ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ మందుతో కరోనాకు కళ్లెం!

మహిళల కన్నా పురుషుల్లో కొవిడ్‌-19 తీవ్రంగా ఉండటం, ఎక్కువమంది మగవారు మరణించటం చూస్తూనే ఉన్నాం. జబ్బు తీవ్రతలో పురుష హార్మోన్లు పాలు పంచుకుంటున్నాయనే సంగతిని ఇది చెప్పకనే చెబుతోంది.

Published : 06 Jul 2021 01:32 IST

హిళల కన్నా పురుషుల్లో కొవిడ్‌-19 తీవ్రంగా ఉండటం, ఎక్కువమంది మగవారు మరణించటం చూస్తూనే ఉన్నాం. జబ్బు తీవ్రతలో పురుష హార్మోన్లు పాలు పంచుకుంటున్నాయనే సంగతిని ఇది చెప్పకనే చెబుతోంది. మరి పురుష హార్మోన్లను అదుపు చేసే మందులతో (యాంటీఆండ్రోజెన్స్‌) కొవిడ్‌-19 తీవ్రంగా మారకుండా చూసుకోవచ్చా? ఇది సాధ్యమేనని యూనివర్సిటీ ఆఫ్‌ ఎసెక్స్‌, ఇంపీరియల్‌ లండన్‌ కాలేజ్‌ తాజా అధ్యయనం సూచిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాల్లో కణాల్లోకి వైరస్‌ ప్రవేశించే సామర్థ్యాన్ని తగ్గించే మందులను అన్వేషించే క్రమంలో దీన్ని గుర్తించారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ-2 చాలా అవయవాల మీద దాడి చేస్తోంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. వైరస్‌ ఊపిరితిత్తుల కణాల్లోకి ప్రవేశించటానికి టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 అనే ప్రొటీన్‌ను వాడుకుంటోంది. ఈ ప్రొటీన్‌ స్థాయులను తగ్గించగలిగితే? చికిత్సగా ఉపయోగపడుతుంది కదా? పురుష హార్మోన్లు వివిధ కణజాలాల్లో.. ముఖ్యంగా ప్రోస్టేట్‌ గ్రంథిలో టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 స్థాయులు పెరిగేలా చేస్తాయి. అందుకే పురుష హార్మోన్లను అడ్డుకునే ఎంజలుటమైడ్‌ మందుపై పరిశోధకులు దృష్టి సారించారు. తీవ్ర ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ చికిత్సలో దీన్ని చాలాకాలంగా వాడుతున్నారు. శరీరం దీన్ని బాగా తట్టుకుంటుంది కూడా. ఇది టీఎంపీఆర్‌ఎస్‌ఎస్‌2 స్థాయులను తగ్గించటమే కాదు.. ఊపిరితిత్తుల కణాల్లోకి వైరస్‌ ప్రవేశించకుండా, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తకుండా చేస్తుండటం విశేషం. కొవిడ్‌-19 చికిత్సకు యాంటీఆండ్రోజెన్స్‌ సమర్థమైన చికిత్స కాగలదనే వాదనకు ఇది మరింత బలం చేకూరుస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని