విదేశీ విద్యా? పోటీ పరీక్షలా?

ఇంజినీరింగ్‌ అయ్యాక మనదేశంలోనే ఉద్యోగం చేయాలా? విదేశాల్లో ఎంఎస్‌ చేయాలా? అనే ప్రశ్న చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనేదే! ముందుగా మీరు విదేశాలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారు

Published : 02 Jan 2024 00:15 IST

విదేశాల్లో ఎంఎస్‌ చేయాలనుంది. పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వోద్యోగం సంపాదించమంటున్నారు అమ్మానాన్నా. ఎటూ తేల్చుకోలేకపోతున్నా.

రవితేజ

  • ఇంజినీరింగ్‌ అయ్యాక మనదేశంలోనే ఉద్యోగం చేయాలా? విదేశాల్లో ఎంఎస్‌ చేయాలా? అనే ప్రశ్న చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనేదే! ముందుగా మీరు విదేశాలకు ఎందుకు వెళ్ళాలనుకొంటున్నారు అనే విషయంపై స్పష్టత అవసరం. చాలామంది మెరుగైన విద్య, ఉపాధి కావాలనో, డబ్బు, విలాసవంతమైన జీవితం కోసమనో, కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడానికో, విదేశాల్లో స్థిరపడాలనే కల నెరవేర్చుకోవడం కోసమనో.. ఇలా వివిధ కారణాలు చెప్తుంటారు. పైన చెప్పినవాటిలో మీరు ఏ కారణంతో విదేశాలకు వెళ్లాలనుకొంటున్నారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి.

పిల్లల్ని విదేశాలకు పంపడం చాలామంది తల్లిదండ్రులు ఒక హోదాగా భావిస్తున్నారు. విదేశాలకు వెళ్లకుండా మనదేశంలోనే స్థిరపడాలనుకునే చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పే కారణాలు ఇలా ఉంటాయి: విదేశీ(( విద్య ఖర్చుతో కూడుకున్నది, విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉండి మన దేశాభివృద్ధికి తోడ్పడాలి, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడుగా ఉండాలి, విలాసాలు, సౌకర్యాల విషయంలో మనదేశం కూడా విదేశాలతో పోటీ పడుతోంది, ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణించవచ్చు, దూరపు కొండలు నునుపు..ఇలా! ఇవి రెండూ కాకుండా కొంతమంది ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్లి, అక్కడ కొంత అనుభవం గడించి, వెనక్కి వచ్చి భారత్‌లో స్థిరపడటం కూడా గమనిస్తున్నాం. విదేశాలకు వెళ్ళడం, లేదా ఇక్కడే స్థిరపడటం అనేది మీ వ్యక్తిగత నిర్ణయం. విదేశీ విద్య కొంత ఆర్థికభారంతో కూడుకొంది కాబట్టి మీరు, మీ కుటుంబ సభ్యులూ కలిసి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అంశమిది.

ప్రస్తుతం మనదేశంలో ప్రభుత్వ ఉద్యోగం పొందడం, గేట్‌లో మెరుగైన ర్యాంకు పొందడం అనేవి... విదేశాల్లో ఎంఎస్‌ సీటు తెచ్చుకోవడం కంటే కూడా ఎక్కువ కష్టంగా ఉన్నాయి. విదేశాల్లో చదువుతున్న చాలామంది ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఉద్యోగాలు పొందడం కష్టంగా ఉంది కాబట్టి కొంతకాలం విదేశీ విద్య ఆలోచనల్ని పక్కనపెట్టడం మంచిదని సలహాలు ఇస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాలు తగ్గుతున్న ఈ సందర్భాల్లో కూడా చాలామంది విదేశీ విద్యపై మోజు పడుతూనే ఉన్నారు. మీకు ప్రతిభ, విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలుంటే ఎక్కడైనా ఉద్యోగం పొందవచ్చు. డిగ్రీల ఆధారంగా మాత్రమే ఉద్యోగాలు పొందే రోజులు పోయాయి. మారుతున్న పరిస్థితుల్లో డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం, వ్యక్తిత్వం, భావప్రకటనా సామర్థ్యం, సృజనాత్మకత, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌, కృత్రిమ మేధపై అవగాహన లాంటివి మంచి ఉద్యోగం పొందడానికి దోహదపడుతున్నాయి.ఇవి దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని