Updated : 05 Oct 2021 03:17 IST

జుట్టుకూ కరోనా చిక్కులు!

కొవిడ్‌-19 ఒంట్లో దేన్నీ వదిలి పెట్టటం లేదు. ఊపిరితిత్తుల మీదే కాదు.. గుండె నుంచి మెదడు వరకూ అన్ని అవయవాల పైనా ప్రతాపం చూపుతోంది. కనీసం వెంట్రుకల మీదైనా జాలి చూపటం లేదు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎంతోమంది జుట్టు ఊడిపోవటంతో సతమతమవుతుండటమే దీనికి నిదర్శనం. మంచి విషయం ఏంటంటే- కొద్ది నెలల తర్వాత ఊడిన జుట్టు దానంతటదే రావటం. కాకపోతే తగు పోషకాహారం తీసుకుంటూ, ఒత్తిడికి గురికాకుండా చూసుకోవటమే కావాలి. ఆందోళన చెందకుండా అవగాహన పెంచుకోవాలి.

‘జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతోంది’.  ‘ఇంట్లో ఎక్కడ చూసినా వెంట్రుకలే’. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారి నోటి నుంచి తరచూ వినిపిస్తున్న మాటలివి. అప్పటికే కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2 దెబ్బకు కుదేలైన వారినిది మరింత ఆందోళనకూ గురిచేస్తోంది. దీని కోరల నుంచి బయటపడినా ఒళ్లు నొప్పులు, బలహీనత, దగ్గు, ఆయాసం వంటి సమస్యలు దీర్ఘకాలం వేధిస్తూ వస్తున్నాయి. వీటికి తోడు జుట్టు ఊడటమూ కొత్త కలవరం కలిగిస్తోంది. సరైన ఆహారం తినకపోవటం, ఒత్తిడి, పర్యావరణ అంశాల వంటివెన్నో వెంట్రుకలు ఊడిపోవటానికి కారణమయ్యే  మాట నిజమే అయినప్పటికీ ఇవేవీ కొవిడ్‌-19కు సాటి రావటం లేదు. ఎందుకంటే కొందరికి ఎన్నడూ లేనంతగా కుచ్చులు కుచ్చులుగానూ జుట్టు ఊడిపోతోంది. నిజానికి కరోనా జబ్బు ఒక్కటే కాదు.. వైరల్‌ ఇన్‌ఫెక్షన్లన్నీ జుట్టు ఊడిపోవటానికి దారితీసేవే. ఇటీవల చాలామంది కొవిడ్‌-19 బారినపడటం వల్ల ప్రస్తుతం ఈ సమస్య ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తోంది.

కారణాలేంటి?

వైరస్‌ మూలంగా ప్రేరేపితమైన వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌), భయాందోళనలతో తలెత్తే ఒత్తిడి, సరిగా తినకపోవటం వల్ల ముంచుకొచ్చే పోషణ లోపం.. ఇవన్నీ వెంట్రుకలకు శాపంగా పరిణమిస్తున్నాయి. సార్స్‌-కొవీ-2 అతిగా వాపు ప్రక్రియను ప్రేరేపిస్తున్న సంగతి తెలిసిందే. జబ్బుతో బాధపడుతున్నప్పుడే కాదు, కోలుకున్న తర్వాతా దీని అనర్థాలు బాగానే ఇబ్బంది పెడుతున్నాయి. వెంట్రుకలు రాలటమూ ఇందులో భాగమే. ఒకవైపు వైరస్‌ దుష్ప్రభావాల నుంచి కోలుకోవటానికి శరీరం ప్రయత్నిస్తుండటం వల్ల రోగనిరోధక శక్తి సన్నగిల్లుతుంటుంది. మరోవైపు సరిగా తినకపోవటం వల్ల పోషణ లోపం తలెత్తుతుంటుంది. బలహీనతా వేధిస్తుంటుంది. ఇవన్నీ జుట్టును దెబ్బతీసేవే. వీటికి తోడు ఒత్తిడి ఒకటి. కొవిడ్‌ భయంతో ఎంతోమంది ఒత్తిడికీ గురవుతున్నారు. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతోంది. ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు విడుదలయ్యే హార్మోన్లు సైతం వెంట్రుకలకు హాని చేస్తాయి మరి. ఇలా కొవిడ్‌-19 శారీరకంగానే కాదు.. మానసికంగానూ రెండు రకాలుగా జుట్టును దెబ్బతీస్తోంది.

మూడు దశల్లో..

రోజుకు 100 వెంట్రుకల వరకు రాలటం సహజమే. జన్యువులు, ఒత్తిడి, సరైన ఆహారం తినకపోవటం, కొన్నిరకాల జబ్బులు, నీటి నాణ్యత వంటివన్నీ ఇందుకు దోహదం చేస్తుంటాయి. సాధారణంగా వెంట్రుకల ఎదుగుదల మూడు దశలుగా సాగుతుంది. ఒకటి పెరిగే దశ (అనాజెన్‌). రెండు విశ్రాంతి దశ (కెటాజెన్‌). మూడు రాలే దశ (టీలోజెన్‌). వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చినప్పుడు ఇవి తారుమారవుతాయి. వెంట్రుకలు పెరిగే దశ నుంచి విశ్రాంతి స్థితిలోకి వెళ్లకుండా నేరుగా ఊడిపోయే దశకు చేరుకుంటాయి. దీంతో త్వరత్వరగా, ఎక్కువెక్కువగా రాలటం మొదలవుతుంది. కొవిడ్‌-19లో ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చిత్రమేంటంటే- ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నప్పుడు వెంట్రుకలు బాగానే ఉంటాయి. ఇన్‌ఫెక్షన్‌ తగ్గిన రెండు, మూడు నెలల తర్వాతే రాలటం ఆరంభమవుతుంది. ఇలా ఆరు నెలల వరకూ రాలిపోవచ్చు.

చికిత్స అవసరమా?

ఇన్‌ఫెక్షన్లతో జుట్టు ఊడిపోతే పెద్దగా మందుల అవసరమేమీ ఉండదు. చాలావరకు జుట్టు తిరిగి వస్తుంది. కాకపోతే చాలామంది ఆందోళనకు గురవుతుంటారు. మొత్తం జుట్టంతా ఊడిపోయి బట్టతల వచ్చేస్తుందేమోనని డాక్టర్ల దగ్గరికి పరుగెడుతుంటారు. అంత భయం అవసరం లేదు. మంచి పోషకాహారం తీసుకుంటూ, తగు వ్యాయామం చేస్తే చాలు. శరీరానికి తగినన్ని పోషకాలు అందుతాయి. రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇవి జుట్టు త్వరగా మొలవటానికి, పెరగటానికి తోడ్పడతాయి. ఎవరికైనా రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయక పోవటం, విటమిన్ల లోపం వంటివి ఉన్నట్టయితే వెంట్రుకలు త్వరగా మొలవవు. ఇలాంటివారికి బయాటిన్‌, ఐరన్‌, జింక్‌, విటమిన్‌ డి3, విటమిన్‌ బి12, ప్రొటీన్‌, అమైనో ఆమ్లాలతో కూడిన మాత్రలు అవసరమవుతాయి. కొందరికి మినాక్సిడిల్‌ లోషన్‌ ఉపయోగపడుతుంది. ఇది మాడుకు రక్త ప్రసరణ పెరిగేలా చేసి, వెంట్రుకలు త్వరగా పెరిగేలా చేస్తుంది. మినాక్సిడిల్‌ లోషన్‌ పడనివారికి పెప్టైడ్‌ సీరమ్‌లు ఉపయోగపడతాయి. వీటిని ఉదయం, సాయంత్రం ఒక మిల్లీలీటరు చొప్పున తల మీద చల్లుకొని మర్దన చేసుకోవాల్సి ఉంటుంది.

* తల స్నానం చేసేటప్పుడు అతిగా షాంపూలు వాడటం మంచిది కాదు. రోజూ వాడాల్సిన అవసరం లేదు. వారానికి ఒకట్రెండు సార్లు షాంపూ వాడితే చాలు. అలాగే మరీ ఎక్కువగా మాడును రుద్దకూడదు. మైల్డ్‌ షాంపూలు వాడుకోవాలి. చుండ్రు కూడా ఉన్నట్టయితే యాంటీడాండ్రఫ్‌ షాంపూలు ఉపయోగించటం మంచిది.

* సన్నటి దువ్వెనలకు బదులు వదులైన పళ్లు గల దువ్వెనలతో జుట్టు దువ్వుకోవాలి.

* మనదగ్గర మొదట్నుంచీ నూనెలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయని నమ్ముతుంటారు. ఇవి కొంతవరకు కుదుళ్లను ప్రేరేపితం చేయటానికి ప్రయత్నిస్తాయి గానీ కచ్చితంగా వెంట్రుకలు పెరిగేలా చేస్తాయనటానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. వీటి ముఖ్యమైన పని వెంట్రుకలు మృదువుగా ఉండేలా, నిగనిగలాడేలా చేయటం. తేలికగా దువ్వుకోవటానికీ ఉపయోగపడతాయి. కావాలనుకుంటే నూనెలను తలకు రాసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువగా రాయొద్దు. మాడు మీద బలంగా, గట్టిగా రుద్దొద్దు.

ఆహారం కీలకం

మంచి పోషకాహారం తినటం చాలా అవసరం. ముఖ్యంగా గింజ పప్పులు (నట్స్‌), విత్తనాలు చాలా మేలు చేస్తాయి. అవిసె గింజలు, గుమ్మడి, పుచ్చకాయ పలుకులు.. అక్రోట్లు, బాదం వంటివి తీసుకోవచ్చు. ఖర్జూరం, బెల్లం, మునక్కాయలు, మునగాకులో ఐరన్‌ దండిగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆకు కూరల్లో ఐరన్‌తో పాటు క్యాల్షియం, జింక్‌ కూడా ఉంటాయి. ఉల్లికాడ, మొలకెత్తిన గింజలు సైతం మంచివే.


ఇతర సమస్యల మీదా కన్ను

కొవిడ్‌-19 ఒక్కటే కాదు. ఇతరత్రా సమస్యలతోనూ జుట్టు ఊడిపోవచ్చు. ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవటం మంచిది. వీటి మధ్య తారతమ్యాలను తెలుసుకుంటే తగు చికిత్సలు తీసుకోవటానికి వీలుంటుంది.

* బట్టతల: ఇది జన్యుపరంగా వచ్చే సమస్య. దీన్నే ఆండ్రోజెనిక్‌ అలోపేసియా అంటారు. ఇది మగవారిలో, ఆడవారిలో వేర్వేరుగా కనిపిస్తుంది. ఆడవారిలో పాపిట పెద్దగా కనిపిస్తుంది. మగవారిలో నుదురు నుంచి వెంట్రుకలు వెనక్కి తగ్గుతుంటాయి. కొందరికి మాడు మీద గుండ్రంగానూ జుట్టు ఊడిపోవచ్చు. ఒకప్పుడు బట్టతల 30, 40 ఏళ్ల తర్వాత మొదలయ్యేది. ఇప్పుడు చిన్న వయసులోనే వస్తోంది. కొందరికి 15, 20 ఏళ్లలోనే బట్టతల లక్షణాలు కనిపిస్తుండటం చూస్తున్నాం. దీనికి మూలం హార్మోన్లు అస్తవ్యస్తం కావటం. ప్రస్తుతం ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌ తినటం పెరిగింది. ఇది ఒంట్లో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ పెరిగేలా చేస్తుంది. టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ వెంట్రుకల ఎదుగుదల తీరును దెబ్బతీస్తుంది. అనాజెన్‌  నుంచి నేరుగా టీలోజెన్‌ దశకు మారేలా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు, ఒత్తిడి వంటి వాటితో ఊడిపోయే  జుట్టు తిరిగి వస్తుంది. కానీ బట్టతలలో రాదు.

* అలోపేసియా ఏరియేటా: ఇది మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున వెంట్రుకల కుదుళ్ల మీద దాడి చేయటంతో వచ్చే సమస్య. ఇందులో గుండ్రంగా అక్కడక్కడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. థైరాయిడ్‌, ఎండుగజ్జి, మధుమేహం వంటి జబ్బులు గలవారిలో ఇది ఎక్కువ. దీనికి ఒత్తిడి కూడా కారణమవుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం: పీసీఓఎస్‌, పీసీఓడీ సమస్యలు గల ఆడవారిలో హార్మోన్లు అస్తవ్యస్తమవుతుంటాయి. వీరికి తల మీద జుట్టు రాలుతుంటుంది కానీ మీసాలు, గడ్డాలు మొలుస్తుంటాయి. హార్మోన్లు సమతులంగా ఉండేలా చికిత్స తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది.

* సౌందర్య సాధనాలు: జుట్టును ఐరన్‌ చేయటం, వంకర్లు తిప్పటం వంటి వాటికి ఉపయోగించే సాధనాలతోనూ జుట్టు ఊడిపోవచ్చు.

* ట్రాక్షనల్‌ అలోపేసియా: కొందరు జట్టును  బాగా గట్టిగా బిగించి వెనకాల ముడివేస్తుంటారు. ఇదీ జుట్టుకు హాని చేసేది. వెనకాల నుంచి గట్టిగా లాగటం వల్ల నుదురు వద్ద వెంట్రుకలు కుదుళ్లతో పాటు ఊడి వచ్చేస్తుంటాయి.

* మానసిక కారణాలు: ట్రైకో టిలోమేనియాతో బాధపడేవారు వేళ్లతో వెంట్రుకలను మెలి పెట్టి, లాగుతుంటారు. దీంతో కొంత సంతృప్తి కలుగుతుండొచ్చు గానీ వెంట్రుకలు ఊడి వచ్చేస్తుంటాయి. వెంట్రుకలు వివిధ సైజుల్లో ఉండటం దీని ప్రత్యేకత. అంటే కొంత జుట్టు  పెద్దగా ఉంటే కొంత చిన్నగా ఉంటుంది. కొన్ని  చోట్ల వెంట్రుకలు పూర్తిగా ఊడిపోవచ్చు కూడా.

* ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు: తల మీద తామర వంటి ఇన్‌ఫెక్షన్లతోనూ జుట్టు ఊడిపోతుంటుంది. అలోపేసియా ఏరియేటాలో మాడు నున్నగా ఉంటుంది. ఇందులోనైతే చిన్న చిన్న పొక్కులు, చీము పొక్కులు, పొలుసులతో అపరిశుభ్రంగా ఉంటుంది.

* చర్మ సమస్యలు: సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యల్లోనూ జుట్టు రాలిపోతుంది.

* మందులు: క్యాన్సర్‌ బాధితులకు ఇచ్చే కీమోథెరపీ, రేడియేషన్‌తోనూ జుట్టు ఊడిపోతుంది. చికిత్సలు ఆపేసిన మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి వెంట్రుకలు మొలుస్తాయి. కొన్ని మానసిక సమస్యలకు, ఫిట్స్‌కు వాడే మందులతోనూ జుట్టు ఊడిపోవచ్చు. గర్భ నిరోధక మాత్రలతోనూ వెంట్రుకలు రాలిపోయే ప్రమాదముంది.


భయం తగ్గించుకోవాలి

ఆరోగ్యం సరిగా ఉంటే కొవిడ్‌ తగ్గిన 6 నెలల తర్వాత ఏ మందులు వాడకపోయినా జుట్టు తిరిగి వస్తుందని  అంతా గుర్తించాలి. భయంతో ఆందోళన, ఒత్తిడికి గురికావద్దు. ఇవి కుదుళ్లను దెబ్బతీసి జుట్టు మరింత ఊడిపోయేలా చేస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts