ఏది ఎంచుకుంటే మెరుగు?

బీఎల్‌ చివరి సంవత్సరం చదువుతున్నా. ఏడాది సీనియర్‌ దగ్గర పనిచేశాక ప్రాక్టీస్‌ పెట్టాలనేది నా కోరిక.

Published : 14 Nov 2023 01:04 IST

బీఎల్‌ చివరి సంవత్సరం చదువుతున్నా. ఏడాది సీనియర్‌ దగ్గర పనిచేశాక ప్రాక్టీస్‌ పెట్టాలనేది నా కోరిక. కానీ మిత్రులు ఏదైనా కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చూసుకోమంటున్నారు. రెండిట్లో ఏది మంచిది?

డి.రామకృష్ణ

వీటిలో మీకు ఏది బాగా ఇష్టమో నిర్ధరణకు రండి. రెండింటిలో ఉన్న లాభనష్టాలను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోండి. మిత్రులు, కౌన్సెలర్లు సలహాలు మాత్రమే ఇవ్వగలరు. నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ముందుగా సీనియర్‌ దగ్గర పనిచేసి సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టే విషయానికొస్తే- సీనియర్‌ దగ్గర పనిచేస్తే, వృత్తిలో మెలకువలు నేర్చుకొని భవిష్యత్తులో సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకొని మంచి న్యాయవాదిగా రాణించే అవకాశాలుంటాయి. దీంట్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మీరు సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టినప్పుడు, మొదట్లో మీరు జూనియర్‌ లాయర్‌ అని కేసులు ఎక్కువగా రాకపోయే అవకాశం ఉంది. లాయర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల పోటీ కూడా ఎక్కువే. మీరు లాయర్‌గా స్థిరపడటానికి చాలా సమయం పట్టవచ్చు. కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తే ఉద్యోగ భద్రత ఉంటుంది కానీ, మీరు వ్యక్తిగతంగా కేసుల్ని వాదించి పేరు తెచ్చుకొనే అవకాశాలు తక్కువ. మీరు వాదించిన కేసుల్లో విజయం సాధించినా, ఆ విజయం మీరు పనిచేసే సంస్థకే చెందుతుంది. ఉదాహరణకు కొంత అనుభవం గడించి మీరే సొంతంగా కంపెనీ పెట్టడమా, జీవితకాలం ఏదో ఒక కంపెనీలో వేతనానికి పనిచేయడమా అనేది వ్యక్తిగత నిర్ణయం. కెరియర్లో రిస్క్‌ తీసుకోగల్గటం, ఉద్యోగ భద్రత, పరిమిత జీతం, అపరిమితమైన పేరు ప్రఖ్యాతులు, ఎక్కువ ఆదాయం అనే విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. ఏది సరైందో ఆలోచించి నచ్చిన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని