జడ్జి అవ్వాలంటే?

బీఏ, బీఎల్‌ చేశాను. ఇంకా లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం లేదు. జడ్జిగా స్థిరపడాలనుంది. అందుకు ఏ పరీక్షలు రాయాలి?

Updated : 26 Sep 2023 01:17 IST

బీఏ, బీఎల్‌ చేశాను. ఇంకా లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం లేదు. జడ్జిగా స్థిరపడాలనుంది. అందుకు ఏ పరీక్షలు రాయాలి?

వందన

బీఎల్‌ చేసినవారు కనీసం మూడు సంవత్సరాల లా ప్రాక్టీస్‌తో సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) నియామక పరీక్ష రాయడానికి అర్హత ఉంటుంది. ఒకవేళ మూడేళ్ల లా ప్రాక్టీస్‌ అనుభవం లేకపోతే రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ వచ్చేనాటికి బీఎల్‌ అయి కనీసం మూడేళ్లు పూర్తి అవ్వడంతో పాటు, బీఎల్‌లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 55%) మార్కులు పొందాలి. న్యాయవాదిగా నమోదై, మూడేళ్ల అనుభవం లేనివారు కూడా ఫ్రెష్‌ లా గ్రాడ్యుయేట్స్‌ కేటగిరీ కింద అర్హులే. న్యాయవాదిగా అనుభవం ఉన్నవారందరూ బార్‌ అసోసియేషన్‌ నుంచి పొందిన ప్రాక్టీస్‌ సర్టిఫికెట్‌ను రుజువుగా
సమర్పించాలి.

సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి 23- 35 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 సంవత్సరాలు) వయసు, న్యాయవాదిగా పనిచేసిన అనుభవం లేనివారికి 23- 26 సంవత్సరాల (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 31 సంవత్సరాలు) వయసు ఉండాలి. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) రాత పరీక్షకు అర్హత సాధించాలంటే రెండు గంటల వ్యవధిలో 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించే స్క్రీనింగ్‌ పరీక్ష రాయాలి. ఈ పరీక్షలో కనీసం 40% మార్కులు సాధించినవారినుంచి ప్రకటించిన ఖాళీల సంఖ్యకు 10 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను రాత పరీక్షకు అనుమతిస్తారు. స్క్రీనింగ్‌ పరీక్ష లో పొందిన మార్కులకు చివరి ఎంపికలో వెయిటేజి ఉండదు. రాత పరీక్ష మూడు పేపర్లు

(సివిల్‌ లాస్‌, క్రిమినల్‌ లాస్‌, ఇంగ్లిష్‌)గా, ఒక్కో పేపర్‌ను మూడు గంటల వ్యవధిలో, 100 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. ఇంగ్లిష్‌ పరీక్షను క్వాలిఫైయింగ్‌ పరీక్ష గానే గుర్తించి, మొదటి రెండు పేపర్లలో 200 మార్కులకు అభ్యర్ధులు పొందిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకొని, ఇంటర్వ్యూ (వైవా వోస్‌)కి షార్ట్‌ లిస్ట్‌ చేస్తారు. సివిల్‌ లాస్‌, క్రిమినల్‌ లాస్‌.. రెండు పేపర్లలో కనీసం 60% మార్కులు (ఎస్సీ, ఎస్టీలకు 50%) పొందినవారి నుంచి 1: 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 30 మార్కులకు ఉంటుంది. మొత్తం 230 మార్కుల్లో అభ్యర్ధులు పొందిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని