శృంగార తృప్తి లోపిస్తే

శృంగారంలో తృప్తి కలగటం లేదా? అయితే మున్ముందు మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్టే! పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఇదే చెబుతోంది

Updated : 13 Jun 2023 06:52 IST

శృంగారంలో తృప్తి కలగటం లేదా? అయితే మున్ముందు మతిమరుపు వచ్చే అవకాశం ఉన్నట్టే! పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఇదే చెబుతోంది. మధ్యవయసులో శృంగారంలో తృప్తి కలగకపోవటానికీ వృద్ధాప్యంలో విషయగ్రహణ సామర్థ్యం తగ్గటానికీ సంబంధం ఉంటున్నట్టు తేలింది మరి. పరిశోధకులు 56-68 ఏళ్ల వయసులో ఉన్న మగవారిని పన్నెండు సంవత్సరాల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించారు. మొదటి నుంచీ వీరిలో జ్ఞాపకశక్తి, విషయ విశ్లేషణ, సమస్యల పరిష్కార వేగాన్ని క్రమంగా పరీక్షిస్తూ వచ్చారు. అంగ స్తంభన, శృంగార తృప్తి తగ్గటానికీ మున్ముందు మతిమరుపు రావటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు కనుగొన్నారు. లైంగిక ఆరోగ్యం మీద చేసే పరిశోధనల్లో చాలావరకు ఎంత తరచుగా శృంగారంలో పాల్గొంటున్నారు అనే విషయాలనే పరిగణనలోకి తీసుకుంటుంటారు. తాజా అధ్యయనంలో మాత్రం శృంగారంపై అభిప్రాయాల మీద దృష్టి పెట్టటం విశేషం. ఎందుకంటే శారీరకంగా చాలామంది ఒకే స్థితిలో ఉన్నా శృంగారంలో తృప్తి దగ్గరకు వచ్చేసరికి వారి అనుభవాలు వేర్వేరుగా ఉంటాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన రికి స్లేడే చెబుతున్నారు. విషయగ్రహణ, శృంగార తృప్తి, స్తంభన సామర్థ్యం తగ్గటం మధ్యవయసులో మొదలవుతుంది. కాబట్టే మధ్యవయసు పురుషులనే ఎంచుకొని అధ్యయనం ఆరంభించారు. సూక్ష్మరక్తనాళాల్లో మార్పులు అంగ స్తంభన లోపానికి దారితీస్తాయి. మానసిక మార్పులు శృంగారంలో తృప్తి భావన తగ్గటానికి కారణ మవుతాయి. ఇవి రెండూ విషయగ్రహణతో ఎలా ముడిపడి ఉన్నాయో తెలుసుకోవటం మీద పరిశోధకులు దృష్టి సారించారు. స్తంభన సామర్థ్యం, శృంగార తృప్తి తగ్గినవారిలో విషయగ్రహణ పనితీరు మందగించినట్టు గుర్తించారు. శృంగారంలో తక్కువ తృప్తి పొందినవారికి డిమెన్షియా, అల్జీమర్స్‌, గుండెజబ్బు, ఒత్తిడితో ముడిపడిన ఇతరత్రా సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటోందని.. ఇవి విషయగ్రహణ సామర్థ్యం తగ్గటానికి దారితీస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో శృంగారంలో తృప్తి కలగటమూ ముఖ్యమేనని తమ అధ్యయనం నిరూపించిందని వివరిస్తున్నారు. కాబట్టి మరింత ఎక్కువగా వ్యాయామం చేయటం, మంచి ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఇవి రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. స్తంభన సామర్థ్యమూ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని