కరోనా జబ్బుతో క్షయ ఉద్ధృతి!

మనదేశంలో ఎంతోమంది కొవిడ్‌-19 బారినపడ్డారు. దీన్నుంచి కోలుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవటం లేదు. కరోనా జబ్బు దుష్పరిణామాలు దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తున్నాయి.

Published : 22 Jun 2021 00:22 IST

నదేశంలో ఎంతోమంది కొవిడ్‌-19 బారినపడ్డారు. దీన్నుంచి కోలుకున్నారు. అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవటం లేదు. కరోనా జబ్బు దుష్పరిణామాలు దీర్ఘకాలం వెంటాడుతూనే వస్తున్నాయి. వీటి జాబితాకు అంతే లేకుండా పోతోంది. వీటికి సంబంధించి మరో ఆందోళనకర విషయం బయటపడింది. ఇది ఒంట్లో నిద్రాణంగా ఉన్న క్షయను సైతం తిరిగి ప్రేరేపితం చేసే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ2 నిద్రాణ క్షయను పునరుత్తేజితం చేసే మూలకణ మాధ్యమ రక్షణ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని ఐఐటీ గువాహటి, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నిర్వహించిన అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో భాగంగా పరిశోధకులు- నిద్రాణ స్థితిలో క్షయ గల ఎలుకల ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ రకానికి చెందిన హెపటైటిస్‌ వైరస్‌-1 (ఎంహెచ్‌వీ-1) ఇన్‌ఫెక్షన్‌ తీరుతెన్నులపై అధ్యయనం చేశారు. వీటిల్లో తిరిగి క్షయ విజృంభించినట్టు గుర్తించారు. స్తబ్ధ మూల కణాలను నిద్రాణ క్షయ బ్యాక్టీరియా దారి మళ్లించి ఊపిరితిత్తుల్లో క్షయకు దారితీస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. ఇదే నిజమైతే క్షయ ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా పరిణమిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సుమారు 40% మందిలో క్షయ నిద్రాణంగా ఉన్న మనలాంటి దేశాలకిది తీవ్ర ఆందోళనకరమైన విషయం. అందుకే ‘కొవిడ్‌-19, నిద్రాణ క్షయ తిరిగి ప్రేరేపితం కావటం’ మీద తక్షణం అధ్యయనం చేయాల్సిన అవసరముందని పరిశోధకులు సూచిస్తున్నారు. క్షయ ప్రపంచ మహమ్మారిగా మారకముందే అడ్డుకోవటానికిది అత్యవసరమని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని