చిగుళ్లవాపు తగ్గేదెలా?

నాకు 51 ఏళ్లు. పదేళ్లుగా మధుమేహం ఉంది. ఇటీవల పంటి సమస్యకు చికిత్స తీసుకున్నాను. కానీ ముందు నుంచీ చిగుళ్ల వాపు, రక్తం కారటం, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నొప్పి వంటి ఇబ్బందులతో బాధపడుతున్నాను.

Updated : 25 Jan 2022 04:51 IST

సమస్య: నాకు 51 ఏళ్లు. పదేళ్లుగా మధుమేహం ఉంది. ఇటీవల పంటి సమస్యకు చికిత్స తీసుకున్నాను. కానీ ముందు నుంచీ చిగుళ్ల వాపు, రక్తం కారటం, గట్టి పదార్థాలు కొరికినప్పుడు నొప్పి వంటి ఇబ్బందులతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారమేంటి?

- శ్రీనివాస్‌, విజయవాడ

సలహా: మధుమేహం గలవారికి ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. నోటిలో ఎల్లవేళలా బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి నోటి శుభ్రత విషయంలో మరింత జాగ్రత్త అవసరం. లేకపోతే చిగుళ్లవాపు (జింజివైటిస్‌) తలెత్తే అవకాశముంది. దీంతో రక్తం కారటం, నొప్పి వంటి ఇబ్బందులు మొదలవుతాయి. తొలిదశలోనే డెంటిస్ట్‌తో దంతాలను శుభ్రం చేసుకుంటే సమస్య తగ్గుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ చిగుళ్ల కిందికి వ్యాపిస్తుంది. క్రమంగా ఎముక కూడా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంది. ఇలాంటి పరిస్థితిలో రక్తస్రావం రాకుండా చూడటానికి చిగుళ్లు ఉబ్బుతుంటాయి. దీంతో చాలామంది ఏదో కొద్దిగా చిగురు వాచిందిలే అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. కానీ లోలోపల ఇన్‌ఫెక్షన్‌ ముదురుతూనే వస్తుంటుంది. చీము ఏర్పడుతుంది. దంతాన్ని, ఎముకను పట్టి ఉంచే కండర బంధనానికీ ఇన్‌ఫెక్షన్‌ పాకుతుంది. దీంతో పళ్లు కదులుతూ, తినటమూ కష్టమవుతుంది. మీరు చాలాకాలంగా చిగుళ్లవాపు, రక్తం కారటం వంటివి ఉన్నాయంటున్నారు కాబట్టి ముందుగా దంత నిపుణులను సంప్రదించండి. అవసరమైతే ఆర్థోపాంటమోగ్రాఫ్‌ పరీక్ష చేస్తారు. ఇందులో కింది, పై దవడ ఎముక, దంతాలు ఎలా ఉన్నాయి? ఎక్కడెక్కడ క్షీణించాయి? అనేవి తెలుస్తాయి. సమస్యను బట్టి చిగుళ్లను లోపలి నుంచి శుభ్రం చేస్తారు. ఎముక మరీ ఎక్కువగా దెబ్బతింటే చిగురును తెరచి, లోపల్నుంచి శుభ్రం చేస్తారు (ఫ్లాప్‌ సర్జరీ). ఎముక క్షీణించిన చోట గ్రాఫ్టింగ్‌ పదార్థాన్ని కూర్చి సరిచేస్తారు. దీంతో ఎముక తిరిగి ఏర్పడి, పళ్లు గట్టి పడతాయి. అనంతరం నోటిని శుభ్రంగా ఉంచుకుంటే సమస్య తిరిగి తలెత్తకుండా చూసుకోవచ్చు. అలాగే ప్రతి ఆరు నెలలకు ఒకసారి దంత వైద్యుడిని సంప్రదించి, చిగుళ్ల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. అవసరమైతే పళ్లను శుభ్రం చేయించుకోవాలి.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ,  ఈనాడు కార్యాలయం,
రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని