ఆస్ట్రో సైంటిస్టు అవ్వాలని..

ఏడో తరగతి చదువుతున్న మా అబ్బాయి ఆస్ట్రో సైంటిస్ట్‌ అవ్వాలనుకుంటున్నాడు. మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లంటే ఇష్టం. స్కూల్లో ఐఐటీ కోచింగ్‌ క్లాసులకు కూడా హాజరవుతున్నాడు

Updated : 09 Aug 2023 04:02 IST

ఏడో తరగతి చదువుతున్న మా అబ్బాయి ఆస్ట్రో సైంటిస్ట్‌ అవ్వాలనుకుంటున్నాడు. మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లంటే ఇష్టం. స్కూల్లో ఐఐటీ కోచింగ్‌ క్లాసులకు కూడా హాజరవుతున్నాడు. తన ఆసక్తికి అనుగుణంగా.. ఇప్పటినుంచీ తనను ప్రోత్సహించాలంటే మేమేం చేయాలి?
 డి.రోహిణి

ఒకవేళ మీ అబ్బాయి ఆస్ట్రో సైంటిస్ట్‌ అవడం మీ అభీష్టమే అయితే, మీ కోరికలను పిల్లల ద్వారా తీర్చుకొనే ప్రయత్నం సరికాదు. దానివల్ల పిల్లలు విపరీతమైన ఒత్తిడికి గురి అవుతారు. అలా కాకుండా మీ అబ్బాయే ఆస్ట్రో సైంటిస్ట్‌ అవ్వాలనుకొంటే, కొంత కాలం వేచి ఉండండి. ఏడో తరగతి చదివే అబ్బాయికి ఇప్పుడుండే ఆసక్తి మరికొన్నాళ్లకు ఉండకపోవచ్చు. 12-13 సంవత్సరాల వయసులో పిల్లలు మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉండే వ్యాపకాలను ప్రోత్సహించండి. ఏడో తరగతి నుంచే ఐఐటీ కోచింగ్‌, సివిల్స్‌ కోచింగ్‌ అనే మార్కెట్‌ ఉచ్చులో పడకండి. పిల్లల మేధా పరిమితికి మించిన ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ లాంటి సబ్జెక్టులను ఏడో తరగతి నుంచే నేర్పే ప్రయత్నం చేస్తే వారికి కొంతకాలం తరువాత చదువంటేనే విసుగొచ్చే ప్రమాదం ఉంది. ఐఐటీ ప్రవేశ పరీక్షకు ప్రత్యేక శిక్షణ కంటే, విద్యార్థుల్లో స్వతహాగా ఉండే జ్ఞానం, ప్రాథమిక అంశాల పరిజ్ఞానం, వాటి అనువర్తనం ముఖ్యం. మీ అబ్బాయికి ఆస్ట్రో సైంటిస్ట్‌ అవ్వాలన్న కోరిక కొన్నేళ్ళపాటు అంతే బలంగా ఉంటే, నిరభ్యంతరంగా ప్రోత్సహించండి.

ఈ వయసులో కొత్త విషయాలు నేర్పే బదులు, ప్రస్తుతం చదువుతున్న విషయాలను మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివేలా ప్రోత్సహించండి. సబ్జెక్టును యాక్టివిటీస్‌, పజిల్స్‌ రూపంలో గ్రహించేలా చూడండి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలు దైనందిన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, సమాజాభివృద్ధికి ఆస్ట్రో సైన్స్‌ ఎలా సాయపడుతోంది అనే విషయాలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్‌ ఒలింపియాడ్‌, సైన్స్‌ ఫెయిర్‌ లాంటివాటిని మీ అబ్బాయికి పరిచయం చేయండి. వారి గమ్యాన్ని వారే సమర్థంగా ఎంచుకొనేలా ధైర్యాన్నివ్వండి. ఇంత చిన్న వయసు నుంచే వారి గమ్యాల్ని నిర్ణయిస్తే, కొన్నేళ్ల తర్వాత ఏవైనా కారణాలవల్ల ఆ ప్రయత్నంలో విఫలమైతే మానసిక కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. విజయం సాధించడంలో ఉన్న సంతోషాన్ని ఆస్వాదించడంతో పాటు, విజయ సాధనలో అపజయం పొందినప్పుడు ఎంత త్వరగా ఆ వైఫల్యం నుంచి బయటపడాలి అనే విషయాలపైనా పిల్లలకు అవగాహన కల్పించండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని