వైద్యో నారాయణో హరిః

వైద్యుడంటే?ఓ సలహాదారు. మార్గదర్శి. శ్రేయోభిలాషి, ప్రాణ రక్షణకుడు. మొత్తంగా దైవ సమానుడు! ఒక ప్రాణాన్ని నిలబెట్టినప్పుడో, ప్రమాదకరమైన సమస్యను గుర్తించి చికిత్స చేసినప్పుడో డాక్టర్లకు కలిగే తృప్తే వేరు. అలాంటి డాక్టర్లకు అత్యంత సంతృప్తి కలిగించిన అనుభవాలేమిటి? వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేమిటి? డాక్టర్స్‌ డే సందర్భంగా కొందరు వైద్యుల అనుభవాలు తెలుసుకుందాం.

Updated : 30 Jun 2020 01:28 IST

రేపు డాక్టర్స్‌ డే

వైద్యుడంటే?ఓ సలహాదారు. మార్గదర్శి. శ్రేయోభిలాషి, ప్రాణ రక్షణకుడు. మొత్తంగా దైవ సమానుడు! ఒక ప్రాణాన్ని నిలబెట్టినప్పుడో, ప్రమాదకరమైన సమస్యను గుర్తించి చికిత్స చేసినప్పుడో డాక్టర్లకు కలిగే తృప్తే వేరు. అలాంటి డాక్టర్లకు అత్యంత సంతృప్తి కలిగించిన అనుభవాలేమిటి? వాటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేమిటి? డాక్టర్స్‌ డే సందర్భంగా కొందరు వైద్యుల అనుభవాలు తెలుసుకుందాం.


గర్భసంచి లాక్‌డౌన్‌ కాలేదు!

కరోనా లాక్‌డౌన్‌ గర్భిణులకు చిక్కులు తెచ్చిపెట్టింది. పెద్ద డాక్టర్లు అందుబాటులో లేకపోవటం ఇబ్బందులకు గురిచేసింది. ఇటీవల నేను చూసిన ఒక గర్భిణి కథ అలాంటిదే. ఇది వేరే ఆసుపత్రి నుంచి వచ్చిన కేసు. ఆమెకు పదేళ్ల కిందట పెళ్లయ్యింది. ఇటీవల తొలిసారి గర్భం దాల్చింది. స్కాన్‌ చేయిస్తే పిండం ఫలోపియన్‌ గొట్టంలో ఉందని (ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ) తేలింది. గొట్టం ఎప్పుడైనా పగిలిపోవచ్చని చెప్పారు. పెద్ద డాక్టర్లు ఆందుబాటులో లేకపోవటంతో జూనియర్‌ డాక్టర్లు భయపడిపోయారు. నన్ను సంప్రదించారు. ముందు స్కానింగ్‌ నిపుణులకు చూపించండి, తర్వాత ఆలోచిద్దామన్నాను. వాళ్లు మరో ఆసుపత్రికి పంపించారు. అక్కడా గొట్టంలో పిండం ఉందనే తేల్చారు. నిపుణుల సలహా తీసుకోకుండానే ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. ఎందుకనో భయపడిపోయి, నన్ను పిలిపించారు. ఆ గర్భిణితో మాట్లాడుతూ.. సంతాన చికిత్సలేవైనా తీసుకున్నారా? మామూలుగానే గర్భం వచ్చిందా? అని అడిగాను. చాలాకాలంగా పిల్లలు కలగలేదని, పిల్లలు పుట్టకపోతే భర్త వదిలేస్తానని అన్నాడని, చికిత్సలు తీసుకుంటే గర్భం వచ్చిందని చెప్పింది. ఆమె దీన స్థితికి చలించాను. ఆపరేషన్‌ కోసం కోత పెట్టి చూస్తే ఎక్టోపిక్‌ పెగ్రెన్సీలా అనిపించలేదు. అనవసరంగా ముట్టుకుంటే గర్భాశయం దెబ్బతినొచ్చని అనిపించింది. భర్తను ఆపరేషన్‌ గదిలోకి పిలిపించి.. నా అనుమానాన్ని వివరించాను. స్కానింగ్‌ నిపుణుడి సలహా తీసుకున్నాక అవసరమైతే నేనే మళ్లీ ఆపరేషన్‌ చేస్తానని, డబ్బుల గురించి కంగారు పడొద్దని చెప్పా. స్కానింగ్‌లో అరుదైన విషయం బయటపడింది. గర్భాశయం లోపల మధ్యలో ఒక పొర అడ్డుగా ఉన్నట్టు (సెప్టేట్‌ యూటెరస్‌) తేలింది. సాధారణంగా పిండం ఎదుగుతున్నప్పుడు ఆడపిల్లల్లో గర్భసంచి రెండు సగాలుగా ఏర్పడి, ఒక దగ్గరకు వచ్చి అతుక్కుపోతుంది. తర్వాత మధ్యలోని పొర కరిగిపోతుంది. అరుదుగా కొందరికిది అలాగే ఉండిపోవచ్చు. దీంతో గర్భం ధరించినా పిండం ఒక వైపుననే ఉండిపోయి, ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ మాదిరిగా కనిపించొచ్చు. ఆమె విషయంలోనూ స్కానింగ్‌ చేసినవారు ఇలాగే పొరపడ్డారు. అదే విషయం భర్తకు చెప్పాను. అయితే పిండంలో ఎలాంటి కదలికలు లేకపోవటం వల్ల అబార్షన్‌ చేయాల్సి ఉంటుందని వివరించాను. మందులు ఇచ్చాను. పిండం పడిపోయింది. తర్వాత మళ్లీ వచ్చారు. అన్ని పరీక్షలు చేయించాను. భర్తకూ కౌన్సెలింగ్‌ చేశాను. పిల్లలు పుట్టకపోతే వదిలేయటమేంటి? నీలో ఏదైనా లోపముంటే ఆమె నిన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటుందా? అని నచ్చజెప్పాను. తను కూడా అర్థం చేసుకున్నాడు. తిరిగి గర్భం ధరించటానికి చికిత్సలు ఆరంభించాను. ఆమెకు అప్పుడే అనవసరంగా ఆపరేషన్‌ చేసి ఉంటే గర్భసంచి దెబ్బతిని ఉండేది. గర్భం ధరించే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయేవి. గర్భం ధరించినా గర్భసంచి పగిలిపోయే ప్రమాదముండేది. ఆమె గుర్తుకొచ్చినప్పుడల్లా సరైన నిర్ణయం తీసుకున్నాననే తృప్తి కలుగుతుంది.
* తెలుసుకోవాల్సింది: చికిత్స ఎప్పుడు చేయటమనేదే కాదు, ఎప్పుడు చేయకూడదో కూడా తెలియాలి. అవసరమైనప్పుడు సరైన చికిత్స అందకపోవటం ఎంత ప్రమాదమో.. అనవసరంగా చికిత్స చేయటమూ అంతే ప్రమాదం.


మొన్నే చనిపోయా అంది!

విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న రోజులవి. అప్పుడప్పుడు బందరు వెళ్తుండేవాడిని. అక్కడ ఒకరోజు తెలిసిన రిక్షా అతను భార్యను వెంటబెట్టుకొచ్చాడు. ఏమిటీ సమస్యని ఆమెను అడిగా. ‘మొన్న రాత్రి చనిపోయాను’ అంది. హాయిగా నడుచుకుంటూ వచ్చింది, మాట్లాడుతోంది, చనిపోవటమేమిటి? ఆశ్చర్యం వేసింది. నాడీ, రక్తపోటు, గుండె, ఊపిరితిత్తులు అన్నీ బాగానే ఉన్నాయి. ఏదో పీడకల వచ్చి ఉంటుందనుకున్నా. భర్తను అడిగితే.. ‘మొన్న రాత్రి నన్ను నిద్ర లేపి చనిపోయానని చెప్పింది. నిద్రలో ఉన్నానేమో పడుకోమని గద్దించాను’ అని చెప్పాడు. ఏమీ అర్థం కాలేదు. మానసిక సమస్యల లక్షణాలేవీ కనిపించలేదు. అప్పటికి ఓ టానిక్‌, విటమిన్‌ మాత్రలు, నిద్ర మాత్రలు ఇచ్చి వారం తర్వాత రమ్మన్నాను. పరిస్థితి ఏమీ మారలేదు. మళ్లీ వచ్చినప్పుడు ఎలా ఉందని అడిగితే ‘నిన్న రాత్రి చనిపోయాను’ అంది. ఇదేం సమస్య? చిత్రంగా ఉందే అనుకుంటూ.. ఈసీజీ తీశాను. రక్త పరీక్షలు చేయించాను. ఎక్స్‌రే తీయించాను. ఎలాంటి తేడాలు కనిపించలేదు. ఒకసారి విజయవాడకు రమ్మని చెప్పాను. నా పూర్వ విద్యార్థి అయిన కార్డియాలజిస్ట్‌కు చూపించాను. ఆయన అంతా బాగుందనే చెప్పారు. ఎందుకైనా మంచిదని ఎకో పరీక్ష చేద్దామన్నారు. అందులో వెంట్రిక్యులార్‌ మిక్సోమా అనే అరుదైన సమస్య ఉన్నట్టు బయటపడింది. ఆమె గుండెలో ఒక భాగం నుంచి తాడుతో కట్టినట్టుగా ఉన్న దళసరి పొర ఒకటి గుండె కొట్టుకుంటున్నప్పుడు గాలిపటంలా పైకి లేచి, బృహద్ధమనికి మొదట్లో ఉండే కవాటం (అయోర్టిక్‌ వాల్వ్‌) వరకూ వెళ్లి వెనక్కి వచ్చేస్తోంది. అది 10-15 సెకండ్ల పాటు కవాటాన్ని మూసేస్తే ఆమె చనిపోవటం ఖాయం. ఇలా ఏ క్షణంలోనైనా జరగొచ్చు. సమస్యే పూర్తిగా అవగతమైంది. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆ పొర కవాటాన్ని ఒక్క క్షణం అడ్డుకొని, వెంటనే వెనక్కి వచ్చేస్తోంది. అప్పుడు మెదడుకు ఆక్సిజన్‌ అందక క్షణం పాటు పూర్తిగా తెలివి తప్పుతోంది. దీన్నే ఆమె చనిపోయానని అనుకుంటున్నట్టు అర్థమైంది. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న మిత్రుడికి ఫోన్‌ చేశాను. ఆయన కార్డియాక్‌ సర్జన్‌. తమ ఆసుపత్రిలో ఏవో మరమ్మతు పనులు చేస్తున్నారని, వెంటనే ఆపరేషన్‌ చేయటం కుదరదన్నారు. ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు రావొచ్చని భావించి అన్ని వివరాలతో ఉత్తరం రాసి, పరీక్ష రిపోర్టులు జతచేసి పుట్టపర్తిలోని సత్యసాయి ఆసుపత్రికి పంపించాను. ఆ సాయంత్రమే ఆమెను చేర్చుకొని, మర్నాడు ఉదయం ఆపరేషన్‌ చేశారు. పది రోజులయ్యాక ఇంటికి పంపించారు. ఒక్క పైసా తీసుకోలేదు. అంతా ఉచితమే. ఆ తర్వాత ఆమె పూర్తిగా కుదురుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్లు కనిపించినప్పుడల్లా చాలా సంతోషం వేస్తుంది. అరుదైన జబ్బును పట్టుకొని, తాత్సారం చేయకుండా చికిత్స కోసం పంపించటం ఇప్పటికీ ఎంతో తృప్తిని కలిగిస్తుంది.
* తెలుసుకోవాల్సింది: చిత్రమైన, భిన్నమైన లక్షణాలు కనిపించినా కొట్టిపారేయటం తగదు. నిశితంగా పరిశీలించి, సమస్యను గుర్తించటం, తగు చికిత్స అందించటం ముఖ్యం.


కరోనా భయపెడుతున్నా..

కరోనా విజృంభణ తర్వాత వైద్య వృత్తి గొప్పతనం మరింత బాగా అర్థమైంది. అన్నింటికీ మించి ధైర్యం, నిస్వార్థ గుణం ప్రాముఖ్యత అవగతమైంది. కరోనా పేరు వింటేనే అంతా బెంబేలెత్తుతున్న సమయంలో, కరోనా సోకినవారిని తాకటానికే జంకుతున్న తరుణంలో కొవిడ్‌ చికిత్స కేంద్రం బాధ్యతలు నిర్వహించటం నిజంగా భాగ్యమే. ఒకవైపు నిరంతర పర్యవేక్షణ, బాధ్యతల ఒత్తిడి.. మరోవైపు అనుకోనిదేదైనా జరిగితే వెల్లువెత్తే విమర్శల మాటెలా ఉన్నా జబ్బు నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిపోతున్నవారి కళ్లలో మెరిసే ఆనందం ఎంతో తృప్తిని కలిగిస్తుంది. కృతజ్ఞతా భావం మానసిక బలాన్ని చేకూరుస్తుంది. ఇంట్లో వాళ్లతో సన్నిహితంగా ఉండలేకపోతున్నాననే బాధను కొంతవరకిది మరిపింపజేస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లినప్పుడు భార్యను, పిల్లలను చూడగానే దుఃఖం పొంగుకొచ్చినంత పనవుతుంది. డాక్టర్లు కూడా మనుషులే. అందరిలాగా మాకూ కరోనా సోకొచ్చు. ఇతరుల కన్నా ముప్పు మరింత ఎక్కువ కూడా. నేను రోజులో ఎక్కువభాగం కరోనా బాధితులతోనే గడుపుతుంటా. రోజుకు మూడు సార్లు అత్యవసర విభాగానికి వెళ్తాను. కనీసం ఐదారు వందల మంది పాజిటివ్‌ రోగులను ముట్టుకుంటా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకొచ్చు కదా.  అందుకే ఇంట్లో ఎవరిని తాకాలన్నా భయమే. ఒకే ఇంట్లో ఉంటున్నా గత నాలుగు నెలలుగా భార్యను, పిల్లలను దూరంగా చూడటమే. దూరం నుంచి మాట్లాడుకోవటమే. ఇంతకుముందు నెలకు ఒకసారైనా అమ్మను చూడటానికి ఊరుకు వెళ్లేవాడిని. కరోనా మొదలయ్యాక ఒక్కసారే వెళ్లాను. అదీ దూరం నుంచే చూసి వచ్చాను. ఇది నా ఒక్కడి పరిస్థితే కాదు. కరోనా చికిత్స చేసే డాక్టర్లు, నర్సులు, వార్డ్‌ బాయ్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది అందరిదీ ఇలాంటి స్థితే. ఎంతోమంది నిస్వార్థంగా, ధైర్యంగా సేవ చేస్తున్నారు. కరోనా నిజమైన మనిషిని, మానవత్వ విలువలను బయట పెట్టింది. నిజమైన సేవకులెవరో ప్రపంచానికి చూపించింది. ఇంత తృప్తిలోనూ కలవరపరచే విషయం కరోనా భయంతో కొందరు మానవత్వాన్ని మరచిపోవటం. జబ్బు నుంచి కోలుకున్నా కూడా పిల్లలకు సోకుతుందనో, మరో కారణంతోనో తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను ఇంటికి తీసుకుపోవటానికి వెనకాడుతుండటం విచారకరం. బాగయ్యాక ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరికీ ఏమీ కాదని చెప్పినా వినిపించుకోవటం లేదు. కొందరు కడసారి చూడటానికైనా రావటం లేదు. మీరే ఏమైనా చేసుకోండి. మాకేం అభ్యంతరం లేదని తెగేసి చెబుతున్నారు. గత నాలుగు నెలల్లో ఇలాంటి 50-60 సందర్భాలు చూశాను. వీరిని చూస్తుంటే మనుషులేనా? అనిపిస్తుంటుంది. ఎలాంటి సంబంధం లేని మేం ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తుంటే.. పేగు బంధం గలవారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? అని బాధ కలుగుతుంది.
* తెలుసుకోవాల్సింది: కరోనాకు భయపడొద్దు. ఇప్పటికే ఎంతోమంది కోలుకున్నారు. జబ్బు నుంచి కోలుకున్నాక ఎవరికీ ఏమీ కాదు. కరోనా ఇప్పుడప్పుడే పోయేదీ కాదు. ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవటం, మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు పాటిస్తే జబ్బే దరిజేరదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని