పనీ, జీతం సంతృప్తిగా లేవు..

బీఎస్సీ (ఎంఎల్‌టీ) చేసి రెండేళ్లుగా హాస్పిటల్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నా. పనీ, జీతం రెండూ సంతృప్తిగా లేక బోధనలోకి వెళ్లాలనుకుంటున్నా. దీనిలో వేతనాలు, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 31 Oct 2023 01:02 IST

బీఎస్సీ (ఎంఎల్‌టీ) చేసి రెండేళ్లుగా హాస్పిటల్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నా. పనీ, జీతం రెండూ సంతృప్తిగా లేక బోధనలోకి వెళ్లాలనుకుంటున్నా. దీనిలో వేతనాలు, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

కె.ప్రియ

మీరు బోధనపై ఆసక్తితో ఆ రంగంలోకి రావాలి కానీ వేరే ఉద్యోగంపై ఉన్న అసంతృప్తితో కాదు. దానివల్ల మీరూ, మీ దగ్గర చదువుకొనే విద్యార్థులూ సంతృప్తిగా ఉండలేరు. బోధన రంగంలో ప్రభుత్వ కళాశాలల్లో ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ఉన్న ఆ కొద్ది అవకాశాలకూ పోటీ ఎక్కువ. ఇక ప్రైవేటు కళాశాలల విషయానికొస్తే, వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. మీరు హాస్పిటల్లో పనిచేస్తే భవిష్యత్తులో మీ ప్రతిభకు తగ్గ వేతనాలు లభించే అవకాశం ఉంటుంది. కానీ బోధన రంగంలో ప్రతిభకు తగ్గ వేతనాలు, పదోన్నతులు ఆకర్షణీయంగా ఉండవు. ప్రైవేటు కళాశాలల్లో ఎంఎల్‌టీ కోర్సుల్లో అడ్మిషన్ల సమస్య ఉంది. అడ్మిషన్లు ఉన్న కళాశాలల్లో హాజరు సమస్య ఉంది. హాజరు ఉన్నచోట కోర్సుపై ఆసక్తి ఉన్న విద్యార్థులు పరిమిత సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఉద్యోగ సంతృప్తి దొరకడం చాలా కష్టం. మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు రకరకాల పేషంట్లను చూస్తూ ఉన్నట్టే కళాశాలలో బోధించేప్పుడు రకరకాల మనస్తత్వాలున్న విద్యార్థుల్ని చూస్తారు. భిన్న సామర్థ్యాలుండే విద్యార్థులకు సంతృప్తికరంగా బోధించటం పెద్ద సవాలే. కానీ మీకు బోధన రంగంపై విపరీతమైన ఆసక్తీ, సంబంధిత నైపుణ్యాలూ ఉంటే, బోధన ద్వారా ఎదుటి వారి జీవితాల్ని మార్చాలనే ఆసక్తి బలంగా ఉంటే నిరభ్యంతరంగా ఈ రంగంలో ప్రవేశించవచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు