రొమ్ముక్యాన్సర్‌లో ఆ భాగమే తొలగించినా..

చిన్న వయసులో.. అంటే 40 ఏళ్ల లోపు వచ్చే రొమ్ముక్యాన్సర్లు చాలా తీవ్రంగా ఉంటాయి. వీరికి సాధారణంగా శస్త్రచికిత్స చేస్తుంటారు. కొందరికి రొమ్ములు పూర్తిగా తొలగిస్తుంటారు (మాస్టెక్టమీ). మరి కొందరికి కణితి, దాని చుట్టుపక్కల

Updated : 12 Apr 2022 00:38 IST

చిన్న వయసులో.. అంటే 40 ఏళ్ల లోపు వచ్చే రొమ్ముక్యాన్సర్లు చాలా తీవ్రంగా ఉంటాయి. వీరికి సాధారణంగా శస్త్రచికిత్స చేస్తుంటారు. కొందరికి రొమ్ములు పూర్తిగా తొలగిస్తుంటారు (మాస్టెక్టమీ). మరి కొందరికి కణితి, దాని చుట్టుపక్కల కణజాలాన్ని మాత్రమే తీసేస్తుంటారు (లంపెక్టమీ). ఇలా రొమ్ములను అలాగే ఉంచి చేసే లంపెక్టమీ సైతం మాస్టెక్టమీ మాదిరిగానే సమర్థంగా ప్రభావం చూపుతున్నట్టు ఒక ప్రాథమిక అధ్యయనంలో బయటపడింది. లంపెక్టమీ, మాసెక్టమీ చేయించుకున్నవారి జీవనకాలాన్ని ఇందులో పరిశీలించారు. సుమారు 5.5 ఏళ్ల తర్వాత వీరిలో 12% మంది మరణించారు. అయితే మరణాల విషయంలో శస్త్రచికిత్సల రకాల పరంగా పెద్ద తేడా కనిపించలేదు. రొమ్ముక్యాన్సర్‌ చికిత్సల విషయంలో ఇతర అంశాలూ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు- రొమ్ములో కొంత భాగాన్నే తొలగించినవారికి రేడియేషన్‌ చికిత్స కూడా చేస్తుంటారు. హార్మోన్లతో ముడిపడిన కణితులు గలవారికి క్యాన్సర్‌ మళ్లీ తిరగబెట్టకుండా హార్మోన్‌ చికిత్స ఇస్తుంటారు. నిజానికి హార్మోన్‌ చికిత్స తీసుకునేవారిలో ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉంటుండటం విశేషం. అయితే అధ్యయన ఫలితాల ఉద్దేశం అందరికీ లంపెక్టమీ మాత్రమే చేయాలని కాదని పరిశోధకులు చెబుతున్నారు. సమస్య తీవ్రత, తిరగబెట్టే అవకాశం వంటి వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని