పీసీఓస్‌ గలవారికి గర్భనిరోధక మాత్రల రక్ష

అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పీసీఓఎస్‌) గలవారికి మధుమేహం ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది.

Published : 19 Oct 2021 01:13 IST

అండాశయాల్లో నీటితిత్తుల సమస్య (పీసీఓఎస్‌) గలవారికి మధుమేహం ముప్పు రెండింతలు ఎక్కువగా ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ అధ్యయనం హెచ్చరిస్తోంది. మీసాలు, గడ్డాల వంటి అవాంఛిత వెంట్రుకలు మొలిచే మహిళల్లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇలాంటివారికి గర్భనిరోధక మాత్రలతో మధుమేహం ముప్పు 26% వరకు తగ్గుతున్నట్టు తేలటం విశేషం. అండాశయాల్లో నీటి తిత్తులతో ఒక్క మధుమేహం ముప్పే కాదు. ఎండోమెట్రియల్‌ క్యాన్సర్‌, గుండెజబ్బు, కాలేయానికి కొవ్వు పట్టటం వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఎక్కువే. పీసీఓఎస్‌ గలవారిలో నెలసరి సరైన సమయానికి రాకపోవటం, నెలసరి అసలే కాకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి సంతానం కలగటంలో ఇబ్బందులు సృష్టిస్తాయి. కొందరికి మీసాలు, గడ్డాలూ మొలవచ్చు. మరోవైపు తల మీద జుట్టు ఊడిపోతుంటుంది. జిడ్డు చర్మం, మొటిమలూ తలెత్తొచ్చు. వీటికి కారణం పీసీఓఎస్‌ గలవారి రక్తంలో పురుష హార్మోన్ల మోతాదులు ఎక్కువగా ఉండటమే. దీని బారినపడ్డవారిలో బరువూ పెరుగుతుంటుంది. కణాలు ఇన్సులిన్‌కు అంతగా స్పందించవు కూడా. దీంతో రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతుంటాయి. ఫలితంగా శరీరం మరింత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు పురుష హార్మోన్లు ఇంకాస్త అధికంగానూ ఉత్పత్తి అవుతుంటాయి. ఇవి ఇన్సులిన్‌ మోతాదులు ఇంకాస్త ఎక్కువయ్యేలా చేస్తాయి. చివరికిదో విష వలయంగా మారుతుంది. అందుకే పీసీఓఎస్‌, మధుమేహం ముప్పుపై పరిశోధకులు దృష్టి సారించారు. పీసీఓఎస్‌ గలవారికి మధుమేహం, ముందస్తు మధుమేహం ముప్పులు పెరుగుతున్నట్టు.. వీరికి గర్భనిరోధక మాత్రలు కొంతవరకు రక్షణగా నిలుస్తున్నట్టు గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు