కొవ్వుగడ్డలు పోయేదెలా?

నాకు చర్మం కింద కొవ్వు గడ్డలు (లైపోమా) ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తాయి? పోవాలంటే ఏం చెయ్యాలి? మున్ముందు మళ్లీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Published : 01 Mar 2022 00:50 IST

సమస్య: నాకు చర్మం కింద కొవ్వు గడ్డలు (లైపోమా) ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తాయి? పోవాలంటే ఏం చెయ్యాలి? మున్ముందు మళ్లీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

- శ్రీనివాసులు, అనంతపురం

సలహా: కొవ్వు గడ్డలు (లైపోమా, ఫ్యాట్‌బాల్స్‌) చాలామందిలో చూసేవే. ఇవి చర్మం, కండర పొరకు మధ్యలో ఏర్పడుతుంటాయి. సాధారణంగా 30, 40 ఏళ్ల తర్వాతే కనిపిస్తుంటాయి. ఈ గడ్డలు ఎందుకు వస్తాయన్నది కచ్చితంగా తెలియదు. కొందరిలో వంశ పారంపర్యంగా తలెత్తొచ్చు. వీటిని కొందరు క్యాన్సర్‌ గడ్డలేమోనని భయపడుతుంటారు. కానీ ఇవేమీ హాని చేసేవి కావు. ఈ కొవ్వు గడ్డలు మృదువుగా ఉంటాయి. వేలితో నొక్కితే కదులుతుంటాయి, పట్టుకుంటే జారిపోతుంటాయి. వీటికి ఎలాంటి చికిత్స అవసరం లేదు. అలాగే ఉన్నా ఏమీ కాదు. మున్ముందు ఇతరత్రా ఇబ్బందులేవీ ఉండవు. అయితే ముఖం, మెడ వంటి చోట్ల చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తున్నా.. గడ్డలు పెద్దగా అవుతున్నా, నొప్పి పెడుతున్నా తొలగించుకోవచ్చు. చిన్నపాటి కోతతో వీటిని తేలికగానే తీసేయొచ్చు. అయితే న్యూరోఫైబ్రోమాటోసిస్‌ జబ్బులోనూ నాడీకణజాలం మీద గడ్డలు ఏర్పడుతుంటాయి. అందువల్ల మీకు వచ్చినవి కొవ్వు గడ్డలేనా? న్యూరోఫైబ్రోమాటిసిసా? అనేది చూడాల్సి ఉంటుంది. నాడీకణజాలం మీద ఏర్పడే గడ్డలు కూడా లైపోమా మాదిరిగానే మృదువుగా ఉంటాయి. కానీ గడ్డలతో పాటు ఒంటి మీద ముఖ్యంగా చంకల్లో చిన్నగా, గుండ్రంగా నల్లటి మచ్చలు (ఫ్రెకిల్స్‌).. కాఫీ రంగులో మచ్చలు కూడా ఏర్పడుతుంటాయి. ఇలాంటివి లేకపోతే లైపోమాగా భావించొచ్చు. దీనికి భయపడాల్సిన పనిలేదు. మీరు చర్మ నిపుణుడిని సంప్రదిస్తే పరీక్షించి ఎలాంటి రకం గడ్డలనేవి నిర్ధరిస్తారు. అవసరమైతే గడ్డ నుంచి చిన్న ముక్క తీసి పరీక్షిస్తారు.

చిరునామా: సమస్య-సలహా,
సుఖీభవ, ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512
email: sukhi@eenadu.in

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని