ప్రోస్టేట్‌ ఉబ్బితే..

మగవారిలో 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం తరచూ చూస్తుంటాం. ఇదేమీ క్యాన్సర్‌ కాదు. తీవ్రమైన ముప్పేమీ తెచ్చిపెట్టదు. చాలామంది ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీస్తుందని భయపడుతుంటారు గానీ అది నిజం కాదు.

Published : 06 Feb 2024 01:24 IST

మగవారిలో 50 ఏళ్లు దాటిన తర్వాత ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటం తరచూ చూస్తుంటాం. ఇదేమీ క్యాన్సర్‌ కాదు. తీవ్రమైన ముప్పేమీ తెచ్చిపెట్టదు. చాలామంది ఇది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌కు దారితీస్తుందని భయపడుతుంటారు గానీ అది నిజం కాదు. ప్రోస్టేట్‌ గ్రంథి ఉబ్బటానికి కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు. కానీ మూత్రాశయానికి దిగువన మూత్రనాళం చుట్టూ కరచుకొని ఉండే ఇది క్రమంగా పెరుగుతూ వస్తుంటుంది. దీంతో మూత్రాశయం, మూత్రనాళం మీద ఒత్తిడి పడుతుంది. ఫలితంగా మూత్రం ధార సన్నబడటం, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావటం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవటం వంటి ఇబ్బందులు వేధిస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని పరీక్షలతో సమస్యను గుర్తించి, ఉపశమన మార్గాలు సూచిస్తారు. చికిత్స తీసుకున్నా, తీసుకోకపోయినా కొన్ని తేలికైన జాగ్రత్తలతోనూ ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.

  • పడుకోవటానికి ఒకట్రెండు గంటల ముందు నీరు వంటి ద్రవాలు తీసుకోవటం మానెయ్యాలి.
  •  బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాలు ఆరంభించేటప్పుడు ద్రవాలు మితంగా తాగాలి.
  •  మూత్రం వస్తున్నట్టు అనిపించగానే వెంటనే విసర్జనకు వెళ్లాలి.
  • మూత్రం విసర్జించే సమయాలను నిర్ణయించుకోవాలి. మూత్రం వస్తున్నట్టు అనిపించకపోయినా ఆ సమయానికి కచ్చితంగా బాత్రూమ్‌కు వెళ్లాలి.
  •  బాత్రూమ్‌కు వెళ్లినప్పుడు కాస్త ఎక్కువ సమయం పట్టినా కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ అయ్యేంతవరకు విసర్జన చేయాలి. దీంతో తరచూ బాత్రూమ్‌కు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది.
  •  జలుబు, ముక్కుదిబ్బడ, అలర్జీ తగ్గటానికి వాడే యాంటీహిస్టమిన్ల వంటి మందుల విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ఇవి మూత్రం ధార మరింత సన్నబడేలా చేయొచ్చు. మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకుండా అడ్డుపడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని