సర్కారీ సాయం ఎలా?

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. చదరంగం పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. కోచింగ్‌ తీసుకునే స్థోమత లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ప్రభుత్వ సాయం లభిస్తుందా?

Published : 15 Nov 2023 00:02 IST

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. చదరంగం పోటీల్లో బహుమతులు గెలుచుకున్నా. కోచింగ్‌ తీసుకునే స్థోమత లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ప్రభుత్వ సాయం లభిస్తుందా?

అభిరామ్‌

మీకు చదరంగ క్రీడాకారుడిగా రాణించాలన్న ఆసక్తి ఉంటే, ఆల్‌ ఇండియా చెస్‌ ఫెడరేషన్‌ వెబ్‌సైట్‌కి  వెళ్ళి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత ఆ వెబ్‌సైట్‌ నుంచి చెస్‌ టోర్నమెంట్‌ల గురించి సమాచారం పొందండి. సంబంధిత రాష్ట్ర చెస్‌ అసోసియేషన్‌ కార్యాలయాన్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోండి. మీరు డిగ్రీ చదువుతున్న కళాశాలలో చదరంగ ఛాంపియన్‌ అయి, యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించే స్థాయికి రావాలి. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మీ కళాశాల వ్యాయామ అధ్యాపకుడి ద్వారా తెలుసుకోండి. ఇంటర్‌ యూనివర్సిటీ టోర్నమెంటుల్లో పాల్గొని, అక్కడ కూడా ఛాంపియన్‌ అయి, ముందుగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని రాష్ట్రానికీ, ఆ తరువాత అంతర్జాతీయ పోటీల్లో దేశానికీ ప్రాతినిధ్యం వహించగల్గితే, అప్పుడు ప్రభుత్వ సాయం లభించే అవకాశం ఉంది. మీరు కనీసం జాతీయస్థాయి పోటీల్లో రాణిస్తే, స్పాన్సర్లు లభించే అవకాశం ఉంటుంది. స్పాన్సర్లు లభిస్తే, కోచ్‌లు కూడా అందుబాటులో ఉంటారు. అంతవరకు, మీరే కోచ్‌ని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాకే ప్రభుత్వ సాయం అందే అవకాశాలు ఉంటాయి. చదరంగం లాంటి క్రీడలకు స్పాన్సర్లు తక్కువగా ఉంటారు. స్పాన్సర్ల సాయం పొందగలిగే స్థాయికి రావాలంటే కనీసం పది సంవత్సరాలు, ప్రభుత్వ సాయం పొందాలంటే ఆ తర్వాత కనీసం మరో ఐదేళ్లు విజయాలు సాధిస్తూనే ఉండాలి. అందుకోసం నిరంతరంగా, ఓపిగ్గా కృషి చేయాలి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని