సివిలా.. క్రిమినలా?

బీఎల్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. పేరూ, డబ్బూ రెండూ సంపాదించాలంటే ప్రాక్టీసుకు సివిల్‌- క్రిమినల్‌లలో దేన్ని ఎంచుకోవాలి?

Updated : 16 Oct 2023 02:17 IST

బీఎల్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. పేరూ, డబ్బూ రెండూ సంపాదించాలంటే ప్రాక్టీసుకు సివిల్‌- క్రిమినల్‌లలో దేన్ని ఎంచుకోవాలి?

కృష్ణప్రసాద్‌

మంచి కెరియర్‌ అంటే.. ఎక్కువ డబ్బూ, పేరూ సంపాదించేది అనే ఆలోచన చాలామందిలో స్థిరపడిపోయింది. టీచర్‌, డాక్టర్‌, లాయర్‌, ఇంజినీర్‌ లాంటి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి సేవ మొదటి స్థానంలో, సంతృప్తి రెండో స్థానంలో, డబ్బు చివరి స్థానంలో ఉండాలి. ఇలాంటి వృత్తిలో ఉండేవారు ఎదుటివారి సమస్యలు పరిష్కరిస్తూ, వారి సంతోషానికి కారణమవుతూ కెరియర్‌ కొనసాగిస్తే ఈ రెండూ వచ్చే అవకాశాలుంటాయి.

సివిల్‌, క్రిమినల్‌ రెండు రంగాలూ చాలా మంచివే. కానీ, సమాజంలో క్రిమినల్‌ లాయర్‌లకు ఎక్కువ సంపాదన ఉంటుందన్న అపోహ ఉంది. సివిల్‌ లాయర్లుగా పనిచేస్తూ కూడా మంచి పేరు, డబ్బు సంపాదించినవారు ఉన్నారు. అదే సమయంలో క్రిమినల్‌ లాయర్‌గా ఈ రెండూ సంపాదించనివారూ ఉన్నారు. ప్రొఫెషనల్‌ కోర్సులు చదివినవారు కెరియర్లో రాణించాలంటే డిగ్రీ మాత్రమే ఉంటే సరిపోదు. తెలివితేటలు, వ్యక్తిత్వం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు లాంటివి ప్రభావితం చేస్తాయి. న్యాయవాద వృత్తిలో వీటికి అదనంగా నెట్‌ వర్కింగ్‌ స్కిల్స్‌, సమయస్ఫూర్తి, లాజికల్‌/ అనలిటికల్‌ రీజనింగ్‌, జ్ఞాపకశక్తి చాలా అవసరం. ఈ వృత్తిలో పేరు అంత త్వరగా రాదు. కొన్నేళ్ల పాటు వాదించిన కేసులు, విజయాల శాతం, ఎన్ని క్లిష్టమైన కేసుల్ని విజయవంతంగా వాదించారు, నిజాయతీ, సమగ్రత లాంటి ఎన్నో కెరియర్‌ను ప్రభావితం చేస్తాయి. సివిల్‌, క్రిమినల్‌.. రెండూ న్యాయవ్యవస్థలో కీలకమైనవి కాబట్టి, మీ ఆసక్తిని బట్టి సరైన నిర్ణయం తీసుకోండి. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు