ఈ వయసులో సాధ్యమేనా?

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. ఎంసీఏను దూరవిద్యలో పూర్తిచేశా. బోధన రంగంలో పనిచేసి ఈమధ్యే వదిలిపెట్టాను. కోడింగ్‌ అంటే ఆసక్తి లేదు. 43 ఏళ్ల ఈ వయసులో కెరియర్‌లో ఎలా విజయం సాధించాలి?

Published : 31 Jan 2024 05:07 IST

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివాను. ఎంసీఏను దూరవిద్యలో పూర్తిచేశా. బోధన రంగంలో పనిచేసి ఈమధ్యే వదిలిపెట్టాను. కోడింగ్‌ అంటే ఆసక్తి లేదు. 43 ఏళ్ల ఈ వయసులో కెరియర్‌లో ఎలా విజయం సాధించాలి?

డి.సుజాత

మీకు కోడింగ్‌ అంటే ఇష్టం లేదు కాబట్టి, సాప్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం పొందడం కష్టం. మీ వయసు ప్రకారం కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదు. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు గరిష్ఠ వయసు తెలంగాణలో 44 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 42 సంవత్సరాలుగా ఉంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు పది సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది.

ముందుగా మీకు కెరియర్‌లో విజయం పొందడం అనే విషయంపై స్పష్టత అవసరం. సాధారణంగా కెరియర్‌ నిర్ణయాలు వ్యక్తిగత ఆసక్తి, అభిరుచి, విద్యార్హతలు, ఉద్యోగ అనుభవం, వయసు, విషయ పరిజ్ఞానం, భావప్రకటన సామర్థ్యం, కుటుంబ సహకారం, ఆర్థిక స్థోమత లాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. మీ దృష్టిలో కెరియర్‌ అంటే ఉద్యోగమా? వ్యాపారమా? సామాజిక సేవా? దీనిపై స్పష్టత తెచ్చుకోండి. ఒకవేళ ఉద్యోగం అయితే, ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటుదా? ఈ వయసులో మీరు పోటీ పరీక్షలు రాయాలంటే, మీకంటే కనీసం 15 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న అభ్యర్థులతో పోటీ పడాల్సిఉంటుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి  కావాలి. మీరు ప్రస్తుతం నివసిస్తున్న ఊళ్లో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని, వాటిలో మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకోండి. ఆ రంగంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీకు ఆసక్తి ఉంటే, సైకాలజీలో పీజీ చేయండి. ఆపై కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి, కౌన్సెలర్‌గా స్థిరపడొచ్చు. తక్కువ పెట్టుబడితో బేబీ కేర్‌ సెంటర్‌ కూడా ప్రారంభించవచ్చు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి ఉంటే ఎంచుకున్న కెరియర్‌లో వయసుతో సంబంధం లేకుండా రాణించవచ్చు.  

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని