కరోనా ‘మధు’శాపం!

కరోనా ఇన్‌ఫెక్షన్‌ వృద్ధులకు అదీ మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు గలవారికి మరింత ప్రాణాంతకంగా పరిణమిస్తుండటం విషాదకరం. దీనికి కారణమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published : 24 Mar 2020 01:16 IST

కరోనా ఇన్‌ఫెక్షన్‌ వృద్ధులకు అదీ మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు గలవారికి మరింత ప్రాణాంతకంగా పరిణమిస్తుండటం విషాదకరం. దీనికి కారణమేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు?

రోనా ఇన్‌ఫెక్షన్‌ (కొవిడ్‌-19) మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, దీర్ఘకాల శ్వాసకోశ సమస్యలు గలవారికి పెను శాపంగా మారుతోంది. ఇప్పటివరకు మరణించినవారిలో 16-22% మంది మధుమేహులే. మనదేశంలోనూ కరోనాతో మరణించినవారిలో మధుమేహుల సంఖ్యే ఎక్కువ. మరో ముఖ్య విషయం- మధుమేహం గలవారికి వయసుతో సంబంధం లేకుండా కరోనా ప్రమాదంగా మారే అవకాశముండటం. మనదేశంలో 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని అంచనా. ఈ నేపథ్యంలో కరోనా ఇన్‌ఫెక్షన్‌ మనదగ్గర ఎక్కువగా ప్రబలే అవకాశముందనే ఆందోళన పెరుగుతోంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా మంచిది.

రోగనిరోధకశక్తి తగ్గటంతోనే..

వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌ వంటివి ఒంట్లోకి ప్రవేశించాయని గుర్తించగానే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్తకణాలు, యాంటీబాడీలు చుట్టూ చేరిపోతాయి. వాటిని ఒంట్లోంచి బయటకు పంపించటానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో తుమ్ములు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు బయలుదేరతాయి. ఒకరకంగా ఇవన్నీ క్రిముల నుంచి శరీరాన్ని కాపాడే ప్రయత్నాలే. ఇలాంటి రక్షణ వ్యవస్థలన్నీ మధుమేహుల్లో మందగిస్తుండటమే ప్రమాదం ఎక్కువ కావటానికి దారితీస్తోంది. రక్తంలో గ్లూకోజు మోతాదులు ఎక్కువగా ఉంటున్నా, దీర్ఘకాలం నుంచి బాధపడుతూ గ్లూకోజు స్థాయులు మామూలుగానే ఉన్నా వీరిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పొచ్ఛు ముఖ్యంగా తెల్ల రక్తకణాల కదలికలు తగ్గుతాయి. దీంతో క్రిములున్న చోటుకు అంత వేగంగా వెళ్లవు. క్రిములను నిర్మూలించే రసాయనాలను విడుదల చేయలేవు. ఒకవేళ విడుదల చేసినా అవి అంత సమర్థంగా పనిచెయ్యవు. మరోవైపు యాంటీబాడీలూ వెంటనే తయారుకావు. మధుమేహుల్లో రక్త ప్రసరణ దెబ్బతినటం, రక్తంలో గ్లూకోజుతో కూడిన (గ్లైకేటెడ్‌) హిమోగ్లోబిన్‌ ఉండటం మరో సమస్య. ఇది 7% కన్నా ఎక్కువగా ఉంటే ఆక్సిజన్‌ పంపిణీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్‌ మార్పిడి సరిగా జరగదు. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి, అక్కడ్నుంచి శరీరంలోని ఇతర భాగాలకు చేరవేసే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. కరోనా ప్రభావం ప్రధానంగా ఊపిరితిత్తుల దిగువ భాగంలోనే ఉంటోంది కదా. మధుమేహుల్లో ఆర్‌ఎన్‌ఏ సైతం సరిగా పనిచేయదు. దీంతో ప్రొటీన్లు విచ్ఛిన్నమై అమైనో ఆమ్లాలుగా, అవి తిరిగి ప్రొటీన్లుగా మారే ప్రక్రియ దెబ్బతింటుంది. ఇదీ రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. స్వయం చాలిత నాడీ వ్యవస్థ దెబ్బతినటం వల్ల దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి రక్షణ వ్యవస్థలూ పనిచేయవు. అందువల్ల లక్షణాలేవీ పైకి కనిపించకుండానే లోపల్లోపల సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. ఇవన్నీ మధుమేహులకు కొవిడ్‌-19 పెను శాపంగా మారేలా చేస్తున్నాయి.

తగు జాగ్రత్తలు పాటించాలి

* గ్లూకోజు స్థాయులు కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాలి. హెచ్‌బీఏ1సీ 7% కన్నా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. గ్లూకోజు స్థాయులు తగ్గితే పూర్తిగా కాకపోయినా కొంతయినా రోగనిరోధకశక్తి మెరుగవుతుంది.

* రోగనిరోధశక్తి తక్కువగా ఉండటం వల్ల మధుమేహులకు వైరస్‌ త్వరగా అంటుకోవటమే కాదు, వారి నుంచి ఇతరులకూ తేలికగా వ్యాపిస్తుంది. కాబట్టి దగ్గు, తుమ్ముల వంటి లక్షణాలు గలవారికి దూరంగా ఉండటం.. తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవటం.. అనవసరంగా బయటకు వెళ్లకపోవటం.. వెళ్లినా ఇతరులకు 2 మీటర్ల దూరంలో ఉండేలా చూసుకోవటం.. ముక్కుకు, నోటికి మాస్కు పెట్టుకోవటం లేదా రుమాలు చుట్టుకోవటం వంటి జాగ్రత్తలను మరింత కచ్చితంగా పాటించాలి. దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల మాదిరిగానే ఉమ్మిలోనూ వైరస్‌ ఎక్కువగానే ఉంటుంది. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయకూడదు.

* మధుమేహంతో బాధపడేవారికి ఇన్‌ఫెక్షన్లు వస్తే గ్లూకోజు ఎక్కువవుతుంది. గ్లూకోజు ఎక్కువైతే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రతా పెరుగుతుంది. ఇలాంటివారు ఇన్సులిన్‌ మోతాదులు పెంచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కీటోన్స్‌ పెరిగిపోయి ప్రాణాంతకంగా పరిణమించొచ్ఛు.


హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందు కరోనా ఇన్‌ఫెక్షన్‌ తగ్గటానికి తోడ్పడుతున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. నిజానికి మధుమేహులకు దీన్ని అనుబంధ ఔషధంగానూ వాడుకోవాలని మన ఔషధ నియంత్రణ సంస్థ ఆరేళ్ల క్రితమే సూచించింది. ఇది గ్లూకోజు నియంత్రణకు తోడ్పడుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల ముందు జాగ్రత్తగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను 200-300 మి.గ్రా. మోతాదులో వేసుకోవటం మంచిది. కరోనా నివారణకు కాకపోయినా గ్లూకోజు నియంత్రణకైనా పనికొస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని