నేను అర్హుడినేనా?

మీరు ఒకే సమయంలో పీజీ, బీఈడీ చేస్తున్నాను అన్నారు. యూజీసీ 2022 నిబంధనల ప్రకారం రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఏకకాలంలో చేయవచ్చు. అందులో ఒకటి రెగ్యులర్‌గా అయితే, మరొకటి డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయవచ్చు. డిగ్రీ, పీజీలు యూజీసీ పరిధిలో ఉంటాయి కాబట్టి రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఒకేసారి చేయడంలో ఇబ్బంది లేదు.

Published : 24 Jan 2024 00:15 IST

బి.ఎ. (ఈపీపీ) గ్రూపుతో పాసయ్యాను. తెలుగు స్పెషల్‌ సబ్జెక్టుగా చదవలేదు. యూజీసీ నిబంధనల ప్రకారం.. బీఈడీ, పీజీ ఒకేసారి చేస్తున్నాను. 2023లో టీఎస్‌టెట్‌ పేపర్‌-2 పాసయ్యాను. బీఈడీ రెండో ఏడాదిలో సోషల్‌, తెలుగు మెథడ్స్‌ చదువుతున్నా. అంబేడ్కర్‌ ఓపెన్‌వర్సిటీలో ఎంఏ తెలుగు లిటరేచర్‌ రెండో ఏడాది చదువుతున్నా. ఇది 2024 జులైలో పూర్తవుతుంది. 2024 ఆగస్టు తర్వాత డీఎస్సీ వస్తే స్కూల్‌ అసిస్టెంట్‌ తెలుగు పోస్టుకు అర్హుడిని అవుతానా?

ఎ. మహేష్‌ చంద్ర

మీరు ఒకే సమయంలో పీజీ, బీఈడీ చేస్తున్నాను అన్నారు. యూజీసీ 2022 నిబంధనల ప్రకారం రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఏకకాలంలో చేయవచ్చు. అందులో ఒకటి రెగ్యులర్‌గా అయితే, మరొకటి డిస్టెన్స్‌/ ఓపెన్‌/ ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయవచ్చు. డిగ్రీ, పీజీలు యూజీసీ పరిధిలో ఉంటాయి కాబట్టి రెండు పీజీలూ, రెండు డిగ్రీలూ ఒకేసారి చేయడంలో ఇబ్బంది లేదు. కానీ ఒక డిగ్రీ యూజీసీకి సంబంధించి, మరొకటి ఏదైనా రెగ్యులేటరీ సంస్థ పరిధిలో ఉన్న డిగ్రీ అయితే, ఆ రెండు డిగ్రీలూ చెల్లుబాటు అవుతాయా అనే విషయంలో ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఉదాహరణకు ఎంబీబీఎస్‌ చదివే విద్యార్థి, ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి బి.ఎ. చదివే అవకాశం ఉందా? ఎల్‌ఎల్‌బీ చదివే విద్యార్థి అదేసమయంలో ఎంబీఏ కూడా చదవొచ్చా? ఇలాంటి సందేహాలు చాలామందిని వేధిస్తున్నాయి. మీ విషయానికొస్తే- ఎంఏ (తెలుగు) యూజీసీ పరిధిలో ఉంటే, బీఈడీ ప్రోగ్రాం ఎన్‌సీటీఈ పరిధిలో ఉంది. కానీ, ఇటీవల కొన్ని యూనివర్సిటీలు ఏఐసీటీఈ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్‌ కోర్సుతో పాటు యూజీసీ పరిధిలో ఉన్న బీబీఏ (ఈ సంవత్సరం నుంచి బీబీఏ కూడా ఏఐసీటీఈ పరిధిలోకి వచ్చింది)లను కలిపి ఒకే సమయంలో చదివే వెసులుబాటు కల్పించారు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేలోగా అవకాశం ఉంటే, బీఈడీ పూర్తిచేశాక మరో యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు మరోసారి చదివే ప్రయత్నం చేయండి. టెట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం డీఈడీ…/ బీఈడీ చివరి సంవత్సరం చదివేవారు టెట్‌ రాయడానికి అర్హులు. మీరు టెట్‌ క్వాలిఫై అయింది బీఈడీ మొదటి సంవత్సరంలోనా, రెండో సంవత్సరంలోనా అనేది చెప్పలేదు. ఏదైనా కోర్సులో చేరేముందు ఆ కోర్సుతో లభించే ఉద్యోగ నోటిఫికేషన్లను పరిశీలించి, అందులో ఉన్న అర్హతలను బట్టి మీ కెరియర్‌ నిర్ణయాలను తీసుకోండి. చివరిగా- యూజీసీ రెండు కోర్సులు ఏకకాలంలో చేసే వెసులుబాటు కల్పించినా, ప్రొఫెషనల్‌ కోర్సులతో పాటు మరొక కోర్సు చదవకపోవడం వల్ల ప్రొఫెషనల్‌ కోర్సుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టి, ఆ రంగంలో బాగా రాణించే అవకాశం ఉంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు