పసి ‘ఊపిరి’కి సంకెళ్లు!
అంత తరచుగా కనబడకపోవచ్చు. అయినా అసాధారణ సమస్యేలేం కావు. దాడి చేశాయంటే తీవ్రంగానూ వేధిస్తాయి. కొన్నిసార్లు అత్యవసర శస్త్రచికిత్సకూ దారితీయొచ్చు. ఛాతీలో చీము గూడు కట్టటం సరిగ్గా ఇలాంటి సమస్యే. చిన్నగా న్యుమోనియాతో మొదలై.. క్రమంగా ఊపిరితిత్తులను దాటుకొని... చివరికి ఊపిరితిత్తులను సంకెళ్లతో కట్టిపడేసినంత పనిచేస్తుంది. పెద్దల కన్నా చిన్నారులకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టే ఇది చలికాలంలోనే కాదు, వేసవి ఆరంభంలోనూ ఎక్కువే. ఈ నేపథ్యంలో ఛాతీలో చీము గూడు కట్టటంపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.
* రాకేశ్‌కు ఐదేళ్లు. ఒకరోజు జ్వరం వచ్చింది. జలుబు, దగ్గుతోనూ బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు దగ్గర్లోని డాక్టర్ సలహాతో మందులు ఆరంభించారు. అయినా తగ్గలేదు. మూడు రోజుల్లోనే సమస్య ఎక్కువైంది. అప్పుడప్పుడూ జ్వరం తీవ్రత పెరగటం, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటే పిల్లల డాక్టర్‌కు చూపించారు. బాబుకు న్యుమోనియా వచ్చిందని, ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించాలని సూచించారు. మూడు రోజుల తర్వాత పిల్లాడికి ఛాతీలో చీము ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి చీమును తొలగించారు. ఆ తర్వాత గానీ రాకేశ్ ఆరోగ్యం కుదుటపడలేదు.
చిన్నపాటి జ్వరం, జలుబు, దగ్గు.. పెద్ద శస్త్రచికిత్సకు దారితీస్తుందంటే ఎవరికైనా ఆందోళన కలగక మానదు. పిల్లల ఛాతీకి శస్త్రచికిత్స చేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న కలవరమూ పుడుతుంది. ఛాతీలో చీము గూడు కట్టుకోవటంపై (ఎంపైమా థొరాసిక్) అవగాహన లేకపోవటమే దీనికి కారణం. మనదేశంలో ఐదేళ్ల లోపు పిల్లలకు వచ్చే జబ్బుల్లో దాదాపు సగం వరకూ శ్వాసకోశ సమస్యలే. 5-12 ఏళ్ల వయసు పిల్లల్లో వచ్చే సమస్యల్లో 30% ఇలాంటివే. వీరిలో.. ముఖ్యంగా న్యుమోనియా బారినపడుతున్నవారిలో సుమారు 5% మంది ఎంపైమాలోకి అడుగుపెడుతుండటం గమనార్హం. సాధారణంగా చల్లటి వాతావరణంలో లేదా వేసవి ఆరంభంలో న్యుమోనియా ఎక్కువ. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలను ఇది మరింత తీవ్రంగానూ వేధిస్తుంది. కొన్నిసార్లు ఎన్ని మందులు ఇచ్చినా తగ్గదు. దీంతో ఇన్‌ఫెక్షన్ ఊపిరితిత్తుల పొరలను దాటుకొని, చుట్టూ ఉండే పొరల్లోకి చేరుకోవటం.. క్రమంగా చీముగా మారి గట్టిపడి తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో దీని బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. వాతావరణంలో ఏడాది పొడవునా మార్పులు తలెత్తుతుండటం, బ్యాక్టీరియా రకాలు మారిపోతుండటం.. పోషణ లోపం వంటివన్నీ ఇందుకు దారితీస్తున్నాయి.
న్యుమోనియాతో ఆరంభం.. |
నిర్ధరణ ఎలా? మందులు ఇస్తున్నా దగ్గు, ఆయాసం వంటివి తగ్గకుండా వేధిస్తుంటే ఊపిరితిత్తుల పొరల్లో చీము గూడు కట్టిందేమోనని అనుమానించటం తప్పనిసరి. దీన్ని నిర్ధరించటానికి కొన్ని పరీక్షలు అవసరపడతాయి. * సీటీ స్కాన్: అవసరమైతే కొన్నిసార్లు సీటీ స్కాన్ పరీక్ష కూడా చేయాల్సి వస్తుంది. ఇందులో మెత్తటి చీము గూడు గుండ్రంగా, దీర్ఘవృత్తాకారంలో కనబడుతుంది. మందంగా తయారైన పొరల మధ్య చీము చిక్కుకోవటం వంటివి బయటపడతాయి. వీటి మూలంగా సమస్య ఏ దశలో ఉన్నదీ, పొరల మందం కచ్చితంగా తెలుస్తుంది. |
సమస్యలు.. చిక్కులు ఊపిరితిత్తుల పొరల్లో చీము గూడు కట్టటానికి చికిత్స చేయకపోతే తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తుంది. చిన్న పిల్లల్లో ఇన్‌ఫెక్షన్ రక్తంలోకీ చేరుకోవచ్చు (సెప్టిసీమియా). ఇది ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. కాస్త పెద్ద పిల్లల్లోనైతే ఊపిరితిత్తుల మీద మందమైన పొర ఏర్పడటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మందగించొచ్చు. ఊపిరితిత్తిలో కణజాలం గట్టిపడి కొంత భాగం చచ్చుబడిపోవచ్చు. ఫలితంగా ఛాతీ ఆకారం కూడా మారుతుంది. ఇది పిల్లల్లో.. ముఖ్యంగా ఆడపిల్లల్లో ఆత్మన్యూనతకు దారితీయొచ్చు. కొందరికి ఊపిరితిత్తుల్లోని శ్వాస మార్గాలు దెబ్బతిని వాటిల్లోంచి గాలి బయటకు వస్తుండొచ్చు. సమస్య మరీ తీవ్రమైతే చీము చిన్న దారి చేసుకొని ఛాతీ కుహరంలోకి కూడా రావొచ్చు. కాకపోతే ఇది చాలా అరుదు. |
లక్షణాలు ఇవీ.. ఊపిరితిత్తుల పొరల్లో చీము గూడు కటుకున్నవారిలో చలి, జ్వరం, ఛాతీ నొప్పి, రాత్రిపూట చెమట్లు, దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, అస్థిమితం, కళ్లె ఎక్కువగా రావటం వంటి లక్షణాలు కనబడతాయి. స్టెతస్కోప్‌తో పరిశీలిస్తే శ్వాస తీసుకునే చప్పుడు తగ్గినట్టు కనబడుతుంది. ఎక్స్‌రేలో ఇన్‌ఫెక్షన్ తలెత్తిన భాగం చీలిపోయినట్టు కనబడుతుంది. |
మూడు దశలుగా... కచ్చితంగా వర్గీకరించలేకపోయినా తీవ్రతను బట్టి ఎంపైమా మూడు దశలుగా కనబడుతుంది. సమస్య ముదురుతున్నకొద్దీ ఒక దశ మరో దశలో కలిసిపోతుంటుంది కూడా.* 1-3 రోజులు: దీన్ని ద్రవ (ఎక్స్యుడేటివ్) దశ అంటారు. ఇందులో ఉబ్బిపోయిన ఊపిరితిత్తుల పొరల నుంచి ద్రవం బయటకు వస్తుంటుంది. ద్రవం పలుచగా ఉంటుంది. దీన్ని చాలాసార్లు మామూలు న్యుమోనియా అనీ పొరపడుతుంటారు. ద్రవం పోగుపడటం పెరుగుతున్నకొద్దీ ఆయాసం, దగ్గు వంటి లక్షణాలూ తీవ్రమవుతుంటాయి. ఈ దశలో మామూలు ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ పరీక్షతో సమస్యను నిర్ధరించొచ్చు. అవసరమైతే అల్ట్రాసౌండ్ సాయంతో సూది ద్వారా ద్రవాన్ని బయటకు తీసి పరీక్షిస్తారు. * 4-14 రోజులు: దీన్ని చీము (ఫైబ్రినో-ప్యురులెంట్) దశ అంటారు. ఈ సమయంలో ద్రవంలో తెల్లరక్తకణాలు, రక్తం గడ్డ కట్టటానికి తోడ్పడే ఫ్రైబిన్ ప్రోటీన్ పెద్దసంఖ్యలో ఉంటాయి. ద్రవం కూడా పెద్దమొత్తంలో పోగుపడుతుంది. చీము గట్టిపడి గదులు గదులుగా ఏర్పడటం, ఊపిరితిత్తుల మీద మందపాటి పొర ఏర్పడే స్వభావమూ ఎక్కువగానే ఉంటుంది. * 14 రోజుల తర్వాత: ఇందులో చీము బాగా గట్టిపడి పెరుగు తరకలా తయారవుతుంది (ఆర్గనైజింగ్). పొరల మధ్య కణజాలం గట్టిపడి.. మందమైన పొర ఏర్పడొచ్చు. దీంతో ఊపిరితిత్తులు వ్యాకోచించటం కష్టమవుతుంది. |
ముందు నుంచే నివారణ * జలుబు, ఫ్లూతో బాధపడేవారి దగ్గరకు పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలి. * పిల్లలకు మంచి సమతులాహారం ఇవ్వటం అత్యవసరం. దీంతో పిల్లల్లో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది త్వరగా జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. |
చికిత్స ఇన్‌ఫెక్షన్‌ను కట్టడి చేయటం, చీమును బయటకు తీయటం, ఊపిరితిత్తులు వ్యాకోచించేలా చేయటం ప్రధానం.* యాంటీబయోటిక్స్: చీము గూడు కట్టినట్టు అనుమానించిన వెంటనే యాంటీబయోటిక్ మందులు ఆరంభించటం తప్పనిసరి. అవసరమైతే కల్చర్ పరీక్ష అనంతరం మందులు మార్చుకోవచ్చు. కొందరు పిల్లల్లో క్షయతోనూ ఇది ముడిపడి ఉండొచ్చు. అప్పుడు యాంటీబయోటిక్ మందులతో పాటు క్షయ మందులు, కార్టికోస్టిరాయిడ్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. * చీము తొలగించటం: ఊపిరితిత్తుల వెలుపల తలెత్తిన చీము దగ్గటం వంటి వాటితో పోయేది కాదు. దీన్ని బయటకు తీయటం ఒక్కటే మార్గం. చీము పలుచగా ఉంటే తరచుగా సూదితో గానీ సన్నటి గొట్టంతో గానీ తొలగిస్తారు. అవసరమైతే థోరాకోస్కోపీ సాయంతో వీడియోలో చూస్తూ గొట్టాన్ని ఊపిరితిత్తుల పొరల్లోకి ప్రవేశపెడతారు. చీము కాస్త గట్టిగా ఉన్నా అటూఇటూ తేలికగా కదులుతుంటే ఛాతీలోకి గొట్టాన్ని పంపించి కొద్దిరోజుల పాటు అలాగే ఉంచుతారు. బయటకు వచ్చే ద్రవం మోతాదు రోజుకు 30-50 ఎం.ఎల్. కన్నా తక్కువకు చేరుకునేంతవరకూ, ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో వ్యాకోచించేంతవరకూ గొట్టాన్ని అలాగే ఉంచుతారు. * శస్త్రచికిత్స: చీము గట్టిపడి.. గదులు గదులుగా ఏర్పడితే గొట్టంతోనూ ఉపయోగం ఉండదు. అందువల్ల థొరకోస్కోపీ చేసి లోపలి చీము గదుల గోడలను పూర్తిగా విచ్ఛిన్నం చేసి.. తర్వాత గొట్టాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇక చీము బాగా గట్టిపడితే థొరకోస్కోపీ కూడా పనిచేయదు. శస్త్రచికిత్స ద్వారా ఛాతీని తెరచి చీము మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఇన్‌ఫెక్షన్ మరీ తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో ఒక భాగం మొత్తం దెబ్బతినే (నెక్రోటైజింగ్ న్యుమోనియా) ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేసేటప్పుడు దెబ్బతిన్న ఊపిరితిత్తి భాగాన్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. |
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్