Updated : 08 Feb 2023 07:16 IST

బరువుపై ఉదయాన్నే దండయాత్ర!

బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? ఉదయం నుంచే ప్రయత్నం మొదలెట్టండి. బరువు కొలుచుకోవటం దగ్గర్నుంచి వ్యాయామం, నీళ్లు తాగటం, అల్పాహారం వరకూ అన్నీ ఇందుకు తోడ్పడేవే. చిన్న చిన్న జాగ్రత్తలే అయినా మంచి ప్రభావం చూపుతాయి.


బరువు కొలత

ఉదయం నిద్రలేచాక కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే బరువు తూచుకోవటం మంచిది. అప్పుడైతే కడుపు ఖాళీగా ఉంటుంది. ఏ మధ్యాహ్నమో, సాయంత్రమో బరువు కొలుచుకుంటే అప్పటివరకు తిన్న, తాగిన పదార్థాలు, పానీయాల బరువూ తోడవుతుంది. బరువు తగ్గుతున్నామా? లేదా? అనేది కచ్చితంగా తెలియదు. ఉదయం పూట బరువు చూసుకుంటే పాటిస్తున్న పద్ధతులతో ఎలాంటి ఫలితం కనిపిస్తుందో స్పష్టంగా బయటపడుతుంది. వాటికి కట్టుబడి ఉండేలా ప్రోత్సాహమూ లభిస్తుంది. బరువు తగ్గనట్టయితే ఇంకాస్త పకడ్బందీగా ప్రయత్నాలు మొదలెట్టొచ్చు.


ఓ గ్లాసెడు నీళ్లు

టిఫిన్‌ తినటానికి ముందు ఒకట్రెండు గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గటానికి తోడ్పడుతుంది. నీటిలో కేలరీలేవీ ఉండవు. కానీ కడుపు నిండుతుంది. ఆకలి తగ్గుతుంది. దీంతో మరీ ఎక్కువగా టిఫిన్‌ తినకుండా చూసుకోవచ్చు. నీటితో జీవక్రియల వేగమూ పుంజుకుంటుంది. ఇదీ కేలరీలు ఖర్చు కావటానికి సాయం చేస్తుంది.


టిఫిన్‌కు ముందు వ్యాయామం

వయసులో ఉన్నవారు టిఫిన్‌ తినటానికి ముందే వ్యాయామం చేయటం ఉత్తమం. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరం శక్తి కోసం కొవ్వును వినియోగించు కుంటుంది. కాబట్టి అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది.


ప్రొటీన్‌ కాస్త ఎక్కువగా

అల్పాహారంలో ప్రొటీన్‌ కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది మరి. ప్రొటీన్‌ను శరీరం అదనపు కొవ్వుగా నిల్వ ఉంచుకోవటం అంత తేలిక కాదు కూడా. పిండి పదార్థాన్ని, కొవ్వును జీర్ణం చేసుకోవటం కన్నా ప్రొటీన్‌ను జీర్ణం చేసుకోవటానికి శరీరం ఎక్కువ కేలరీలను వినియోగించుకుంటుంది. కాబట్టి అల్పాహారంలో మినుములు, పెసర, వేరుశనగ వంటి పప్పులతో చేసే పదార్థాలు.. గుడ్డు, పెరుగు వంటివి చేర్చుకోవటం మంచిది.


పెందలాడే జాబితా

రోజంతా ఏమేం తింటామో ఉదయాన్నే జాబితా రాసుకున్నా మేలే. దీంతో తక్కువ కేలరీలు లభించే ఆహారాన్ని ముందే నిర్ణయించకోవచ్చు. ఎక్కువ కేలరీలతో కూడిన బర్గర్లు, వేపుళ్ల వంటివి తినకుండా చూసుకోవచ్చు.


ఒంటికి ఒకింత ఎండ

ఉదయాన్నే శరీరానికి కాస్త ఎండ తగిలేలా చూసుకుంటే మరింత ఎక్కువగా కొవ్వు కరిగే అవకాశముంది. పొద్దుపోయాక ఎండలో గడిపేవారి కన్నా ఉదయం వేళల్లో ఎండలో గడిపేవారి శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వీళ్లు సన్నగానూ ఉంటున్నట్టు బయటపడింది.


నెమ్మది నెమ్మదిగా

గబగబా టిఫిన్‌ తినొద్దు. వాసన, ఆకారం, రుచిని ఆస్వాదిస్తూ అల్పాహారాన్ని నెమ్మదిగా తినాలి. టీవీ చూస్తూనో, ఫోన్‌లో కళ్లు పెట్టో తినొద్దు. పూర్తి విశ్రాంతిగా, నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ సంతోషంతో టిఫిన్‌ తినాలి. దీన్ని సాధన చేస్తే ఎంత తింటున్నాం? ఏం తింటున్నాం? అనేవి అవగతమవుతాయి. ఇది బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.


ఇంటి లంచ్‌ బాక్స్‌

ఇంటి నుంచి బయలు దేరటానికి ముందే లంచ్‌ బాక్స్‌ సర్దుకోవాలి. ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనంతో పాటు చిరుతిండిగా పండ్ల వంటివి ఎంచుకోవాలి. దీంతో ఆకలి వేసినప్పుడు మంచి ఆహారం తినేలా చూసుకోవచ్చు. సమోసాలు, పకోడీల వంటి నూనె వస్తువులు తినకుండా చూసుకోవచ్చు. చిరుతిండిగా పీచుతో కూడిన పదార్థాలు ఎంచుకుంటే ఇంకా మంచిది. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. ఇలా త్వరగా ఆకలి వేయకుండా చూస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు