ఈవినింగ్‌ కాలేజీలో చేరొచ్చా?

మా అమ్మాయికి బీఈ (సివిల్‌) రెండో సంవత్సరం చదివాక కేంద్ర ప్రభుత్వ కొలువు వచ్చింది.

Published : 27 Nov 2023 00:14 IST

మా అమ్మాయికి బీఈ (సివిల్‌) రెండో సంవత్సరం చదివాక కేంద్ర ప్రభుత్వ కొలువు వచ్చింది. ఉద్యోగం చేస్తూ బీఈ మూడో సంవత్సరం ఈవినింగ్‌ కాలేజీలో చదివే అవకాశం ఉందా?

ఎల్‌.సమ్మయ్య నాయక్‌

ఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రస్తుత నిబంధనల ప్రకారం ఇంజినీరింగ్‌ కోర్సును దూరవిద్య ద్వారా చదవడం కుదరదు. కానీ, మూడు సంవత్సరాల డిప్లొమాతో ఉద్యోగం చేస్తున్నవారు మాత్రం ఈవినింగ్‌ కళాశాల్లో ఇంజినీరింగ్‌ కోర్సు చదవొచ్చు. మీ అమ్మాయి పదో తరగతి/ ఇంటర్మీడియట్‌ తరువాత డిప్లొమా చదివి ఉండకపోతే ఈవినింగ్‌ కళాశాలలో ఇంజినీరింగ్‌ చదివే అవకాశం లేదు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ వారి ఏఎంఐఈ (అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సర్టిఫికెట్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీకి సమానం అవుతుంది. కాకపోతే, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ. మీ అమ్మాయిని బీఈ/ బీటెక్‌ మాత్రమే చదివించాలి అనుకొంటే,  బీఎస్సీని మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌లతో పూర్తి చేసి, బిట్స్‌ పిలానీ వారి వర్క్‌ ఇంటిగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రాం (విల్ప్‌) ద్వారా బీటెక్‌ చేసే వీలుంది. దూరవిద్యలో బీఎస్సీ తరువాత, ఎమ్మెస్సీ( మ్యాథ్స్‌/ ఫిజిక్స్‌) చేసి బిట్స్‌ విల్ప్‌ ద్వారా ఎంటెక్‌ చేసే అవకాశమూ ఉంది. ప్రస్తుతం తను ఉద్యోగం చేస్తున్న సంస్ధ నుంచి రెండు సంవత్సరాల సెలవు తీసుకొని, తను గతంలో చదివిన ఇంజినీరింగ్‌ కళాశాల నుంచి మిగిలిన రెండు సంవత్సరాల కోర్సును పూర్తిచేసే అవకాశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు