ఆరోగ్య పరిమళం!

పూల సుగంధానికి మది పరవశిస్తుంది. వంటకాల ఘుమఘుమకు ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది. అంతా పరిమళాల మాయ! మన జీవితం కూడా ఉమ్మనీటి వాసనతో తల్లిని గుర్తించటంతోనే మొదలవుతుంది. మనసుకు ఉల్లాసం కలిగించటం దగ్గర్నుంచి ఒత్తిడిని తగ్గించటం వరకూ పరిమళాలు చేసే మేలు అంతా ఇంతా కాదు....

Updated : 12 Aug 2022 15:23 IST

అరోమా థెరపీ

పూల సుగంధానికి మది పరవశిస్తుంది. వంటకాల ఘుమఘుమకు ఆకలి రగులుతుంది. అగరు ధూపానికి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అత్తరు వాసనకు తనువు ఆకర్షితమవుతుంది. అంతా పరిమళాల మాయ! మన జీవితం కూడా ఉమ్మనీటి వాసనతో తల్లిని గుర్తించటంతోనే మొదలవుతుంది. మనసుకు ఉల్లాసం కలిగించటం దగ్గర్నుంచి ఒత్తిడిని తగ్గించటం వరకూ పరిమళాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటి ప్రాధాన్యాని వైద్యులు ఏనాడో పసిగట్టారు. మనసుకూ శరీరానికీ అవినాభావ సంబంధముందని, ఆ మాటకొస్తే చాలా జబ్బులు మానసిక అస్తవ్యస్థ స్థితి నుంచే పుట్టుకొస్తున్నాయని గుర్తించి చికిత్సల కోసమూ వినియోగించుకున్నారు. ఇది క్రమంగా ప్రత్యేక పరిమళ చికిత్స(అరోమా థెరపీ)గానూ అవతరించింది.

లుబు చేస్తే వేడి నీటిలో పసుపు, వేపాకు వేసి ఆవిరి పడతాం. వామును వేడి చేసి గుడ్డలో చుట్టి పీలుస్తాం. ఇవన్నీ ఒకరకంగా పరిమిళ చికిత్సలే. సహజ చికిత్సలుగా మనకు తెలియకుండానే వాడుతూ వస్తున్నవే. శరీరానికి కొంత సమయం ఇస్తే జబ్బులనూ తగ్గించుకుంటుంది. సహజ చికిత్సల ఉద్దేశం ఇదే. పరిమళ చికిత్స అలాంటిదే. నిజానికిది చాలా ప్రాచీనమైంది. ఈజిప్టులో 5వేల ఏళ్ల క్రితమే పరిమళ ద్రవ్యాలను సౌందర్య సాధనాలుగా, చికిత్సలుగా వినియోగించుకోవటం ఆరంభించారు. మనదేశంలో సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులు పరిమళ ద్రవ్యాల నూనెలతో మర్దన చేయటం వంటివి పాటిస్తూనే వచ్చారు. ఆధునిక రసాయన, ఔషధ రంగాల ఆవిర్భావంతో పరిమళ చికిత్స ప్రాభవం కోల్పోయినా 20వ శతాబ్దం ఆరంభంలో మళ్లీ జవసత్వాలు పుంజుకుంది. ఫ్రెంచి శాస్త్రవేత్త రెనే మారిస్‌ గాటెఫోసే పరిమళ నూనెలకు జబ్బులను నయం చేసే శక్తి ఉందని గుర్తించటంతో కొత్త మలుపు తిరిగింది. దీనికి ‘అరోమాథెరపీ’ అని నామకరణం చేసిందీ ఆయనే.
చికిత్సలు ఇలా..
పరిమళ చికిత్సలో రకరకాలున్నాయి. ప్రధానంగా నూనెలతో వాసన పీల్చేలా చూడటం, మర్దన, స్నానం చేయిస్తారు. ఇంట్లో పరిమళం కోసమే అయితే ఆవిరిని వెలువరించే పాత్రలో (డిఫ్యూజర్‌) వేసి వాడుకోవచ్చు. చికిత్సగా అయితే మాత్రం నిపుణుల సలహాతోనే వాడుకోవాలి. సొంత ప్రయోగాలు చేయొద్దు. శరీర తత్వం, జబ్బు తీరుతెన్నులు, మానసిక స్థితిని బట్టి ఎలాంటి నూనెలు వాడుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. కొన్ని సమస్యలకు ఒకసారి చికిత్స చేస్తే సరిపోవచ్చు. నిద్రలేమి వంటి దీర్ఘకాల సమస్యలకు మాత్రం 10-15 రోజలు అవసరపడొచ్చు.

1. వాసన పీల్చటం: పరిమళాలు ప్రధానంగా వాసన ద్వారానే ఒంట్లోకి ప్రవేశిస్తాయి. వాసనను పీల్చినప్పుడు ముందుగా మన ముక్కు పైభాగంలోని వాసనలను పసిగట్టే భాగం ప్రేరేపితమవుతుంది. అక్కడి నాడుల ద్వారా ఆయా సంకేతాలు మెదడుకు చేరుకొని.. భావోద్వేగాలు, కోరికలు, ఆకలి, జ్ఞాపకాలతో ముడిపడిన భాగాన్ని ప్రేరేపిస్తాయి. హార్మోన్ల స్థాయులను నియంత్రించే గ్రంథులనూ ఉత్తేజితం చేస్తాయి. ఇలా శరీరం, మనసు మీద గాఢమైన ప్రభావం చూపిస్తాయి. ఉల్లాసం, ఉత్సాహం ఇనుమడింపజేస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆవిరి వెలువడేలా చేసే పాత్రలో (డిఫ్యూజర్‌) 2-3 చుక్కల నూనెలు వేస్తే దాన్నుంచి వెలువడే పరిమళాలు చికిత్సగా ఉపయోగపడతాయి.
2. మర్దన: కొబ్బరి నూనె, ఆలివ్‌ నూనె వంటి వాటిల్లో పరిమళ నూనెలను కలిపి మర్దన చెయ్యటం మరో పద్ధతి. మర్దన చేసినప్పుడు ముక్కు ద్వారా వాసనలు మెదడుకు చేరుకోవటమే కాదు.. చర్మం కూడా వీటిని గ్రహించుకుంటుంది. ఇవి కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి, అక్కడ్నుంచి రక్తం ద్వారా మిగతా అవయవాలకూ చేరుకుంటాయి. ఆయా జబ్బులను బట్టి నూనెల మిశ్రమాన్ని, ఎంతసేపు మర్దన చేయాలన్నది నిర్ణయిస్తాయి. ఇవి ఒంట్లో పేరుకుపోయిన మలినాలనూ బయటకు వెళ్లగొడతాయి. ఇలా ఆరోగ్యం కుదుట పడటానికీ తోడ్పడతాయి. మన చర్మం కొన్ని పరిమళాలను త్వరగానూ, కొన్నింటిని ఆలస్యంగానూ శోషించుకుంటుంది. అందువల్ల మర్దన చేసిన వెంటనే స్నానం చేయటం మంచిది కాదు.
3. స్నానం: పరిమళ నూనెలను కలిపిన నీటితో స్నానం చేయించటం కూడా ఎంతో మేలు చేస్తుంది. వెచ్చటి నీటి మీద నూనెలు తేలికగా ఆవిరి అవుతాయి. దీంతో పరిమళాలు మెదడుకు త్వరగా చేరుకుంటాయి. బకెట్‌ నీటిలో 3-5 చుక్కల పరిమళ నూనె కలిపి స్నానం చేయొచ్చు. మామూలుగానే స్నానం చేసినప్పుడు కండరాలు వదులవుతాయి. దీనికి పరిమళ నూనెలూ కలిస్తే మరింత ఎక్కువ ఫలితం కనిపిస్తుంది. ఆవిరి స్నానమూ ఉపయోగపడుతుంది.
4. చర్మ, కేశ సంరక్షణ: సౌందర్యాన్ని పెంపొందించటానికీ పరిమళ చికిత్స ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అందుకే సబ్బులు, షాంపూలు, క్రీములు, లోషన్లలో పరిమళ నూనెలను కలిపి తయారుస్తుంటారు. గులాబీ, మల్లె, వేప నూనె సబ్బుల వాసన మనసును ఆహ్లాద పరుస్తుంది. అలాగే రోజ్‌ వాటర్‌ చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.

నూనెలు ప్రధానం
జబ్బులు నయం కావటానికి, నివారణకు పరిమళాలు ఉపయోగపడతాయని ఆయుర్వేదం భావిస్తుంది. ప్రాణశక్తిని సంరక్షించుకోవటానికి.. జీర్ణక్రియ, జీవక్రియలు (అగ్ని) సజావుగా కొనసాగటానికి.. రోగనిరోధకశక్తిని (ఓజస్సు) పెంపొందించటానికివి తోడ్పడతాయని విశ్వసిస్తుంది. వేపాకులతో పొగ వేయటం.. స్నానపు నీటిలో తులసి ఆకులు, గులాబీ పూరెక్కలు వేయటం వంటివన్నీ ఇందులోని భాగాలే. ప్రస్తుతం పరిమళ చికిత్సలో సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన నూనెలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. మొక్కల అన్ని భాగాల నుంచి వీటిని సంగ్రహిస్తారు. పువ్వులు (ఉదా: గులాబీ, మల్లె), చెక్కలు (గంధం), బెరడు (దాల్చినచెక్క), ఆకులు (తులసి), వేళ్లు (అతిమధురం), పండ్లు (నారింజ)... వంటివన్నీ పరిమళ నూనెలు తీయటానికి ఉపయోపడేవే. ఇవి చాలా గాఢంగా ఉంటాయి. వీటిని నేరుగా వాడుకోవటం తగదు. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్‌ నూనె, నువ్వుల నూనె వంటి వాటిల్లో 3-5 చుక్కలను కలిపి చికిత్స చేస్తారు. ఇవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ కోల్పోయిన శక్తి తిరిగి పుంజుకోవటానికి తోడ్పడతాయి. శరీర తత్వం, ఆయా జబ్బులను బట్టి నూనెలను ఎంచుకుంటారు. అవసరమైతే వివిధ రకాల నూనెల మిశ్రమంతోనూ చికిత్స చేస్తారు. వీలైనంతవరకు ఒకేసమయంలో రెండు, మూడు రకాల కన్నా ఎక్కువ నూనెలను వాడరు.
లాభాలు ఎన్నెన్నో..
ఒత్తిడితో తలెత్తే దుష్ప్రభావాలు తగ్గటానికి లావెండర్‌, గులాబీ, కేమోమిలే పరిమళాలు ఎంతగానో ఉపయోగపడతాయి. లావెండర్‌ నూనెను నీటిలో కలిపి దిండు మీద చల్లుకుంటే నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది.
పచౌలీ పరిమళం బాధలు తగ్గుముఖం పట్టటానికి, మూడ్‌ను మెరుగుపరచటానికి దోహదం చేస్తుంది.
గులాబీ నూనె చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది.
నిమ్మగడ్డి, మల్లె, గులాబీ, లావెండర్‌ నూనెల వంటివి విషతుల్యాలనూ తొలగిస్తాయి. వీటిని నిపుణుల సలహా మేరకు కొద్దిగా టీలో కలిపి లోపలికీ తీసుకోవచ్చు. దీంతో అవయవాలూ శుభ్రపడతాయి.
జలుబు చేసినప్పుడు వేడి నీటిలో యూకలిప్టస్‌ నూనెను కలిపి ఆవిరి పట్టొచ్చు. తులసి పరిమళంతో ఆవిరి పడితే జలుబు, జ్వరం తగ్గటానికి దోహదం చేస్తుంది. తలనొప్పితో బాధపడుతుంటే లావెండర్‌, యూకలిప్టస్‌ నూనెల ఆవిరి పట్టొచ్చు. నీటిలో కాస్త లావెండర్‌ లేదా జెరీనియం నూనె కలిపి.. అందులో చిన్న రుమాలును తడిపి తల, మెడ మీద వేసుకున్నా తలనొప్పి తగ్గుతుంది.
బార్గమోట్‌, సైప్రస్‌, నిమ్మగడ్డి, రోజ్‌మేరీ, నూనెలు కుంగుబాటు తగ్గేలా చేస్తాయి.
కెమోమిలా, జెరీనియం, మల్లె, లావెండర్‌, నరోలీ, పచోలీ పరిమళాలు మానసిక ప్రశాంతతకు ఉపయోగపడతాయి.
ఆందోళన తగ్గటానికి నరోలీ నూనె బాగా ఉపయోగపడుతుంది. దీంతో తల మర్దన చేసుకున్నా, నీటిలో కలిపి స్నానం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
కుంగుబాటు, ఒత్తిడి తగ్గటానికి మల్లె, గులాబీ, కేమోమిలా నూనెలు ఉపయోగపడతాయి. లావెండర్‌ వీటితో పాటు చాలారకాల సమస్యలకు ఉపయోగపడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని