వ్యక్తిత్వ వికాస కోచ్‌ అయ్యేదెలా?

ఎంఏ ఇంగ్లిష్‌ చేశాను. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌గా స్థిరపడాలనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా కోర్సు చదవాలా? ఎలాంటి లక్షణాలు ఉండాలి?

Published : 25 Oct 2023 00:09 IST

ఎంఏ ఇంగ్లిష్‌ చేశాను. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోచ్‌గా స్థిరపడాలనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా కోర్సు చదవాలా? ఎలాంటి లక్షణాలు ఉండాలి?
నరసింహారావు  

ప్రస్తుత పోటీ ప్రపంచంలో లక్ష్యాలను సాధించగల సామర్థ్యం ద్వారా మాత్రమే విజయాన్ని కొలుస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్నప్పటికీ, జీవితంలో ఎదుగుదల కోసం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడం అవసరం. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ అంటే వ్యక్తిత్వాన్ని రూపొందించే నైపుణ్యాలను పెంపొందించడంపై మరింత దృష్టి పెట్టడం. ఇతరుల వ్యక్తిత్వాలను మెరుగుపరుస్తూ స్వీయ అవగాహన పొందే మెలకువలను ఎవరికి వారే స్వయంగా నేర్చుకోవడంలో వ్యక్తిత్వ వికాస కోచ్‌ సహాయపడతారు. అందుకు అవసరమైన వ్యూహాలను ప్రయోగిస్తారు. వ్యక్తి సామాజిక నైపుణ్యాలు, ఉత్పాదకత, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, పాజిటివ్‌ థింకింగ్‌, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ పెంపొందించడంపై దృష్టి పెడతారు. అదేసమయంలో లక్ష్యాలను నిర్దేశించుకోడానికీ, వాటి సాధనకూ మార్గదర్శకాలను అందిస్తారు. వ్యక్తుల బలాలు, బలహీనతలు, అవకాశాలు, ఇబ్బందులు గుర్తించడంలో సహాయపడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవిత సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలనే విషయాలపై సలహాలు ఇస్తారు.

కోచ్‌గా రాణించాలంటే ఈ రంగంపై విపరీతమైన ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత, నెట్‌ వర్కింగ్‌ నైపుణ్యాలు, సానుకూల దృక్పథం, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌, సహానుభూతి, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, ఎంతో ఓపిక, దృఢమైన వ్యక్తిత్వం అవసరం. ముందుగా సైకాలజీ, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, స్వీయ చరిత్రలు చదవండి. వీలుంటే సైకాలజీలో పీజీ చేయండి. కౌన్సెలింగ్‌ సైకాలజీలో డిప్లొమా కూడా చేయండి. పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ కోర్సులను ఆన్‌  లైన్‌లో చేయండి. సంబంధిత కోచ్‌ దగ్గర అప్రెంటిస్‌గా చేరి ఈ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకొని, విశ్వసనీయత గల సంస్థ నుంచి సర్టిఫికేషన్‌ పొందే  ప్రయత్నం చేయండి. సరైన నైపుణ్యాలు లేకుండా ఈ రంగంలో ప్రవేశించకూడదని మర్చిపోవద్దు.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు