వేరే గ్రూపులోకి మారిపోవాలా?

ఇంజినీరింగ్‌ చేయాలని.. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్నాను. కానీ నాకు లెక్కలంటే భయం. ఇప్పుడు వేరే గ్రూపులోకి మారిపోవాలా ...

Published : 11 Oct 2023 00:24 IST

ఇంజినీరింగ్‌ చేయాలని.. ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్నాను. కానీ నాకు లెక్కలంటే భయం. ఇప్పుడు వేరే గ్రూపులోకి మారిపోవాలా ... ఎలాగోలా నెట్టుకురావాలా?

సుధాకర్‌  

ఇంజినీరింగ్‌ చేయాలని ఎంపీసీ గ్రూప్‌ తీసుకోవడం సరైన నిర్ణయమే! కానీ మ్యాథ్స్‌ అంటే భయం అంటున్నారు. ఈ భయం ఎప్పటినుంచి ఉంది? మీకు పదో తరగతిలో మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులు వచ్చాయి? హైస్కూల్‌లో మ్యాథ్స్‌ టీచర్‌ సరిగా చెప్పకపోవడం వల్ల కానీ, కుటుంబంలో అక్క/అన్న మ్యాథ్స్‌లో ఫెయిల్‌ అవ్వడం వల్ల కానీ ఇలాంటి భయాలు మొదలవుతాయి. తోటి మిత్రులు అదే పనిగా మ్యాథ్స్‌ పట్ల భయం కలిగే మాటలు చెప్పడం వల్లనో, ఇప్పుడు ఇంటర్లో మ్యాథ్స్‌ లెక్చరర్‌ సరిగా చెప్పకపోవడం వల్లనో కూడా ఇలా జరగొచ్చు.

నాకు తెలిసిన ఒక విద్యార్థి మీలాగే మ్యాథ్స్‌ అంటే భయపడి ఇంటర్‌లో దాన్ని వద్దనుకొని బైపీసీ చదివి, మెడికల్‌ ఎంట్రెన్స్‌లో విఫలమయ్యాడు. తరువాత ఇంటర్‌లో ఉన్న నాలుగు మ్యాథ్స్‌ పేపర్లను ప్రైవేటుగా రాసి ఎంసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ పూర్తిచేశాడు. యూఎస్‌లో ఎమ్మెస్‌ చేసి, ప్రస్తుతం అక్కడే ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు. మీరు కూడా మ్యాథ్స్‌పై భయం పోగొట్టుకొని, ఇంటర్‌ పూర్తిచేసి, మంచి కాలేజీలో మ్యాథ్స్‌తో ఎక్కువగా అవసరం లేని బ్రాంచితో ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ, మీరు ఇప్పుడు ఎంపీసీ గ్రూపు నుంచి వేరే గ్రూపునకు మారినా, భవిష్యత్తులో మీరు రాయబోయే ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అరిథ్‌మెటిక్‌/ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌/ లాజికల్‌ రీజనింగ్‌/ డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ లాంటి సబ్జెక్టులకు మ్యాథ్స్‌లో ప్రాథమిక పరిజ్ఞానం చాలా అవసరం. ఇంజినీరింగ్‌ చదవడం కోసం కాకపోయినా భవిష్యత్తులో మెరుగైన ప్రభుత్వ ఉద్యోగం పొందడం కోసమైనా ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదవడం ఉపయోగకరంగా ఉంటుంది. అవసరమైతే మ్యాథ్స్‌కు ట్యూషన్‌కు వెళ్లండి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు