అరిచేయి, అరికాళ్ల పగుళ్లు తగ్గేదెలా?

మా అమ్మకు 45 ఏళ్లు. ఆమెకు ఏడాది నుంచి అరిచేతులు, అరికాళ్లు పగులుతున్నాయి. కరోనా టీకా తీసుకున్నప్పట్నుంచి ఇవి మొదలయ్యాయని అంటోంది. డాక్టర్‌కు చూపిస్తే మందులిచ్చారు. పగుళ్లు కొంచెం తగ్గాయి గానీ బాగా దురద వస్తోంది. నీటిలో తడిస్తే దురద ఎక్కువ అవుతోంది. దీనికి పరిష్కారమేంటి?

Published : 19 Jul 2022 00:42 IST

సమస్యసలహా

సమస్య: మా అమ్మకు 45 ఏళ్లు. ఆమెకు ఏడాది నుంచి అరిచేతులు, అరికాళ్లు పగులుతున్నాయి. కరోనా టీకా తీసుకున్నప్పట్నుంచి ఇవి మొదలయ్యాయని అంటోంది. డాక్టర్‌కు చూపిస్తే మందులిచ్చారు. పగుళ్లు కొంచెం తగ్గాయి గానీ బాగా దురద వస్తోంది. నీటిలో తడిస్తే దురద ఎక్కువ అవుతోంది. దీనికి పరిష్కారమేంటి?

- ఎ. గణేశ్‌ (ఈమెయిల్‌)

సలహా: అరిచేతులు, అరికాళ్ల పగుళ్లు, దురదకూ కరోనా టీకాకూ సంబంధం లేదు. ఈ సమస్యకు అలర్జీ, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ) లోపాల వంటి రకరకాల సమస్యలు దోహదం చేస్తుంటాయి. మీ అమ్మగారికి మధుమేహం ఉందో లేదో తెలియజేయలేదు. మధుమేహం ఉన్నట్టయితే, అది నియంత్రణలో లేనట్టయితే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముంది. దీంతో దురద, పగుళ్ల వంటివి తలెత్తొచ్చు. నీటిలో తడిస్తే దురద ఎక్కువవుతోందని అంటున్నారు. బట్టలు ఉతికేటప్పుడు గానీ అంట్లు తోమినప్పుడు గానీ సబ్బులోని రసాయనాలు పడకపోవటం వల్ల (అలర్జీ) దురద వస్తుండొచ్చు. రోగనిరోధక వ్యవస్థ లోపంతో తలెత్తే సోరియాసిస్‌లోనూ పొలుసులు, దురద రావొచ్చు. కొందరికిది అరిచేతులు, అరికాళ్లకే పరిమితం కావొచ్చు. ప్రత్యక్షంగా చూస్తే గానీ సమస్యను కచ్చితంగా గుర్తించటం సాధ్యం కాదు. ఆయా లక్షణాలు, చేసే పనులు, పగుళ్లు, పొలుసుల తీరును బట్టి సమస్యను నిర్ధరించాల్సి ఉంటుంది. చర్మ నిపుణుడిని సంప్రదిస్తే నిశితంగా పరిశీలించి కారణమేంటన్నది నిర్ణయిస్తారు. తగు చికిత్స సూచిస్తారు. అలర్జీ అయినట్టయితే దీన్ని ప్రేరేపించే పదార్థాలకు, వస్తువులకు దూరంగా ఉండటం ద్వారా నివారించుకోవచ్చు. అవసరమైతే తక్కువ మోతాదులో స్టిరాయిడ్‌ పూత మందులు, ఇమోలియెంట్లు వాడుకోవాల్సి ఉంటుంది. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమైతే యాంటీ ఫంగల్‌ మాత్రలు, పూత మందులు ఉపయోగపడతాయి. అలాగే ఎక్కువగా నీటిలో తడవకుండా చూసుకోవాలి. సోరియాసిస్‌ను పూర్తిగా నయం చేయటం సాధ్యం కాదు కానీ అదుపులో ఉంచుకోవచ్చు. దీనికి రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వాడుకోవాల్సి ఉంటుంది. చవకగా అందుబాటులో ఉండే స్టిరాయిడ్‌ పూత మందులు మేలు చేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మ నిపుణుల సలహా మేరకు మిథోట్రెక్సేట్‌, సైక్లోస్ఫోరిన్‌ వంటి మాత్రలు వేసుకోవాల్సి ఉంటుంది.


డా।। జి. నరసింహారావు నేత, చర్మ నిపుణులు


మీ ఆరోగ్య సమస్యలు, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని