Updated : 01 Jan 2019 05:02 IST

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

 

 

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

కొత్త సంవత్సరం.. సరికొత్త ఆశలు.. చదువులో రాణించాలి..  ఉద్యోగంలో పైకెదగాలి.. వ్యాపారంలో వృద్ధి చెందాలి.. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకూ.. అందరికీ  కోటి కలలు.. శతకోటి కోరికలు! మరి ఆరోగ్యమో..? ఎన్ని సాధించినా ఆరోగ్యం సరిగా లేకపోతే అన్నీ సున్నానే! ఏ విజయాన్నీ ఆస్వాదించలేం.. ఆనందించలేం.. అనుభవించలేం! అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమనే పెద్దల మాటను మన్నిస్తూ.. ఆ దిశగా కొత్త సంవత్సరం ఆరంభాన తొలి అడుగులు వేద్దాం. ఆరోగ్యానికీ ఒక క్యాలెండర్‌ రూపొందించుకుందాం.  నిజానికి ఆరోగ్య పరిరక్షణకు గొప్ప తీర్మానాలేం అవసరం లేదు.. చిన్న జాగ్రత్తలతోనే పెద్ద ఫలితాలు సాధించొచ్చు!

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!జబ్బులు ఊరికే రావు. అన్నీ మన కష్టార్జితాలే! అదేంటి.. జబ్బులు రావాలని ఎవరు కోరుకుంటారు? వాటి కోసం ఎవరు కష్టపడతారని అనుకుంటున్నారా? అయితే రోజూ ఏమేం చేస్తున్నారో ఒకసారి తలచుకోండి. మనకు నిత్య వ్యాయామం, శారీరక శ్రమ అవసరమని తెలుసు. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలని తెలుసు. మాంసం, కొవ్వులు తగ్గించుకోవాలని తెలుసు. ఒత్తిళ్ల బారినపడకుండా చూసుకోవాలని తెలుసు. అయినా ఎంతవరకు  పాటిస్తున్నాం? ఎంతవరకు ఆచరిస్తున్నాం? పాత అనుభవాలను, పాత రోజులను విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి అడుగిడుతున్న తరుణంలో మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఒకప్పటితో పోలిస్తే- మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ల వంటి సాంక్రమికేతర జబ్బులే ఆధునిక ప్రపంచానికి పెద్ద ముప్పులుగా పరిణమిస్తున్నాయని.. వీటి మూలంగానే ఇప్పుడు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ దగ్గర్నుంచి.. ఎందరెందరో శాస్త్రవేత్తలు, పరిశోధకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇది తక్షణావసరం కూడా. కొన్ని జబ్బులకు జన్యువులే దోహదం చేస్తుండొచ్చు. కానీ వాటికి చుట్టుపక్కల పరిసరాలు, వాతావరణం, మన ఆహార విహార అలవాట్ల వంటివన్నీ తోడైనప్పుడే అవి వ్యక్తమై.. జబ్బులను తెచ్చిపెడతాయి. కాబట్టి రోజూ ఆచరించదగిన చిన్న చిన్న మార్పులతోనే మహా జబ్బుల మూలాలను మట్టుపెడదాం.

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

నీటితో ఆరంభం

ఉదయం నిద్ర లేవగానే నోరు పుక్కిళించి.. ఒకట్రెండు గ్లాసుల నీళ్లు తాగటం మొదలెట్టండి. రాత్రంతా నిద్రలో మునిగిన శరీరంలో తగ్గిపోయిన నీటిశాతాన్ని ఇది భర్తీ చేస్తుంది. దీంతో వెంటనే శక్తి పుంజుకుంటుంది. మెదడు చురుకుదనం పెరుగుతుంది. మూడ్‌ మెరుగవుతుంది. ఈ ఉత్సాహం రోజంతా కొనసాగుతూ వస్తుంది కూడా. ఒంట్లో ద్రవాల మోతాదులు తగినంతగా ఉంటే విషతుల్యాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. జీర్ణక్రియ సరిగా సాగుతుంది. మలబద్ధకం దరిజేరదు. జీవక్రియలూ ఉత్తేజితమవుతాయి. కాబట్టి నిద్రలేస్తూనే కాఫీ, టీ కప్పులకు బదులు నీటి గ్లాసును అందుకోండి.

దంతం.. ధావనం.. శుభ్రం

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

రోజూ పళ్లు తోముకుంటాం. ఇందులో చెప్పుకోవటానికేముంది? చాలానే ఉంది. పళ్లు సరిగా శుభ్రం చేసుకోకపోతే చిగుళ్లవాపు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇది నోటికే పరిమితం కాదు. మధుమేహం, గుండెజబ్బుల వంటి సమస్యలకూ చిగుళ్లవ్యాధికీ సంబంధం ఉంటోందని అధ్యయనాలు నిగ్గుతేల్చాయి. చిగుళ్లవాపుతో మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టూ బయటపడింది. నోటిలోని బ్యాక్టీరియా రక్తం ద్వారా రొమ్ముకణజాలానికి చేరుకొని, కణితులు పుట్టుకురావటానికి దోహదం చేస్తుండటం గమనార్హం. కాబట్టి ఉదయమే కాదు, రాత్రి పడుకోబోయే ముందూ దంతాలను శుభ్రం చేసుకోవటం మరవరాదు.

అల్పాహారం అతిముఖ్యం

ఉదయంపూట తినే అల్పాహారంతో అవయవాలన్నీ కొత్త శక్తిని పుంజుకుంటాయి. రోజంతా కేలరీలు ఖర్చు కావటానికి మార్గం పడుతుంది కూడా. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగటానికీ.. చెడ్డ కొలెస్ట్రాల్‌ తగ్గటానికీ అల్పాహారం తోడ్పడుతుంది. మధుమేహంతో బాధపడేవారు కాస్త దండిగానే అల్పాహారం తీసుకోవటం మంచిది. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులతో పాటు రక్తపోటు కూడా తగ్గుముఖం పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే అల్పాహారం తీసుకుంటే ఆకలిని ప్రేరేపించే ఘ్రెలిన్‌ హార్మోన్‌ విడుదల తగ్గి.. ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూసుకోవచ్చు. దీంతో బరువు కూడా అదుపులో ఉంటుందన్నమాట.

ప్రతిక్షణమూ ‘పండు’గే 

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

పండ్ల కోసం ప్రత్యేకించిన గిన్నెను ఇంట్లో అందరికీ కనిపించే చోట పెట్టండి. ఇలా పండ్లు అందుబాటులో ఉండేలా చూసుకుంటే మరచిపోయే ప్రసక్తే ఉండదు. పండ్లలోని విటమిన్లు, పోషకాలు.. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఎన్నెన్నో జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.

సత్సంబంధం సగం బలం

తరచుగా తోబుట్టువుల, స్నేహితుల ఇంటికి వెళ్లండి. ఆనందం, ఆయుష్షు రహస్యం ఇదేనని చెబుతున్నారు పరిశోధకులు. బంధువులతో, స్నేహితులతో మంచి సంబంధాలు గలవారు మరింత ఆనందంగా, ఎక్కువకాలం జీవిస్తున్నట్టు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. మనకేదైనా ఆపద వచ్చినపుడు ఆదుకోవటానికి ఎవరో ఒకరు అండగా ఉన్నారన్న భరోసానే కొండంత బలాన్నిస్తుంది. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంగా, చురుకుగా ఉండటానికి తోడ్పడుతుంది. చెడు అలవాట్లు దరిజేరవు. శారీరక బాధలూ తగ్గుముఖం పడతాయి. ఇవన్నీ ఆనందాన్ని, ఆయుష్షును పెంచేవే కదా.

నవ్వు నాలుగిందాల మేలు

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

నవ్వినపుడు ఎండార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో మనసు తేలికపడి బాధలు, చింతలు మటుమాయం అవుతాయి. హాస్య వీడియోలు చూడటం ద్వారా ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతున్నట్టు, ఇది క్లిష్టమైన పనులనైనా సునాయాసంగా చేయటానికి తోడ్పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

సంగీతాస్వాదనలో..

సమయం దొరికినప్పుడల్లా శ్రావ్యమైన సంగీతం వినండి. ఇది మనసుకు హాయినిస్తుంది. కొత్త హుషారును అందిస్తుంది. హడావుడి, గందరగోళం లేని సంగీతం వింటే అధిక రక్తపోటు తగ్గుతున్నట్టు, గుండె వేగం స్థిరపడుతున్నట్టు, ఆందోళన తగ్గుముఖం పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సంగీతం మూలంగా జ్ఞాపకశక్తి, గుండె పనితీరు మెరుగవుతాయి. అంతగా అలసట అనిపించకపోవటం వల్ల శారీరక సామర్థ్యమూ పెంపొందుతుంది. దీంతో క్లిష్టమైన పనులైనా అలవోకగా చేయటానికి వీలవుతుంది. కాబట్టి రోజూ వీనుల విందైన సంగీతం వినటానికి ప్రయత్నించండి.

సేవారోగ్యం

ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే లభించే తృప్తే వేరు. ఇలాంటి దయాగుణం, సేవా దృక్పథం మానసికంగానే కాదు.. శారీరకంగానూ ఎంతో మేలు చేస్తుంది. స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశం తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వీలు కుదిరినప్పుడల్లా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనండి. అలాగని ఖర్చయ్యే పనులే చేయాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఎవరైనా వృద్ధులు, వికలాంగుల వంటి వాళ్లు చేసుకోలేని పనుల్లో సాయపడినా చాలు. ఇంటి పక్కల వీధులు శుభ్రం చేసినా మేలే. ఇలాంటివి చిన్న చిన్న పనులైనా పెద్ద ప్రభావమే చూపుతాయి.

మెట్టుమెట్టుకో కేలరీ..

మోకాళ్ల నొప్పుల వంటి సమస్యలేవీ లేకపోతే లిఫ్ట్‌కు బదులు కాళ్లకు పని చెప్పండి. మెట్లు ఎక్కటం మొదలెట్టండి. దీంతో విద్యుత్తు ఆదా అవటమే కాకుండా వ్యాయామమూ చేసినట్టు అవుతుంది. కేలరీలు కూడా ఎక్కువగానే ఖర్చవుతాయి. ఒక నిమిషం పాటు మెట్లు ఎక్కినా 10 కేలరీలు ఖర్చవుతాయి. అంటే ఐదేసి నిమిషాల సేపు రోజుకు రెండు సార్లు మెట్లు ఎక్కితే 100 కేలరీలు ఖర్చవుతాయన్నమాట. మన శరీరంలో అతి పెద్దవైన కాళ్ల కండరాలు మంచి బలం పుంజుకుంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి సమస్యలు దరిజేరకుండానూ చూసుకోవచ్చు.

‘పుస్తక’ నిద్ర

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

రాత్రి పడుకోబోయే ముందు మొబైల్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీల వంటివి కట్టిపెట్టి మంచి పుస్తకం ముందేసుకోండి. ఇది మెదడు ఆరోగ్యానికే కాదు, కంటి నిండా నిద్ర పట్టటానికీ దోహదం చేస్తుంది. ఈ-బుక్‌ వంటి డిజిటల్‌ పుస్తకాలకు బదులు మామూలు పుస్తకాలు చదివినవారు త్వరగా నిద్రలోకి జారుకోవటమే కాదు, మరింత గాఢంగానూ నిద్రపోతుండటం విశేషం. సెల్‌ఫోన్ల వంటి డిజిటల్‌ పరికరాల నుంచి వెలువడే నీలం కాంతి మెదడు పనితీరుపై విపరీత ప్రభావం చూపుతుందని, ఇది నిద్ర తీరుతెన్నులను దెబ్బతీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

జ్ఞాపకాల ‘రాత’

ఇప్పుడెవర్ని చూసినా కీబోర్డు నొక్కుతూ టైప్‌ చేయటమే. ఉత్తరాల కన్నా ఈ-మెయిళ్లే ముఖ్యమైపోయాయి. అయితే ఇలా టైప్‌ చేయటం కన్నా చేత్తో రాసినప్పుడే మెదడులోని చాలా భాగాలు అనుసంధానం  అవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే చేతిరాతతో మెదడూ పదునెక్కుతోందన్నమాట. ఇందుకు కొత్త హాబీల వంటివీ ఎంతగానో ఉపయోగపడతాయి. అవే పనులను మళ్లీ మళ్లీ చేస్తుంటే మెదడు వాటికి అలవాటు పడిపోతుంది. అదే కొత్త పనులైతే చురుకుగా స్పందిస్తుంది.

యోగానందం

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

శారీరక సామర్థ్యం మెరుగుపడటానికే కాదు, కొన్ని సమస్యలు తగ్గటానికీ యోగా తోడ్పడుతుంది. యోగా సాధనతో వేగస్‌ నాడి బలోపేతం అవుతుంది. ఒంట్లో వాపు ప్రక్రియ, అధిక రక్తపోటు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, రోగనిరోధకశక్తి మెరుగవుతాయి. ఒత్తిడి నుంచీ ఉపశమనం లభిస్తుంది.

ఇంటి తిండి ఆయుష్షు

బయటి తిండి తినేవారితో పోలిస్తే ఇంట్లో వండుకున్న ఆహారం తినేవారిలో 50% మంది పదేళ్లు ఎక్కువగా జీవిస్తున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. బయటి తిండిలో నూనెలు, కొవ్వులు, ఉప్పు, చక్కెర ఎక్కువ. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బుల్లో వీటి పాత్రే ఎక్కువ కావటం గమనార్హం. ఇంట్లో వండుకోవటం వల్ల లభించే మరో ప్రయోజనం మెదడు పనితీరు మెరుగుపడటం. వంట ఎలా వండాలి? ఏమేం దినుసులు కావాలి? ఎంత మోతాదులో వాడాలి? అనేవి గుర్తుపెట్టుకోవటానికి మెదడు నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. దీంతో మెదడులో అనుసంధానాలూ మెరుగవుతాయి.

చేతులు శుభ్రం!

వంట వండటానికి, భోజనం చేయటానికి ముందు శుభ్రంగా చేతులు కడుక్కుంటే కలుషితాహార జబ్బులను సగం వరకు నివారించుకున్నట్టే. అలాగే బయటకు ఎక్కడికైనా వెళ్లివచ్చినపుడు, జలుబు వంటి జబ్బులతో బాధపడుతున్నప్పుడు తరచుగా చేతులు కడుక్కోవటం మంచిది. మనం సగటున ప్రతి అరగంటకు 300 రకాల వస్తువులను తాకుతామని అంచనా. ఇలా 8.40 లక్షల సూక్ష్మక్రిములు చేతులకు అంటుకునే అవకాశముంది. కాబట్టి తరచుగా చేతులను కడుక్కుంటే సూక్ష్మక్రిములతో వ్యాపించే జబ్బులను ఎన్నెన్నో నివారించుకోవచ్చు. అవి ఇతరులకు వ్యాపించకుండానూ చూసుకోవచ్చు.

గింజపప్పుల తోడు

అప్పుడప్పుడూ బాదం, జీడిపప్పు వంటి గింజ పలుకులు, పప్పులు (నట్స్‌) కాస్త నోట్లో వేసుకోండి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు సుమారు 30 గ్రాముల గింజపప్పులు తినేవారికి అకాల మరణం ముప్పు గణనీయంగా తగ్గుతోందని న్యూఇంగ్లాండ్‌ వైద్య పత్రికలో ప్రచురితమైన అధ్యయనం చెబుతోంది. బాదం, జీడిపప్పు, అక్రోట్లు, పిస్తా వంటి వాటిల్లో అసంతృప్త కొవ్వులు దండిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌తో పాటు ఒంట్లో వాపు ప్రక్రియనూ తగ్గించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఫలితంగా గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి సమస్యల ముప్పులూ తగ్గుముఖం పడతాయి.

విహార ‘ఉత్సాహం’

వీలున్నప్పుడల్లా విహార యాత్రలకు వెళ్తే రోజువారీ పనుల విసుగు తొలగిపోతుంది. ఉద్యోగాల్లో, పనుల్లో సామర్థ్యం, నైపుణ్యమూ మెరుగవుతాయి. ఏడాదికి రెండు సార్లు విహార యాత్రలకు వెళ్లి వచ్చే పురుషులకు 30%, మహిళలకు 50% గుండెపోటు ముప్పు తగ్గుతున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రకు ఆటంకం కలిగించే అలవాట్లకూ విహార యాత్రలతో ముకుతాడు పడుతుంది. ఇలా నిద్ర బాగా పట్టటానికీ యాత్రలు తోడ్పడతాయన్నమాట.

కూచుంటే పడినట్టే!

గంటలకొద్దీ అదేపనిగా కూచుంటే ట్రైగ్లిజరైడ్ల స్థాయులు పెరిగిపోతాయి. మంచి కొవ్వు తగ్గుతుంది. దీంతో పక్షవాతం, గుండెపోటు ముప్పులూ ముంచుకొస్తాయి. కాబట్టి ఆఫీసులో, ఇంట్లో అదేపనిగా కూలబడకుండా మధ్యమధ్యలో లేచి అటూఇటూ తిరగండి. తరచుగా కాళ్లకు పనిచెబితే మధుమేహం ముప్పు 40%, అధికబరువు ముప్పు 20%, అధిక రక్తపోటు ముప్పు 17% తగ్గుముఖం పడుతున్నట్టు బ్రిటన్‌ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. నడవటం వల్ల కాళ్ల కండరాలే కాదు.. పొట్ట, వీపు కండరాలు కూడా బలోపేతమవుతాయి. దీంతో వెన్నెముకకు మంచి దన్ను లభిస్తుంది. నడుంనొప్పి వంటివీ దూరమవుతాయి.

‘గాలి’ సాంత్వన

ఎప్పుడూ తలుపులు, కిటికీలు బిగించుకోకుండా వీలైనప్పుడు వాటిని తెరచి పెట్టండి. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రానివ్వండి. ఇది ఇంటికి కొత్త వెలుగును తెచ్చిపెడుతుంది. లోపలి గాలి శుభ్రపడుతుంది. ఇలాంటి శుభ్రమైన గాలి శక్తిమంతమైన యాంటీబయోటిక్స్‌ కన్నా మంచి ఫలితాలు ఇస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాజా గాలిలోని ‘హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌’ హానికర సూక్ష్మక్రిముల పని పడుతున్నాయని వివరిస్తున్నారు. అయితే ఈ హైడ్రాక్సిల్‌ ర్యాడికల్స్‌ గాలిలో అట్టే సేపు ఉండవు. అందువల్ల ఎప్పటికప్పుడు తాజా గాలి వీచేలా.. కిటికీలు తెరచి ఉంంచుకోవటం మంచిది.

ఉపవాస ‘వ్రతం’

కుదిరినప్పుడల్లా ఒక పూట కడుపు మాడ్చండి. ఇలా అప్పుడప్పుడు ఉపవాసం చేయటం మంచిదేనని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఇది బరువు పెరగకుండా చూడటంతో పాటు ఇన్సులిన్‌ నిరోధకత, మధుమేహం ముప్పులనూ తగ్గిస్తోందని వివరిస్తున్నారు. అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగం, కొలెస్ట్రాల్‌ మోతాదులూ తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ఫలితంగా గుండెజబ్బు, పక్షవాతం వంటి సమస్యల బారినపడకుండానూ కాపాడుతుందన్నమాట. ఉపవాసం మూలంగా ఆయుర్దాయమూ పెరుగుతుంది. నాడీ సమస్యలు.. ముఖ్యంగా అల్జీమర్స్‌, పార్కిన్సన్స్‌ వంటి జబ్బులు దరిజేరకుండానూ చూసుకోవచ్చు.

వ్యాయామ ‘శృంగారం’

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

వ్యాయామంతో శృంగార సామర్థ్యమూ పుంజుకుంటుంది. లైంగికాసక్తి పెరగటంతో పాటు పటుత్వమూ మెరుగవుతుంది. శారీరక శ్రమ చేయనివారితో పోలిస్తే- రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేసే పురుషుల్లో అంగస్తంభన సమస్యలు తక్కువని పరిశోధకులు గుర్తించారు.

ఎండ ‘బంగారం’

ఒంటికి రోజూ కాసేపు ఎండ ‘బంగారం’ తగిలేలా చూసుకోండి. దీంతో ఎలాంటి ఖర్చు లేకుండా విటమిన్‌ డిని పొందొచ్చు. సూర్యరశ్మి సమక్షంలోనే మన చర్మం విటమిన్‌ డిని తయారుచేసుకుంటుంది మరి. ఇది ఎముకల ఆరోగ్యానికే కాదు.. రోగనిరోధకశక్తి బలోపేతం కావటానికీ, శరీర కణాలు ఇన్సులిన్‌ను గ్రహించేలా చూడటానికీ తోడ్పడుతుంది. కణ విభజన ప్రక్రియనూ నియంత్రించటం ద్వారా క్యాన్సర్ల ముప్పులు తగ్గేలా చేస్తుంది. ఒళ్లునొప్పులు, నిస్త్రాణ వంటివి మటుమాయం అవుతాయి.

‘ఇనుము’ వంట

వీలైనప్పుడల్లా ఇనుప పాత్రల్లో వంట చేసుకోండి. ఇలా ఒంటికి తగినంత ఐరన్‌ అందేలా చూసుకోవచ్చని కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.

హుషారు ధ్యానం

తొలి అడుగు మంచిదైతే.. ఆ ఆరోగ్యమే వేరప్పా!

ధ్యానంతో మనోస్థితి (మూడ్‌) మెరుగవుతుంది. కొత్త ఉత్సాహం, హుషారు చేకూరుతాయి. కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యల ముప్పూ తగ్గుతున్నట్టు పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. కుదురుగా ఒకచోట కూచొని, కళ్లు మూసుకొని ఏదో ఒక విషయం మీద మనసును కేంద్రీకరిస్తే చాలు.

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు