దేన్ని ఎంచుకుంటే మేలు?

రెండేళ్ల కిందట బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశాను. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను.

Published : 12 Oct 2023 00:02 IST

రెండేళ్ల కిందట బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేశాను. ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. ఇప్పుడు ఎంసీఏ చేయాలనుంది. అయితే పోటీ పరీక్షలు రాయడమా, ఎంసీఏ చదవడమా..
దేన్ని ఎంచుకుంటే మంచిది?

సాయియాదవ్‌

మీరు రెండు సంవత్సరాల క్రితమే బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేశారు కాబట్టి మీ వయసు దాదాపుగా 23/24 సంవత్సరాలు ఉండొచ్చు. గత రెండు సంవత్సరాలుగా మీరు కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులకు దూరంగా ఉండుంటారు. మరో రెండు సంవత్సరాలు మీరు పోటీ పరీక్షల ప్రిపరేషన్‌లోనే ఉంటే, కంప్యూటర్‌ సైన్స్‌కు ఇంకా దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ రెండేళ్లలో ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోతే ఆ తరువాత మరో రెండేళ్లు ఎంసీఏ చదవాల్సి ఉంటుంది. అప్పుడు మీ వయసు 27/28 సంవత్సరాలు అవ్వొచ్చు. అలా కాకుండా, ఇప్పుడే మీరు ఎంసీఏలో చేరితే ప్రభుత్వ ఉద్యోగాల సన్నద్ధతకు దూరం  అవుతారు.

నిర్ణయం తీసుకునేముందు కింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి. మీ లక్ష్యం ప్రభుత్వ ఉద్యోగమా? సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమా? గత రెండేళ్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ప్రభుత్వ ఉద్యోగం సాధించగలనని గట్టి నమ్మకం ఉందా? కంప్యూటర్‌ సైన్స్‌కి సంబంధించిన సబ్జెక్టులపై, ప్రోగ్రామింగ్‌పై మీకెంత పట్టు ఉంది? ఎంసీఏ సీటును ఎన్‌ఐటీ, సెంట్రల్‌ యూనివర్సిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో పొందగలననే నమ్మకం ఉందా? ఎంసీఏ చదివితే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం. ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండటంవల్ల కొలువు వస్తుందన్న గ్యారంటీ తక్కువ. ఎంసీఏ చదువుతూ, ప్రభుత్వ ఉద్యోగ సన్నద్ధతను కూడా సమన్వయం చేయగల సామర్థ్యం మీకుందా? ఇలాంటి విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని