ఛాతీలో ఎడమ వైపు నొప్పి?

నాకు 75 ఏళ్లు. ఛాతీలో ఎడమ వైపున నొప్పి వస్తోంది. కొద్దిసేపటి తర్వాత తగ్గుతోంది. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉన్నాయి. గ్యాస్‌, అసిడిటీతో నొప్పి వస్తుండొచ్చని డాక్టర్లు అన్నారు.

Published : 19 Apr 2022 02:29 IST

సమస్య: నాకు 75 ఏళ్లు. ఛాతీలో ఎడమ వైపున నొప్పి వస్తోంది. కొద్దిసేపటి తర్వాత తగ్గుతోంది. ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉన్నాయి. గ్యాస్‌, అసిడిటీతో నొప్పి వస్తుండొచ్చని డాక్టర్లు అన్నారు. ఛాతీలో మంట తగ్గటానికి మందులు వాడుతున్నాను. కానీ ఫలితం లేదు. తగిన సలహా ఇవ్వగలరు.

- అమరు, సిద్దిపేట

సలహా: గుండెజబ్బులు, జీర్ణరసాలు గొంతులోకి ఎగదన్నుకొని రావటం (రిఫ్లక్స్‌) మాత్రమే కాదు.. ఇతరత్రా సమస్యలూ ఛాతీలో ఎడమ వైపున నొప్పికి కారణం కావచ్చు. మీరు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు నార్మల్‌గానే ఉన్నాయని అంటున్నారు. అందువల్ల గుండెజబ్బేమీ కారణం కాదని తెలుస్తోంది. ఛాతీ మంట తగ్గటానికి మందులు వాడుతున్నా ఫలితం కనిపించటం లేదంటే ఎముకలు, కండరాల సమస్యల వంటివేవైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినా, కండరం నలిగినట్టు అయినా నొప్పి వచ్చే అవకాశముంది. వృద్ధుల్లో సహజంగానే ఎముకలు బోలుగా అవుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా ఎముకలు విరగొచ్చు. స్వల్పంగా ఎముక విరిగితే పైకి ఏమీ తెలియదు. కానీ నొప్పి వస్తుంటుంది. ఎదురు రొమ్ములో పలుచటి పొడవాటి ఎముక(స్టెర్నమ్‌)ను, పక్కటెముకను అనుసంధానం చేసే మృదులాస్థి వాచినా నొప్పి పుట్టొచ్చు. దీన్నే కాస్టోకాండ్రయిటిస్‌ అంటారు. ఇది గుండెపోటు, ఇతర గుండెజబ్బుల మాదిరిగానే కనిపిస్తుంటుంది. ఊపిరితిత్తుల సమస్యతోనూ ఛాతీలో నొప్పి రావొచ్చు. కానీ ఇందులో దగ్గు, జ్వరం, కఫం పడటం వంటివీ ఉంటాయి. మీరు వీటి గురించి తెలపలేదు. కొన్నిసార్లు నాడుల మూలంగానూ నొప్పి (న్యూరాల్జియా) రావొచ్చు. ఏదేమైనా ఛాతీ ఎక్స్‌రే తీస్తే ఎముకల సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుస్తుంది. అవసరమైతే ఎముక స్కాన్‌ కూడా చేయాల్సి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే పరీక్షలు చేసి, చికిత్స సూచిస్తారు.


చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని