగే పరిశోధనలు మీ ఆలోచనా విధానాన్ని మెరుగైనవిగా మార్చే అవకాశాలున్నాయి. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, మీరు చదవబోయే చదువులకు, చేయబోయే ఉద్యోగాలకు సంబంధం ఉండదు. మీకు నచ్చిన కోర్సులను, మీకు నచ్చిన విధంగా చదువుతూ, నైపుణ్యాలను పెంపొందించుకొనే అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో, మీరు చదివిన డిగ్రీ కంటే, మీరు నేర్చుకొన్న మెలకువలు, అనలిటికల్‌ థింకింగ్‌, ప్రాబ్ల్లమ్‌ సాల్వింగ్‌, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు మీ ఉద్యోగావకాశాలను ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని